Cobra Director Ajay Gnanamuthu: సినిమా హిట్‌.. కానీ ఆడియన్స్‌ని క్షమాపణలు కోరిన డైరెక్టర్‌

Cobra Director Ajay Gnanamuthu Reacts to Criticism About Confused Screenplay - Sakshi

చియాన్‌ విక్రమ్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం కోబ్రా. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం  ఆగస్ట్‌ 31న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. తొలి షో నుంచి ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీకి హిట్‌టాక్‌ వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. సినిమా నిడివి ఎక్కువ ఉందని, స్క్రీన్‌ ప్లే గందరగోళంగా ఉందంటూ సోషల్‌ మీడియా వేదికగా నెగిటివ్‌ కామెంట్స్‌ వస్తున్నాయి. అయితే తాజాగా వీటిపై డైరెక్టర్‌ స్పందిస్తూ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా లైవ్‌చాట్‌లో నెటిజన్లతో ముచ్చటించాడు డైరెక్టర్‌ జ్ఞానముత్తు.

చదవండి: జూ.ఎన్టీఆర్‌-కొరటాల చిత్రంలో అలనాటి లేడీ సూపర్‌ స్టార్‌?

ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ కథ, కథనం బాగున్నప్పటికీ క్లైమాక్స్‌ నిరాశ పరిచిందన్నాడు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘పోలీసుల నుంచి హీరో తప్పించుని  విదేశాల్లో స్వేచ్చగా బతుకున్నట్లు క్లైమాక్స్‌ రాయొచ్చు. కానీ, అలాంటి నేరస్థుడికి ఎలాంటి శిక్ష పడకపోవడం న్యాయం కాదు కదా!’ అని వివరించాడు. కోబ్రా సినిమా నిడివిపై మరో నెటిజన్‌ ప్రశ్నించగా.. ఈ చిత్రంలోని ప్రతి కీలక విషయాన్ని ప్రేక్షకుడికి చూపించాలనుకున్నామన్నారు. అందుకే నిడివి గురించి ఆలోచించలేదని చెప్పిన జ్ఞానముత్తు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన మేరకు సినిమా నిడివిని 20 నిమిషాలు తగ్గించామని చెప్పాడు.

చదవండి: వైరల్‌గా మోదీ, బీజేపీపై సమంత కామెంట్స్‌, మండిపడుతున్న నెటిజన్లు!

ఇక స్క్రీన్‌ప్లే గందరగోళంగా ఉందని మరో నెటిజన్‌ అనగా.. ‘మిమ్మల్ని గందరగోళానికి గురి చేసినందుకు క్షమించండి. ప్రతిక్షణం ఉత్కంఠకు గురిచేసే సినిమా చూసేందుకు ఓ ప్రేక్షకుడిగా నేను ఇష్టపడతాను. అందుకే కోబ్రాను తెరకెక్కించాను. సాధ్యమైతే మరోసారి మా సినిమాను చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది’ అని చెప్పుకొచ్చాడు. కాగా 7 స్క్రీన్‌ పతాకంపై ఎస్‌ఎస్‌ లలిత్‌ కుమార్‌ భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందించారు. ఇందులో విక్రమ్‌ సరసన ‘కేజీయఫ్‌’ బ్యూటీ శ్రీనిధి శెట్టి సందడి చేసింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top