Dulquer Salmaan Talks About Sitaram Movie Deets Here | Rashmika Mandanna - Sakshi
Sakshi News home page

Dulquer Salmaan: అందుకే ప్రేమ కథలకు విరామం ఇవ్వాలనుకుంటున్నా

Published Tue, Aug 2 2022 6:34 PM

Dulquer Salmaan Talks About Sitaram Movie - Sakshi

పాన్ ఇండియా అనే ట్యాగ్ విని విని విసుగొచ్చింది. ఆ పదం వాడకుండా ఒక ఆర్టికల్ కూడా  ఉండటం లేదు. నిజానికి పాన్ ఇండియా కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, షారుఖ్ ఖాన్.. ఇలా ఎంతో మంది సినిమాలు దేశ విదేశాలు దాటి ఆడాయి. ఇప్పుడు ప్రత్యేకంగా పాన్ ఇండియా ఫిల్మ్ అని ఒత్తి చెప్పడం అవసరం లేదని నా ఫీలింగ్. ఫిల్మ్ ని ఫిల్మ్ అంటే చాలు’అని స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ అన్నారు. ఆయన హీరోగా  వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో  మృణాల్ ఠాకూర్  హీరోయిన్‌గా నటించింది. రష్మిక మందన కీలక పాత్ర పోహిస్తున్నారు. ఆగస్ట్‌ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో దుల్కర్‌ సల్మాన్‌ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

'సీతారామం'చాలా ఒరిజినల్ కథ. ఇందులో నేను ఆమ్‌ అనే ఆర్మీ అధికారి పాత్రలో కనిపిస్తాను. రామ్‌ ఒక అనాధ. అతనికి దేనిపైనా ద్వేషం ఉండదు. పాజిటివ్‌ పర్సన్‌. అతనికి దేశభక్తి చాలా ఎక్కువ. ఇలాంటి సినిమా ఇప్పటి వరకూ ఎక్కడా రాలేదు. స్క్రీన్ ప్లే నాకు చాలా నచ్చింది. ఊహాతీతంగా  ఉంటుంది. ట్రైలర్ లో చూసింది కేవలం గ్లింప్స్ మాత్రమే. సీతారామం అద్భుతాన్ని వెండితెరపై చూడాల్సిందే. 


ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. కథ విన్నప్పుడు సినిమాలో సంగీతం బావుంటుందని తెలుసు. ‘కానున్న కళ్యాణం’ పాట కాశ్మీర్ లో షూట్ చేస్తున్నప్పుడే మ్యాజికల్ గా  ఉంటుందని అర్ధమైయింది. పాటలన్నీ విజువల్ వండర్ లా వుంటాయి. ఒక పాటకు మించి మరో పాట ఆకట్టుకున్నాయి. నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా  ఉంటుంది. కానున్న కళ్యాణం పాట నా ఫేవరేట్. 


ఒక క్లాసిక్ నవల చదువుతున్నప్పుడు కొన్ని పాత్రలని ఇలా ఉంటాయేమోనని ఊహించుకుంటాం. 'సీతారామం' కథ విన్నప్పుడు సీత పాత్రని కూడా అలానే ఊహించుకున్నా. ఈ పాత్రలోకి మృణాల్ వచ్చేసరికి అద్భుతమైన ఛాయిస్ అనిపించింది. సెట్స్ లో మృణాల్ ని చూస్తే సీత పాత్రకు ఆమె తప్పితే మరొకరు న్యాయం చేయలేరేమో అనిపించింది. చాలా అద్భుతంగా చేసింది. ఇక ఆఫ్ స్క్రీన్ కూడా తను హ్యాపీ, ఎనర్జిటిక్ పర్శన్. 


ఇందులో కొత్త రష్మిక ని చూస్తారు. ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి పాత్రని చేయలేదు. సీతారామంలో రష్మిక గ్రేట్ ఎనర్జీ. 

అశ్వనీ దత్, స్వప్న గార్ల వైజయంతి మూవీస్  అంటే నాకు ఫ్యామిలీ లాంటింది. ఒక మంచి మనిషిగా అశ్వనీ దత్ గారంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన నా ఫేవరేట్ పర్శన్. చాలా పాజిటివ్ గా  ఉంటారు. ఆయన చూపించే ప్రేమ, వాత్సల్యం చాలా గొప్పగా  ఉంటుంది. నా కోసం ది బెస్ట్ ని ఎంపిక చేస్తారు. దర్శకుడు హను ఈ కథని అద్భుతంగా ప్రజంట్ చేశారు. 

ప్రేమ కథలకు కొంత విరామం ఇవ్వాలని భావిస్తున్నాను. రోజురోజుకి నా వయసు కూడా పెరుగుతుంది కదా.. ఇంకా పరిణితి గల విభిన్నమైన పాత్రలు చేయాలనీ  ఉంది. ఫ్రెష్ , ఒరిజినల్ గా  ఉండే పాయింట్ల ని చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను.

తెలుగు ప్రేక్షకులు నాపై చూపిన అభిమానం చాలా సర్ ప్రైజ్ అనిపించింది. చాలా రోజుల క్రితం హైదరాబాద్ లో ఒక ఈవెంట్ కి వచ్చినపుడు  ‘మీ సినిమా ఉస్తాద్ హోటల్ చూశాం. చాలా బావుంది' అని  ఓ ముగ్గురు కుర్రాళ్ళు చెప్పారు. అది నా రెండో సినిమా. ఆ చిత్రానికి కనెక్ట్ అవ్వడం చాలా సర్ ప్రైజ్ అనిపించింది. అలాగే నా చిత్రాలు వివిధ ఓటీటీ వేదికలపై చూసి సినిమాల పట్ల  ఉన్న ఒక ప్యాషన్ తో చాల మంది కనెక్ట్ అవ్వడం ఆనందమనిపించింది. 

నాన్న గారు నాకు ఆదర్శం. ఆయన గర్వపడేలా చేయడమే నా కర్తవ్యం. సినిమాలు, కథలు గురించి ఇంట్లో మాట్లాడుతుంటాం. నేను నా కథలని సింగిల్ లైన్ లో చెబుతుంటాను. నాన్న గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయనే నా హీరో. 

దర్శకత్వం చేసే ఆలోచన ఉంది. కానీ ఇప్పుడంత సమయం లేదు. నా దర్శకత్వంలో సినిమా వస్తే మాత్రం అది ప్రేక్షకుల ఊహకు భిన్నంగా  ఉంటుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement