డర్టీ హరి మూవీ రివ్యూ

Dirty Hari Telugu Movie Review - Sakshi

టైటిల్‌ : డర్టీ హరి
నటీనటులు : శ్రవణ్ రెడ్డి, రుహాణి శర్మ, సిమ్రత్ కౌర్, సురేఖ వాణి, అప్పాజీ, జబర్దస్త్ మహేష్ తదితరులు
నిర్మాణ సంస్థ: ఎస్‌పీజే క్రియేషన్స్‌
నిర్మాత:  గూడురు సతీష్‌ బాబు, గూడూరు సాయి పునీత్‌
స్క్రీన్‌ప్లై, దర్శకత్వం: ఎం.ఎస్‌. రాజు
సంగీతం: మార్క్ కె రాబిన్
సినిమాటోగ్రఫీ: ఎంఎన్‌ బాల్‌ రెడ్డి
ఎడిటర్‌ : జునైద్‌ సిద్ధిఖి
విడుదల తేది : డిసెంబర్‌ 18, 2020 (ఫ్రైడే మూవీస్ ఏటీటీ ‌)

కరోనా మహమ్మారి కారణంగా సినిమా థీయేటర్లన్నీ మూతబడటంతో కొత్త కొత్త మార్గాల్లో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీనియర్ నిర్మాత, దర్శకుడు ఎమ్‌.ఎస్ రాజు దర్శకత్వంలో వచ్చిన సినిమా డర్టీ హరి. ఈ చిత్రాన్ని ఫ్రైడే మూవీస్ ఏటీటీ (ఎనీ టైమ్ థియేటర్)లో డిసెంబర్ 18 సాయంత్రం 6 గంటలకు విడుదల చేసారు. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి ప్రేమ కథా చిత్రాలను నిర్మించిన ఎం.ఎస్‌. రాజు తొలి సారి  బోల్డ్ రొమాన్స్ డ్రామా సినిమాను తెరకెక్కించడం, ప్రచార చిత్రాలు కూడా వైరల్‌ కావడం సినిమాపై అంచనాలను పెంచాయి. మరి ఈ డర్టీ హరి అంచనాలను రీచ్‌ అయ్యాడో లేదో చూసేద్దాం.

కథ
మధ్యతరగతికి చెందిన హరి(శ్రవణ్‌ రెడ్డి) ఎన్నో కలలు కంటూ హైదరాబాద్‌కు వస్తాడు. అక్కడ వసుధ(రుహాని శర్మ) అనే ధనవంతుల అమ్మాయితో పరిచయడం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్తుంది.ఇంతలో వసుధ సోదరుడి గర్ల్ ఫ్రెండ్ జాస్మిన్(సిమ్రాత్ కౌర్)కు హరి ఆకర్షితుడవుతాడు.  వసుధతో ప్రేమలో ఉంటూనే జాస్మిన్‌తో ఎఫైర్ నడిపిస్తాడు. వసుధకి తెలియకుండా జాస్మిన్ వ్యవహారాన్ని హరి ఎలా దాచి పెట్టాడు?  జాస్మిన్ ఎఫైర్ సీక్రెట్ గా దాస్తూ మేనేజ్ చేసే హరి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు? ఈ చిక్కు నుంచి బయట పడటానికి డర్టీ హరి ఏం చేసాడు? అనేది మిగతా కథ.


విశ్లేషణ
వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో సక్సెస్ ఫుల్ నిర్మాత గా మారిన ఎం ఎస్ రాజు.. దర్శకుడిగా కూడా అలాంటి ప్రేమ కథా సినిమాలే తీశాడు. వాన, తూనీగ తూనీగ సినిమాలు ప్లాప్‌ అయినప్పటికీ దర్శకుడిగా ఆయన ప్రతిభకి మంచి మార్కులు పడ్డాయి. అయితే  ఈసారి ప్రేమ కథలను పక్కనబెట్టి అడల్ట్ కంటెంట్ ని నమ్ముకున్నాడు. డర్టీ హరి అనే టైటిల్ తో సినిమాలో డర్టీ ఎంతుంటుందో చెప్పకనే చెప్పేసాడు. ట్రైలర్‌లో కూడా అదే చూపించాడు. ఇలాంటి సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చవని తెలిసినా కూడా ఎంఎస్‌ రాజు తొలిసారి పెద్ద సాహసమే చేశాడు. సినిమా స్టారింగ్‌లోనే  బోల్డ్ సన్నివేశాలతో ప్రారంభించి రిచ్ లైఫ్ ని పరిచయం చెయ్యడం కోసం ప్రతి సీన్ లో ప్రతి ఒక్కరి చేతిలో మందు గ్లాస్, చేతిలో సిగరెట్స్, హీరోయిన్స్ తో స్కిన్ షోస్ తో బూతు డైలాగ్స్ తో సరిపెట్టాడు.

యువతరం ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొనే ఈ సినిమాను తెరకెక్కించాడు. శృంగారాన్ని కూడా టైటిల్‌కు తగ్గట్టే చూపించాడు. ఫస్టాఫ్‌లో ఎక్కువగా శృంగార సన్నివేశాలను చూపించిన దర్శకుడు.. సెకండాఫ్‌లో మాత్రం అసలు కథను చూపించాడు. వేరే యువతితో ఎఫైర్‌ పెట్టుకోవడం వల్ల హీరో పడే కష్టాలు,తన ఇల్లీగల్‌ సంబంధాన్ని దాచలేక ఇద్దరి హీరోయిన్స్‌ మధ్యలో నలిగిపోయే హీరో ఇబ్బందులును, ఆ ఇబ్బందులను అధిగమించే క్రమంలో ఒక హత్య జరగడం, ఆ మర్డర్‌  కేసు నుండి హీరో ఎలా తప్పించుకున్నాడు లాంటి సన్నివేశాలను ఆసక్తికరంగా చూపించాడు. అయితే సినిమా మొత్తం వాస్తవానికి దూరంగా సినిమాటిక్‌గా సాగిపోతుంది. హీరో రావడంతో ధనవంతుల అమ్మాయితే ప్రేమలో పడిపోవడం, అలాగే వేరే యువతికి ఆకర్షితుడైపోవడం.. ఇవన్ని వాస్తవానికి చాలా దూరంగా ఉన్నట్లు కనిపిస్తాయి. ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగానే సినిమా సాగుతోంది. ఇక సెకండాఫ్‌లో మాత్రం కొన్ని ట్విస్ట్‌ ఇచ్చి సినిమాను నిలబడేలా చేశాడు దర్శకుడు. సినిమాకు ప్రధాన బలం సెకండాఫ్‌ అనే చెప్పాలి. అలాగే హరి-జాస్మిన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తి కరంగా ఉంటాయి. హత్య కేసును కాస్త ఆసక్తికరంగా మలిస్తే బాగుండేది.

నటీనటులు
సినిమా మొత్తం మూడు కేరెక్టర్స్ చుట్టూనే తిరుగుతుంది. హరి పాత్రలో శ్రవణ్‌ రెడ్డి మెప్పిస్తాడు. ఆయన  డైలాగ్ డెలివరీతో పాటు,యాక్టింగ్‌ చాల బాగుంది. హీరోయిన్స్ గా నటించిన రుహని శర్మ – సిమ్రత్ కౌర్ లు తమ పాత్రల్లో చెలరేగిపోయాయిరు. సిమ్రత్ కౌర్‌ అయితే బోల్డ్ రోల్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. కేవలం శృంగార సీన్స్‌లోనే కాకుండా తన నటనతో కూడా ప్రేక్షకులను కట్టిపడేశారు.  సురేఖ వాణి, మహేష్ వంటి నటులు పాత్రల పరిధి మేర ఆకట్టుకున్నారు. మార్క్ కె రాబిన్ సంగీతం అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఎంఎన్‌ బాల్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు కథానుసారం ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌‌
కథ
శ్రవణ్‌ రెడ్డి నటన
యూత్‌ను మెప్పించే అంశాలు
సెకండాఫ్‌

మైనస్‌ పాయింట్స్‌
థ్రిలింగ్‌ అంశాలు లేకపోవడం
సన్నివేశాలు ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగానే సాగుతుండటం
ఫస్టాఫ్‌ సాగతీత
 

Rating:  
(2.75/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top