
రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ ఈ నెల 14న విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్ 2’లో హీరోగా నటిస్తున్నారు ఈ సూపర్ స్టార్. ఈ చిత్రం తర్వాత ఏ దర్శకుడితో రజనీ సినిమా చేయనున్నారనే విషయం గురించి చర్చ జరుగుతోంది. హెచ్. వినోద్, వివేక్ ఆత్రేయ, నిథిలన్ స్వామినాథన్... ఇలా పలువురు దర్శకుల పేర్లు వినిపించాయి. తాజాగా శివ పేరు వినిపిస్తోంది.
రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో ‘అన్నాత్తే’ (2021) సినిమా రూపొందింది. అయితే ఈ సినిమా చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టలేదు. కానీ ఈ సినిమా తనకు బాగా నచ్చడంతో శివకు రజనీకాంత్ బంగారు గొలుసు బహుమతిగా ఇచ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ విధంగా శివ డైరెక్షన్‌ని రజనీ ఇష్టపడ్డారని ఊహించవచ్చు. తాజాగా శివ ఓ కథ చెప్పగా, ఆయన డైరెక్షన్‌లో మళ్లీ సినిమా చేయడానికి అంగీకరించారట. మరి... వార్తల్లో ఉన్న ప్రకారం డైరెక్టర్ శివని రజనీ రిపీట్ చేయనున్నారా? ఈ కాంబినేషన్‌లో మళ్లీ సినిమా వస్తుందా? చూడాలి.