Rana Daggubati: హీరో రానాపై కోర్టు ధిక్కరణ కేసు..విచారణకు హాజరు

Hero Rana Daggubati Attend City Civil Court In Land Dispute Issue - Sakshi

కోర్టు ధిక్కారణ కేసులో హాజరు 

సాక్షి, హైదరాబాద్‌(బంజారాహిల్స్‌): కోర్టు ధిక్కరణ కేసులో సినీ నటుడు రానా దగ్గుబాటి మంగళవారం సివిల్‌ కోర్టుకు హాజరయ్యారు.  వివరాల్లోకి వెళ్తే... ఫిలింనగర్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీలో ప్లాట్‌ నెం. 2 సినీ నటి మాధవి (మాతృదేవోభవ హీరోయిన్‌)కు సొసైటీ కేటాయించింది. అయితే ఆమె 2200 గజాల ప్లాట్‌ను సినీ నిర్మాత సురేష్‌ దగ్గుబాటి, వెంకటేశ్‌కు విక్రయించి వెళ్లిపోయింది. సదరు స్థలంలో వెయ్యి గజాలు నిర్మాత సురేష్‌ దగ్గుబాటి పేరు మీద, 1200 గజాలు హీరో వెంకటేష్‌ పేరున  ఉన్నాయి.

2014లో ఈ స్థలంలోని రెండు ప్లాట్లను ఎమ్మెల్యే కాలనీకి చెందిన నందకుమార్‌ అనే వ్యాపారికి లీజు అగ్రిమెంట్‌ చేశారు. నెలకు రూ. 2 లక్షలు చెల్లించే విధంగా ఈ రెండు ప్లాట్లను లీజు అగ్రిమెంట్‌చేయగా 2014లో ఒకసారి, 2016లో మరోసారి లీజు రెన్యూవల్‌ జరిగింది. 2017లో ఈ ప్లాట్‌ను విక్రయించేందుకు సిద్ధమై లీజు అగ్రిమెంట్‌లో ఉన్న నందకుమార్‌ను సంప్రదించారు. గజం రూ.1.80 లక్షలు చొప్పున నందకుమార్‌ ఈ ప్లాట్‌ మొత్తానికి రూ. 6 కోట్లు చెల్లించి అగ్రిమెంట్‌ ఆఫ్‌సేల్‌ చేసుకున్నాడు.

అయితే ఈ ప్లాట్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో వేరే వ్యాపారి వచ్చి ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పడంతో నందకుమార్‌ అగ్రిమెంట్‌ను పక్కన పెట్టి మరో వ్యక్తికి సేల్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ చేశారు. 2017లో ఈ ఒప్పందం ఉల్లంఘించగా నందకుమార్‌ కోర్టును ఆశ్రయించాడు. ఒకరికి తెలియకుండా మరొకరికి దగ్గుపాటి సురేష్‌ ఈ సేల్‌ అగ్రిమెంట్‌చేసినట్లుగా కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఇదిలా ఉండగానే దగ్గుపాటి సురేష్‌ ఈ ప్లాట్‌లోని వెయ్యి గజాలను తన కుమారుడు రానా  దగ్గుబాటి పేరున రిజిస్ట్రేషన్‌ చేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు బాధితులు కోర్టును ఆశ్రయించడంతో రానా దగ్గుబాటికి కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేయగా మంగళవారం ఆయన కోర్టుకు హాజరయ్యారు. 

ఇంకోవైపు ఏ సొసైటీలోనైనా ఒక వ్యక్తికి ఒకే ప్లాట్‌ ఉండాలని బైలాస్‌ నిర్ధేశిస్తున్నాయి. ఫిలింనగర్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీలో నిర్మాత సురేష్‌ దగ్గుబాటికి ఇప్పటికే ఓ ప్లాట్‌ ఉండటంతో ప్రస్తుతం వివాదంలో ఉన్న ప్లాట్‌ నెంబర్‌ 2లో కూడా ఆయనకు మరో ప్లాట్‌ ఉంది. దీంతో బైలాస్‌కు విరుద్ధంగా ఉంటుందన్న ఉద్దేశంతో అడ్డదారుల్లో తన కుమారుడు రానా పేరు మీద వెయ్యి గజాల ప్లాట్‌ను రిజిస్ట్రేషన్‌ చేశాడని బాధితుడు నందకుమార్‌ ఆరోపించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top