
హిట్ ఇచ్చిన దర్శకులతో రెండో సినిమా చేస్తున్న తెలుగు అగ్ర హీరోలు
ఇండస్ట్రీలో కొత్త కాంబినేషన్‌లు, హిట్ కాంబినేషన్‌లు రిపీట్ కావడం కొత్తేం కాదు. ఇప్పటికే కొన్ని సీక్వెల్స్, ఫ్రాంచైజీల కోసం హీరో–దర్శకుల కాంబో రిపీట్ అవుతోంది. సీక్వెల్, ఫ్రాంచైజీలకు అదే కాంబినేషన్ కుదరడం కామన్‌గా జరుగుతుంటుంది. వీటిని పక్కన పెడితే... ఆల్రెడీ ఒక సినిమాకి కలిసి... ఇప్పుడు మరో సినిమాకి కలిసిన హీరో–డైరెక్టర్ కాంబినేషన్ ‘వన్స్‌మోర్’ అంటూ రిపీట్ అవుతోంది. తమకు హిట్ ఇచ్చిన దర్శకులతో రెండోసారి సినిమా చేస్తున్న కొందరు హీరోలపై మీరూ ఓ లుక్ వేయండి.
ఇండస్ట్రీలో కొత్త కాంబినేషన్‌లు, హిట్ కాంబినేషన్‌లు రిపీట్ కావడం కొత్తేం కాదు. ఇప్పటికే కొన్ని సీక్వెల్స్, ఫ్రాంచైజీల కోసం హీరో–దర్శకుల కాంబో రిపీట్ అవుతోంది. సీక్వెల్, ఫ్రాంచైజీలకు అదే కాంబినేషన్ కుదరడం కామన్‌గా జరుగుతుంటుంది. వీటిని పక్కన పెడితే... ఆల్రెడీ ఒక సినిమాకి కలిసి... ఇప్పుడు మరో సినిమాకి కలిసిన హీరో–డైరెక్టర్ కాంబినేషన్ ‘వన్స్‌మోర్’ అంటూ రిపీట్ అవుతోంది. తమకు హిట్ ఇచ్చిన దర్శకులతో రెండోసారి సినిమా చేస్తున్న కొందరు హీరోలపై మీరూ ఓ లుక్ వేయండి.
ఫ్యారడైజ్ ప్రపంచం
నానీలోని మాస్ యాక్షన్ యాక్టింగ్‌ను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల స్క్రీన్‌పై చక్కగా చూపించారు. 2023 మార్చి 30న విడుదలైన ఈ ‘దసరా’ చిత్రం రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. దర్శకుడిగా ఈ ‘దసరా’యే శ్రీకాంత్ ఓదెలకు తొలి సినిమా. అయితే తన రెండో సినిమా ‘ఫ్యారడైజ్’ని కూడా నానీతో చేస్తున్నారు శ్రీకాంత్ ఓదెల. ‘దసరా’ సినిమాను నిర్మించిన సుధాకర్ చెరుకూరియే ఈ ‘ఫ్యారడైజ్’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో నాని సికింద్రాబాద్ కుర్రాడిగా కనిపిస్తారని, స్క్రీన్‌పై ఆడియన్స్ ఓ కొత్త ప్రపంచాన్ని చూసేలా శ్రీకాంత్ ఓదెల స్క్రీన్‌ప్లే డిజైన్ చేశారని సమాచారం.
ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఓ సరికొత్త పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్‌లో నాని కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలోని హీరోయిన్‌పాత్రకు మేకర్స్ జాన్వీ కపూర్, కయాదు లోహర్ వంటి వారి పేర్లను పరిశీలిస్తున్నారని, త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ రానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమాని ఇంగ్లిష్, స్పానిష్‌లతో సహా ఎనిమిది భాషల్లో రిలీజ్ చేయనున్నామని మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. ‘ది ఫ్యారడైజ్’ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానుంది. ‘దసరా’ సినిమా మార్చి 30న విడుదలై, హిట్‌గా నిలిచింది. సో... ఆ సెంటిమెంట్ ప్రకారం మార్చి చివరి వారంలోనే ‘ది ఫ్యారడైజ్’ సినిమా రిలీజ్‌ను మేకర్స్ షెడ్యూల్ చేసినట్లుగా తెలుస్తోంది.
బర్త్ డేకి అనౌన్స్‌మెంట్?
హీరో బాలకృష్ణ–దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘వీరసింహారెడ్డి’. 2023 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. దీంతో బాలకృష్ణతో మరో యాక్షన్ మూవీనిప్లాన్ చేశారట గోపీచంద్. ఇటీవల బాలకృష్ణకు గోపీచంద్ ఓ కథ చెప్పగా, ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పారట. జూన్ 10న బాలకృష్ణ బర్త్ డే. ఈ సందర్భంగా బాలకృష్ణ–గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లోని సినిమా అనౌన్స్‌మెంట్ రానుందని సమాచారం. ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శ్రీనుతో ‘అఖండ 2’ సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. ఈ ఏడాది సెప్టెంబరు 25న ఈ సినిమా రిలీజ్ కానుంది. దీంతో ‘అఖండ 2’ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లోని సినిమా చిత్రీకరణ ప్రారంభం కావొచ్చని ఊహించవచ్చు. ఈ సినిమాను కేవీఎన్ ప్రోడక్షన్స్ లేదా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు నిర్మించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
పన్నెండేళ్ల తర్వాత...
పన్నెండేళ్ల క్రితం హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రకటన రెండు సంవత్సరాల క్రితమే వచ్చినప్పటికీ పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటం, ముందే అంగీకరించిన సినిమాలను పూర్తి చేయాల్సి రావడం వంటి కారణాల చేత పూర్తి స్థాయి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు.
ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో తిరిగి ఫుల్ ప్లెజ్డ్‌గా ప్రారంభం కానున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే... ‘గబ్బర్‌సింగ్’ సినిమాలోపోలీస్ ఆఫీసర్‌గా నటించిన పవన్ కల్యాణ్, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోనూ పోలీసాఫీసర్‌గా నటిస్తుండటం విశేషం. తమిళ హిట్ మూవీ విజయ్ ‘తేరీ’కి తెలుగు రీమేక్‌గా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా రూపొందుతుందనే టాక్ వినిపించింది. కానీ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా కోసం పవన్ కల్యాణ్ ఓ కొత్త కథను సిద్ధం చేయమని దర్శకుడు హరీష్ శంకర్‌కు చెప్పారని, ఆయన ఈ స్క్రిప్ట్‌ను మరింత మెరుగులు దిద్దే పనిలో ఉన్నారని టాక్. ప్రస్తుతం సుజిత్ ‘ఓజీ’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు పవన్ కల్యాణ్. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబరులో రిలీజ్ కానుందనే టాక్ వినిపిస్తోంది.
మళ్లీ విలేజ్‌లో?
రామ్‌చరణ్ కెరీర్‌లో ‘రంగస్థలం’ బ్లాక్‌బస్టర్ మూవీ. ఈ సినిమా దర్శకుడు సుకుమార్‌తో రామ్‌చరణ్ మరో మూవీ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చి ఏడాదిన్నరపైనే అవుతున్నా చిత్రీకరణ ఇంకా మొదలు కాలేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో తలమునకలై ఉన్నారు దర్శకుడు సుకుమార్. ఇటీవల విదేశాలకు వెళ్లి ఈ సినిమా స్క్రిప్ట్‌పై హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్‌లు చర్చలు కూడా జరిపారు.
అయితే ఈ సినిమా ‘రంగస్థలం’ సినిమా స్టైల్లోనే విలేజ్ నేపథ్యంలో ఉంటుందా? లేక సరికొత్తగా మోడ్రన్ స్టైల్లో ఉంటుందా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమాలోని హీరోయిన్‌పాత్రకు రష్మికా మందన్నా, సమంత, మృణాల్ ఠాకూర్ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమాతో బిజీగా ఉన్నారు. దర్శకుడు సుకుమార్ శిష్యుడు, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న విడుదల కానుంది.
19వ శతాబ్దం నేపథ్యంలో...
విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ‘టాక్సీవాలా’ సినిమా 2018లో విడుదలై, ఆడియన్స్‌ను మెప్పించింది. ఈ సినిమాకు దర్శకుడు రాహుల్ సంకృత్యాన్. ఈ హిట్ ఫిల్మ్ తర్వాత విజయ్ దేవరకొండ–దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ మళ్లీ ఓ సినిమా చేస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ మూవీ విజయ్ దేవరకొండ కెరీర్‌లో 14వ చిత్రం. 19వ శతాబ్దం నేపథ్యంలో బ్రిటిష్ పరిపాలన కాలంలో ఈ మూవీ కథనం ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
1854–1878 మధ్య జరిగిన చారిత్రక సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మికా మందన్నా దాదాపు ఖరారయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఇక గతంలో విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నాల కాంబినేషన్‌లో వచ్చిన ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ సినిమాలు విజయాలు సాధించిన నేపథ్యంలో, మళ్లీ విజయ్–రష్మికల కాంబోపై ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్, విజయ్–రష్మికల కాంబోపై అతి త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం.
స్పోర్ట్స్ డ్రామా!
నితిన్ కెరీర్‌లో ‘ఇష్క్’ (2012) సూపర్ హిట్ ఫిల్మ్. ఈ సినిమాకు విక్రమ్ కే కుమార్ దర్శకుడు. అయితే ‘ఇష్క్’ (2012) చిత్రం తర్వాత పన్నెండేళ్లకు మళ్లీ హీరో నితిన్, దర్శకుడు విక్రమ్ కే కుమార్‌ల కాంబినేషన్ కుదిరింది. కొంత గ్యాప్ తర్వాత దర్శకుడు విక్రమ్ కె. కుమార్‌తో మళ్లీ తాను ఓ సినిమా చేస్తున్నానని, ఇది స్పోర్ట్స్ డ్రామా మూవీ అని, లార్జ్ స్కేల్‌లో ఉండబోతుందని, తెలుగు ఆడియన్స్ ఓ కొత్త సినిమాను చూసిన అనుభూతిని పొందుతారని ఇటీవల నితిన్ ఓ ఇంటర్వ్యూ వేదికగా చెప్పారు.
వీళ్లే కాదు... ఇంకా మరికొందరు హీరో–దర్శకుల హిట్ కాంబో రిపీట్ కానుందని సమాచారం. – ముసిమి శివాంజనేయులు