
'ఉదయపూర్ ఫైల్స్' నిర్మాతలకు ఎదురుదెబ్బ తగిలింది. నేడు (జులై 11)న విడుదల కావాల్సిన ఈ సినిమా ప్రదర్శనపై స్టే విధిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగిన 'టైలర్ కన్హయ్య లాల్' హత్య ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఉదయపూర్ ఫైల్ ' ( Udaipur Files )... ఈ మూవీ విషయంలో ఇప్పటికే పలు అభ్యంతరాలు వచ్చాయి. ఏకంగా 150 సీన్స్‌కు సెన్సార్ బోర్ట్ కూడా అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం విడుదలైతే.. ద్వేషపూరిత ప్రసంగాన్ని ప్రోత్సహిస్తుందని, ఒక సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని ఉండటమే కాకుండా మతపరమైన ఉద్రిక్తతను రేకెత్తించగలదని వాదిస్తూ.. పిటిషనర్లు - జమియత్ ఉలామా-ఎ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ, పాత్రికేయుడు ప్రశాంత్ టండన్ దీని విడుదలపై శాశ్వత నిషేధం కోరుతూ పిటిషన్ వేశారు. ఈమేరకు సినిమా విడుదలపై ఢిల్లీ కోర్టు స్టే ఇచ్చింది. సినిమా విడుదల చేయాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి కోర్టు కేంద్రానికి వారం సమయం ఇచ్చింది.

టైలర్ కన్హయ్య లాల్ హత్య స్టోరీ ఏంటి..
2022 ఉదయపూర్లో జరిగిన టైలర్ కన్హయ్య లాల్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు గాను టైలర్ కన్హయ్య లాల్ను దారుణంగా చంపేశారు. ఇద్దరు వ్యక్తులు పట్టపగలే అతని దుకాణంలోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అచ్చం ఉగ్ర సంస్థ ఐసిస్ దుండగులను తలపించేలా గొంతు కోసి క్రూరంగా పొట్టన పెట్టుకున్నారు. 26 సార్లు కత్తితో నరికినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. పైగా దాన్ని రికార్డు చేసి వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దాంతో దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
బీజేపీ సస్పెండ్ నేత నూపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థించినందుకే హత్య చేశామంటూ హంతకులు మరో వీడియో పోస్టు చేశారు. పైగా ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఇలాగే చంపుతామని హెచ్చరించారు. ప్రవక్త వివాదం తాలూకు జ్వాలను రగిలించింది ఆయనేనని ఆరోపించారు. హత్యకు వాడిన కత్తిని చూపిస్తూ, ‘ఇది మోదీ(ప్రధానిని ఉద్దేశిస్తూ) మెడ దాకా కూడా చేరుతుంది’ అంటూ బెదిరించారు. నిందితులను రియాజ్ అక్తర్, గౌస్ మొహమ్మద్‌గా గుర్తించారు. రియాజ్ గొంతు కోయగా.. గౌస్ ఆ ఉదంతం అంతా రికార్డు చేశాడు. ఈ ఇద్దరినీ పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. హత్యకు పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థల సంబంధం ఉందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. హైదరాబాద్ నగరంతో కూడా నిందితులకు సంబంధాలు ఉన్నట్లు NIA విచారణలో తేలింది.
నుపుర్ శర్మ ఎవరు..?
న్యూఢిల్లీకి చెందిన నుపుర్ శర్మ విద్యార్థి దశ నుండి బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీలో కీలకంగా వ్యవహరించింది. 2008లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా పనిచేశారు. వృత్తి రీత్యా న్యాయవాది . 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అరవింద్ కేజ్రీవాల్‌పై పోటీ చేశారు. 31 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే, మహ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలతో పార్టీ నుంచి బీజేపీ తొలగించింది. మహ్మద్ ప్రవక్త గురించి వారి వివాహం సమయంలో అతని మూడవ భార్య ఆయిషా వయస్సు గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరానికి గురిచేశాయి. ఆ సమయంలో ఖతర్, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలు భారత్‌ను క్షమాపణ కోరాయి.
దర్శకుడు ఏమన్నారు..?
ఉదయపూర్ ఫైల్స్ సినిమా విడుదల నేపథ్యంలో దర్శకుడు భరత్ ఎస్ శ్రీనేట్ వివరణ ఇచ్చారు. ఈ మూవీ ఒక మతానికో..? విశ్వాసాకో సంబంధించినది కాదని చెప్పారు. భావజాలం, సత్యం గురించి మాత్రమే సినిమాలో ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో ఎవరి మనో భావాలను దెబ్బ తీసే కంటెంట్ ఎంత మాత్రం ఉండదని క్లారిటీ ఇచ్చారు. ఇందులో కన్హయ్య లాల్ పాత్రలో విజయ్ రాజ నటిస్తున్నారు. దుగ్గల్, రజనీష్, ప్రీతి ఘుంగియానీ, కమలేష్, సావంత్, కంచి సింగ్, ముస్తాక్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమీత్ జానీ ఈ చిత్రాన్ని నిర్మి స్తున్నారు.