
ఓటీటీలో హృతిక్ రోషన్ ‘స్టార్మ్’ మొదలైంది.పార్వతి తిరువోత్తు, ఆలియా .ఎఫ్, శ్రిష్టి శ్రీవాత్సవ, సబా ఆజాద్ ప్రధానపాత్రల్లో నటించనున్న వెబ్ సిరీస్ ‘స్టార్మ్’ (వర్కింగ్ టైటిల్). ముంబై నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ సిరీస్‌కు అజిత్‌పాల్ సింగ్ దర్శకత్వం వహిస్తారు. ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌కు హృతిక్ రోషన్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. శుక్రవారం ఈ ‘స్టార్మ్’ సిరీస్‌ను ప్రకటించి త్వరలోనే షూటింగ్ ఆరంభించనున్నట్లుగా మేకర్స్ తెలిపారు.
హృతిక్ రోషన్‌కు నిర్మాతగా ఓటీటీలో తొలిప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. ‘‘భారతీయ వినోద రంగంలో నేను నిర్మాతగా పరిచయం అవుతున్నాను. ఇండస్ట్రీలో నటుడిగా నేను 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇలా కొత్త అడుగు వేయడం చాలా సంతోషంగా ఉంది. యూనివర్సల్ అప్పీల్ ఉన్న ‘స్టార్మ్’ సిరీస్ కథనం ఆకట్టుకుంటుంది’’ అని హృతిక్ రోషన్ పేర్కొన్నారు.