ఓటీటీకే ఓటు

Filmmakers make gains on OTT platforms - Sakshi

మేము సైతం అంటున్న స్టార్స్‌

థియేటర్స్‌ ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని అనిశ్చితిలో దక్షిణాదిన ఓటీటీ బాట పట్టిన తొలి సినిమా సూర్య నిర్మించిన ‘పొన్‌ మగళ్‌ వందాళ్‌’. జ్యోతిక లీడ్‌ రోల్‌లో నటించారు. ఈ నిర్ణయం వల్ల తమిళ డిస్ట్రిబ్యూటర్స్‌ సంఘం నుంచి సూర్యకు బెదిరింపులు ఎదురయ్యాయి. ఇకపై సూర్య నటించే సినిమాలను థియేటర్స్‌లో ప్రదర్శించమన్నారు. ఇది జరిగి ఆల్రెడీ మూడు నెలలయింది. కానీ ఆ తర్వాత వరుసగా పలు సినిమాలు ఓటీటీలో విడుదలకు రెడీ కావడంతో పంపిణీదారుల నుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదనే చెప్పాలి. మీడియమ్‌ బడ్జెట్‌ సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి.

ఇప్పుడు పెద్ద బడ్జెట్‌ చిత్రాలు కూడా రాబోతున్నాయి. థియేటర్స్‌ ఎప్పుడు తెరుస్తారు? తెరిస్తే ప్రేక్షకులు థియేటర్స్‌ వరకూ వస్తారా? రారా అన్నది ఇంకా ప్రశ్నార్థకమే. అందుకే సూర్య మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆయన నటించిన పెద్ద బడ్జెట్‌ సినిమా ‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’) చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. సూర్య బాటలోనే పలువురు తమిళ స్టార్‌ హీరోలు తమ సినిమాలు కూడా ఓటీటీలో విడుదల చేయాలనుకుంటున్నారని టాక్‌. విజయ్‌ నటించిన ‘మాస్టర్‌’, విశాల్‌ నటించిన ‘చక్ర’, ధనుష్‌ ‘జగమే తందిరం’, ‘జయం’ రవి ‘భూమి’ కూడా ఓటీ టీలో విడుదలవుతాయని టాక్‌. ఈ చిత్రాల వివరాలు చూద్దాం.

మాస్టర్‌
తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ నటించిన తాజా చిత్రం ‘మాస్టర్‌’. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకుడు. ఈ సినిమాలో కాలేజ్‌ ప్రొఫెసర్‌ పాత్రలో నటించారు విజయ్‌. ఆ మధ్య ‘మాస్టర్‌’ ఓటీటీలో వస్తోందనే వార్తలను ఈ చిత్రనిర్మాత గ్జేవియర్‌ బ్రిట్టో కొట్టిపారేశారు. ‘మాస్టర్‌’ కచ్చితంగా థియేటర్స్‌లోనే వస్తాడని స్పష్టం చేశారు. కానీ ఈ సినిమా ఓటీటీలోనే విడుదల కానుందనే వార్త మరోసారి ప్రచారంలోకి వచ్చింది. మరి.. ‘మాస్టర్‌’ ప్లాన్‌ ఏంటో చూడాలి.

జగమే తందిరం  
ధనుష్‌ హీరోగా నటించిన గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ‘జగమే తందిరం’. తెలుగులో ‘జగమే తంత్రం’గా విడుదల కానుంది. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకుడు. యస్‌. శశికాంత్‌  నిర్మాత. ఈ చిత్రం మే 1న విడుదల కావాలి. అయితే కరోనా వల్ల వాయిదా పడింది. మీకు ఇబ్బంది అయితే ఓటీటీలో అయినా విడుదల చేసుకోండి అని ధనుష్‌ తన నిర్మాతలకు చెప్పినట్టు చిత్రబృందం ఆ మధ్య తెలిపింది.

భూమి
‘జయం’ రవి, నిధీ అగర్వాల్‌ నటించిన చిత్రం ‘భూమి’. రైతుల సమస్యల కథాంశంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం కూడా మే 1న విడుదల కావాలి. కానీ వాయిదా

సూరరై పోట్రు
సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సూరరై పోట్రు’. తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’గా విడుదలవుతుంది. పైలట్‌ కావాలని కలలుకనే వ్యక్తిగా సూర్య కనిపించనున్నారు. ఆయన గురువుగా మోహన్‌బాబు నటించారు. సూర్య సొంత బ్యానర్‌ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమాను అమేజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు సూర్య. ‘‘సినిమాను ప్రేక్షకుల వద్దకు సరైన సమయంలో తీసుకెళ్లడం నిర్మాత పని. ఈ నిర్ణయాన్ని నటుడిగా కాదు.. నిర్మాతగా తీసుకున్నాను. మళ్లీ థియేటర్స్‌ ప్రారంభం అయి అందరూ సంతోషంగా థియేటర్స్‌కి వెళ్లే సమయానికి మరో సినిమాతో సినిమా హాళ్లలో వినోదం అందిస్తాను’’ అన్నారు సూర్య. అలాగే కోవిడ్‌ కోసం కష్టపడుతున్న వారికి 5 కోట్లు విరాళాన్ని (ఈ చిత్రం రిలీజ్‌ ఖర్చులలో నుంచి) కూడా ఈ సందర్భంగా ప్రకటించారు. అక్టోబర్‌ 30 నుంచి ఈ సినిమా ప్రైమ్‌లో స్ట్రీమ్‌ కానుంది.
 

చక్ర
విశాల్‌ హీరోగా నటించి, నిర్మించిన యాక్షన్‌ చిత్రం ‘చక్ర’. శ్రద్ధా  శ్రీనాథ్, రెజీనా కథానాయికలు. ఆన్‌లైన్‌ మోసాల నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుంది. యంయస్‌ ఆనందన్‌ దర్శకుడు. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇటీవల విడుదలయిన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఈ చిత్రం కూడా ఓటీటీలోనే రిలీజ్‌ అని సమాచారం.

థియేటర్స్‌ ఓపెన్‌ అయ్యేవరకూ వేచి చూడటం కన్నా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఓటీటీయే బెస్ట్‌ అనే ఆలోచనతో ఓటీటీకే స్టార్స్‌ ఓటు వేస్తున్నారని ఊహించవచ్చు. నిర్మాతకు లాభసాటిగా ఉంటే ఓటీటీయే బెస్ట్‌ అని అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. మళ్లీ థియేటర్స్‌కి వెళ్లడం సాధారణం అయ్యాక సినిమాలను ఎప్పటిలానే నేరుగా థియేటర్స్‌లోనే విడుదల చేస్తారు. ఎందుకంటే ‘బిగ్‌ స్క్రీన్‌’లో సినిమా చూస్తే ఆ అనుభూతే వేరు. ఇది మొత్తం సినిమా పరిశ్రమ అంటున్న మాట.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top