చెన్నైలో ఉండి బతికిపోయాడు.. రథన్‌పై డైరెక్టర్‌ ఫైర్‌

Director Yeshasvi Comments On  Music Director Radhan - Sakshi

సంగీత దర్శకుడు రథన్‌పై నూతన దర్శకుడు వి. యశస్వి ఫైర్‌ అయ్యాడు.  తాను తెరకెక్కించిన 'సిద్ధార్థ్‌ రాయ్‌' సినిమా ఫిబ్రవరి 23న విడుదల కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మ్యూజిక్‌ డైరెక్టర్‌పై యశస్వి పలు ఆరోపణలు చేశాడు. ఈ సినిమా షూటింగ్‌ పనులు ఎప్పుడో పూర్తి అయ్యాయి. కానీ పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ వల్ల విడుదల విషయంలో చాలా ఆలస్యమైంది. దీనికి ప్రధాన కారణం సంగీత దర్శకుడు రథన్‌ అని యశస్వి ఫైర్‌​ అయ్యాడు.

ఈ సినిమాకి సంగీతం అందించిన రథన్‌.. అవుట్ పుట్ విష‌యంలో త‌న‌ని బాగా ఇబ్బంది పెట్టాడని యశస్వి వాపోయాడు. అతను మంచి టెక్నీషియనే కావచ్చు కానీ అతని వల్ల సినిమా నలిగిపోతుంది. ఆయన గొడవ పడేందుకే మాట్లాడుతాడు. సినిమా గురించి ఏదైనా సమస్య వచ్చి అతనితో మాట్లాడితే చాలా ఎక్కువగా గొడవ పడుతాడు. రథన్‌ అనే వ్యక్తి ఒక సినిమాను పూర్తి వరకు తీసుకొచ్చి చివరి క్షణంలో వదిలేస్తాడు. రీరికార్డింగ్‌ విషయంలో నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు రథన్‌ చెన్నైలో ఉండి బతికిపోయాడు.. అదే హైదరాబాద్‌లో ఉంటే చాలా గొడవలు జరిగేవి. అని చెప్పారు.

గతంలో రథన్‌ తీరుపై దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా  కూడా  అసంతృప్తి వ్యక్తం చేశారు.  'అర్జున్‌ రెడ్డి' సినిమా విషయంలో కూడా రథన్‌ వల్ల పలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సందీప్‌ రెడ్డి వంగా గతంలో తెలిపిన విషయం తెలిసిందే. అతను టెక్నీషియ‌న్‌ అంటూనే దర్శక,నిర్మాతలను బాగా ఇబ్బందులకు గురిచేస్తాడని ఆయన తెలిపారు. రథన్‌ ఇప్పటి వరకు తెలుగులో అందాల రాక్షసి, ఎవడే సుబ్రహ్మణ్యం, హుషారు, పాగల్‌, జాతి రత్నాలు, మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించాడు.

'సిద్ధార్థ్‌ రాయ్‌' చిత్రం ఫిబ్రవరి 23న విడుదలకు రెడీగా ఉంది. ట్రైలర్‌ కూడా అర్జున్‌ రెడ్డి సినిమాను గుర్తుకు తెస్తుంది. అతడు సినిమాలో  బాల నటుడిగా అలరించిన దీపక్‌ సరోజ్‌ ఈ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

whatsapp channel

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top