
మరాఠీలో మాట్లాడనందుకు ఓ స్వీట్ షాప్ యజమానిని కొట్టిన ఘటన కలకలం రేపింది. అయితే తాను కూడా మరాఠీ మాట్లాడనని, దమ్ముంటే తనను మహారాష్ట్ర నుంచి తరిమేయండి అని సవాల్ విసిరారు భోజ్‌పురి నటుడు, బీజేపీ ఎంపీ దినేశ్ లాల్ యాదవ్ (Dinesh Lal Yadav). ఈయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం హమర్ నామ్ బా కన్హయ్య.
చెత్త రాజకీయాలు
ఈ సినిమా ప్రమోషన్స్‌లో దినేశ్ యాదవ్ మాట్లాడుతూ.. మరాఠీ మాట్లాడలేదని దాడి చేస్తారా? ఇవన్నీ చెత్త రాజకీయాలు. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకూడదు. ఇలాంటి నీచ రాజకీయాలు చేసేవారు అలాంటివాటికి దూరంగా ఉంటే బాగుంటుంది. మీకంత దమ్ముంటే నన్ను మహారాష్ట్ర నుంచి వెళ్లగొట్టండి చూద్దాం.. నేను మరాఠీ మాట్లాడను. రాజకీయ నాయకులందరికీ నేను సవాల్ విసురుతున్నా.. నేను ఇక్కడే ఉంటాను. దమ్ముంటే నన్ను మహారాష్ట్ర నుంచి తరిమేయండి.
నేర్చుకోకపోతే తప్పేం కాదు
నేను కూడా రాజకీయ నాయకుడినే.. పాలిటిక్స్ అనేవి.. ప్రజల సంక్షేమానికి ఉపయోగపడాలే తప్ప వారిని దగా చేయడానికి కాదు. ఎవరికైనా పలు భాషలు నేర్చుకోవాలనిపిస్తే నేర్చుకుంటారు. మరాఠీ అందమైన భాష.. భోజ్‌పురి, తెలుగు, తమిళం, గుజరాతీ.. ఈ భాషలన్నీ అందరూ నేర్చుకోవచ్చు. అలాగే ఎవరూ నేర్చుకోకపోయినా ఏం పర్వాలేదు. అంతేకానీ, ఫలానా భాష ఎందుకు నేర్చుకోలేదని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చారు. దినేశ్ లాల్ యాదవ్‌ను నిరాహువా అని కూడా పిలుస్తుంటారు. భోజ్‌పురిలో అనేక సినిమాలు చేసిన ఈయన హిందీ బిగ్‌బాస్ ఆరో సీజన్‌లోనూ పాల్గొన్నారు.
చదవండి: కలిసిపోయిన తెలుగు హీరోల ఫ్యాన్స్.. ఆ కన్నడ హీరోపై ట్రోలింగ్