
‘‘నాకు ఇండియాతో ఎంతో అనుబంధం ఉంది. నా యంగ్ ఏజ్‌లో నేను ఎక్కువగా ఇక్కడి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాను. ఇండియాలో గడిపిన తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. ‘ఎల్2ఈ ఎంపురాన్’(L2E Empuraan) సినిమాలో నటించడంతో మళ్లీ నా ఇంటికి వచ్చినట్టు అనిపించింది’’ అని ప్రముఖ హాలీవుడ్ నటుడు జెరోమ్ ఫ్లిన్ (Jerome Flynn)(‘గేమ్ ఆఫ్ థ్రోన్స్, జాన్ విక్ చాప్టర్ 3, సోల్జర్ సోల్జర్, బ్లాక్ మిర్రర్’ ఫేమ్) తెలిపారు.
మోహన్‌లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీ ‘లూసిఫర్’ (2019)కి సీక్వెల్‌గా ‘ఎల్2ఈ ఎంపురాన్’ మూవీ రూపొందింది. సీక్వెల్‌లోనూ మోహన్‌లాల్ హీరోగా నటించగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో నటించడంతోపాటు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో జెరోమ్ ఫ్లిన్ చేసిన బోరిస్ ఆలివర్‌పాత్రని రివీల్ చేశారు. జెరోమ్ ఫ్లిన్ మాట్లాడుతూ– ‘‘ఖురేషి (మోహన్‌లాల్‌పాత్ర పేరు) ప్రయాణంలో బోరిస్ ఆలివర్‌ది ఒక ముఖ్యమైనపాత్ర. ఈ క్యారెక్టర్‌ని ప్రేక్షకులు ఇష్టపడతారు’’ అని పేర్కొన్నారు. మార్చి 27న మలయాళం, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.