
బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా, రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లుగా నటించిన చిత్రం సోలో బాయ్. అనిత చౌదరి, పోసాని కృష్ణ మురళి, అరుణ్ కుమార్, భద్రం, షఫీ, ఆర్కే మామ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నవీన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రిలోక్ సిద్దు సినిమాటోగ్రాఫర్‌గా, జుడా సంధ్య మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేశారు. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీమతి వినాద్రి, బేబీ నేహా శ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మించారు. జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
డైరెక్టర్ అవుదామని వచ్చి..
ఈ సందర్భంగా వివి వినాయక్ మాట్లాడుతూ... "నిర్మాత సతీష్ ఒక దర్శకునిగా ఇండస్ట్రీకి వచ్చి బట్టల రామస్వామి బయోపిక్ ద్వారా నిర్మాతగా మారారు. ఎంతో కష్టపడి చాలా సాధారణ స్థాయి నుంచి ఇక్కడ వరకు వచ్చారు. ఈ చిత్రంలో నటించిన గౌతమ్ కృష్ణకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను" అన్నారు. రఘు కుంచె మాట్లాడుతూ... "నిర్మాత సతీష్ నాకు ఎంతోకాలంగా పరిచయం. ఆయన ఓటీటీ ద్వారా విడుదల చేసిన బట్టల రామస్వామి బయోపిక్ మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఆర్పీ పట్నాయక్ గారితో కలిసి చేసిన కాఫీ విత్ ఎ కిల్లర్ ఎంతో పాపులర్ అయింది. ఇప్పుడు సోలో బాయ్ మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా" అన్నారు.
బిగ్‌బాస్ నుంచి హీరోగా..
హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ... "నేను బిగ్‌బాస్‌కు వెళ్లక ముందు ఈ సినిమా మొదలైంది. నాకు ఎటువంటి ఫేమ్ లేని సమయంలో నన్ను నమ్మి సతీష్ గారు ఈ సినిమా మొదలుపెట్టారు. దానికి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చిత్ర పరిశ్రమలో ఎటువంటి పరిచయాలు లేకుండా కేవలం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి ఇలా ఒక సినిమాలో హీరోలా నిలబడటం అనేది చాలా పెద్ద విషయం. నేను దాన్ని ఒక సక్సెస్ లా చూస్తున్నాను.
మర్యాద ఇచ్చి మాట్లాడండి
అలాగే దివంగత జవాన్ మురళి నాయక్ గారి కుటుంబానికి మేము అండగా నిలిచి ఆర్థిక సాయం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది సోషల్ మీడియాలో ఆ కుటుంబానికి ఇప్పటికే ఎంతోమంది సహాయం చేశారు, ఇంకా మీరు ఎందుకు ఇస్తున్నారు? అని అన్నారు. మురళి నాయక్ అనే వ్యక్తి ఒక సైనికుడు. ఆయనకు మర్యాద ఇచ్చి మాట్లాడండి. జై హింద్" అంటూ ముగించారు. సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో గౌతమ్.. మురళీ నాయక్ పేరెంట్స్‌కు రూ.1 లక్ష ఆర్థిక సాయం చేశాడు.
చదవండి: మీ చేతిలో కీలుబొమ్మలం కాదు.. స్నేహితురాలిని పెళ్లాడిన నటి!?