'ఒక్క ఫోటో దిగితే చాలనుకున్నా'.. చిరు అభిమాని ఎమోషనల్

Fan Emotional After Meet With Megastar Chiranjeevi In Hyderabad - Sakshi

ఎవరైనా తమ అభిమాన హీరోని కలవాలని కలలు కనడం సహజం. మరి అందరికీ అలాంటి అవకాశం వస్తుందా? చాలామంది అభిమానులకు తాము దేవుడిలా ఆరాధించే అభిమాన హీరోను కలవాలన్న కల కలగానే మిగిలిపోతుంది. ఒకవేళ మీ అభిమాన హీరోని కలుసుకుని ఆతిథ్య స్వీకరిస్తే ఇక ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. చిరకాల కోరిక నేరవేరితే మా కళ్లలో ఆనందం మాటల్లే వర్ణించలేం. ఆ కల సాకారమైన క్షణాన మాటలు రావు. అలాంటి అరుదైన అవకాశమే ఏపీలోని అనకాపల్లి గవరపాలెంకు చెందిన మెగాస్టార్ అభిమానికి దక్కింది.

గవరపాలెంకు చెందిన కొణతాల విజయ్‌కు చిన్నతనం నుంచి డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. మెగాస్టార్‌ చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని డ్యాన్సర్‌గా మంచి తెచ్చుకున్నారు. పలు టీవీ షోల్లో డ్యాన్సర్‌గా కూడా చేశారు. డ్యాన్స్‌మాస్టర్‌గా, పలు ఈవెంట్లకు ఆయన న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించారు. ఓ డ్యాన్స్‌ ఈవెంట్‌లోనూ విజయ్‌ బృందం ప్రథమ స్థానం పొందింది. ఈ డ్యాన్స్ షోకు దర్శకులు రాజమౌళి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఆ సమయంలో బహుమతి ప్రదానం చేసేందుకు చిరంజీవి రావాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో హాజరు కాలేదు. దీంతో చిరును కలవాలన్న విజయ్‌ కోరిక తీరలేదు. 

చైనాలో స్థిరపడిన విజయ్

డ్యాన్స్ మాస్టర్ విజయ్‌ తన భార్య జ్యోతితో కలిసి 12 ఏళ్లుగా చైనాలో స్థిరపడ్డారు. విజయ్ దంపతులు అత్యంత కష్టమైన యోగాసనాలు వేసి గిన్నిస్‌ రికార్డు సాధించారు. ప్రపంచ రికార్డు సాధించినప్పటికీ అభిమాన హీరోని కలవలేదన్న లోటు ఆయన జీవితంలో కనిపించింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు సంతానం కాగా.. ఇటీవలే హైదరాబాద్‌ వచ్చారు. ఇండియాకు వచ్చాక పలు ఛానెల్స్ విజయ్‌ను ఇంటర్వ్యూ చేశాయి. ఈ సందర్భంగా చిన్నతనం మెగాస్టార్‌పై ఉన్న అభిమానం, విజేతగా నిలిచినా ఆయన చేతులమీదుగా బహుమతి తీసుకోలేకపోవడం వంటి విషయాలను వివరించారు. ఈ విషయం హీరో చిరంజీవి దృష్టికి వెళ్లింది. అయితే అప్పటికే విజయ్‌ చైనా తిరిగి వెళ్లిపోయారు. 

స్వయంగా కబురు పంపిన మెగాస్టార్

ఆ తర్వాత మరోసారి ఇండియా వచ్చినప్పుడు చిరంజీవి కబురు పంపారు. అభిమాన హీరో ఆహ్వానం పంపితే అంతకన్నా ఆనందం ఏముంది. ఇక వెంటనే భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్‌ వచ్చారు. ఆయన తన కుటుంబంతో కలిసి మెగాస్టార్‌ ఇంటికి వెళ్లి ఆతిథ్యం స్వీకరించారు.

చిరంజీవితో కేవలం ఒక్క ఫొటో దిగితే చాలనుకున్నా. అలాంటిది వారి కుటుంబాన్ని కలవడం నా జీవితంలో మరువలేను. ఆయన మాట్లాడితే ఎంతో ప్రేరణనిచ్చింది. గిన్నిస్‌ బుక్‌ రికార్డు సాధించినప్పుడు కూడా ఇంత ఆనందపడలేదు. చిరంజీవి దంపతులు మాకు భోజనం పెట్టి నూతన వస్త్రాలు, బహుమతులు ఇచ్చారు. మా పిల్లలను ఆడించారు. ఈ మధుర క్షణాలు ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేనివి. - విజయ్

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top