సూపర్‌స్టార్‌ కృష్ణ అంత్యక్రియల విషయంలో మహేశ్‌బాబు తప్పు చేశాడా?

Did Mahesh Babu Make a Mistake Regarding His Father Superstar Krishna Funeral - Sakshi

సూపర్‌స్టార్‌ కృష్ణ అంత్యక్రియల విషయంలో మహేశ్‌బాబు తీసుకున్న నిర్ణయంపై కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ అభిమానులతో పాటు టాలీవుడ్‌లోని కొంతమంది ప్రముఖులు మహేశ్‌ బాబు తీరును తప్పుబడుతున్నారు. ఈ విమర్శలకు కారణం.. తన తండ్రి సూపర్‌స్టార్‌ కృష్ణ అంత్యక్రియలను ‘మహాప్రస్థానం’లో నిర్వహించడమే. ఈ విషయంలో మహేశ్‌బాబు తన కుటుంబ సభ్యుల మాట వినకుండా సొంత నిర్ణయం తీసుకున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. తన తండ్రి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా, స్మారక చిహ్నం నిర్మించే విధంగా ప్రైవేట్‌ స్థలంలో దహనసంస్కారాలు చేయాలని మహేశ్‌ ఎందుకు ఆలోచించలేదని కృష్ణ ఫ్యాన్స్‌ అంటున్నారు.

సోసైటీలో ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు మరణిస్తే.. వాళ్ల అంత్య క్రియలు వారి ప్రైవేట్‌ స్థలంలో నిర్వహిస్తుంటారు. ఇటీవల రెబల్‌స్టార్‌ కృష్ణ మరణిస్తే.. ఆయన పాంహౌస్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు దహన సంస్కారాలను అన్నపూర్ణ స్డూడియోలో  నిర్వహించారు. ఎన్టీఆర్‌ మరణించినప్పుడు  ప్రభుత్వ స్థలంలో అంత్యక్రియలు నిర్వహించి, ఎన్టీఆర్‌ ఘాట్‌ని ఏర్పాటు చేశారు. కృష్ణ సతీమణి విజయనిర్మలకు గుర్తుగా ఆమె కుమారుడు నరేశ్‌ స్మారక మందిరం కట్టించిన సంగతి తెలిసిందే. కృష్ణ అంత్యక్రియలను కూడా పద్మాలయ స్టూడియోస్‌లో నిర్వహించి, స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తే గొప్పగా ఉండేదని కృష్ణ ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు.  

అయితే మరికొంతమంది మాత్రం మహేశ్‌ నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ ఏడాదిలో మరణించిన కృష్ణ సోదరుడు రమేశ్‌ బాబు, తల్లి ఇందిరా దేవిల అంత్యక్రియలు కూడా మహా ప్రస్థానంలోనే జరిగాయని.. అందుకే తండ్రి దహనసంస్కారాలు కూడా అక్కడే నిర్వహించాడేమోనని అంటున్నారు. అయితే తండ్రి కృష్ణ విషయంలో మహేశ్‌ బాబు ఆలోచన మాత్రం మరోలా ఉంది. కృష్ణ కోసం స్మారక చిహ్నం కాకుండా ఒక మెమోరియల్‌ ఏర్పాటుకి మహేశ్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. పద్మాలయ స్టూడియో వద్ద ఈ మెమోరియల్‌ను నిర్మించాలనే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నట్టు తెలుస్తోంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top