
‘‘సినిమా గ్రాండియర్‌గా ఉంటే ఆడియన్స్ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ‘బాహుబలి’ సినిమా కంటే ముందు ‘మగధీర’ సినిమాను చెప్పుకునేవారు. అయితే సినిమా ఎంత గ్రాండియర్‌గా ఉన్నా, కొత్త ప్రపంచాలను సృష్టించినా, హ్యూమన్ ఎమోషన్స్ అనేవి కథలో చాలా ముఖ్యం. ‘బాహుబలి’ తర్వాత ఈ తరహాలో ఇతర ఇండస్ట్రీస్‌లోనూ సినిమాలొచ్చాయి. కానీ ప్రేక్షకుల ఎమోషన్స్‌కు కనెక్ట్ అయిన సినిమాలే విజయాలు సాధించాయి. ‘జూనియర్’ సినిమా కథలో ప్రేక్షకులను కదిలించే భావోద్వేగాలు నచ్చి, ఈ సినిమా ఒప్పుకున్నాను’’ అని సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్‌కుమార్ అన్నారు.
ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా నటించిన చిత్రం ‘జూనియర్’. రాధాకృష్ణ దర్శకత్వంలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ చిత్రం సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్‌కుమార్ చెప్పిన విశేషాలు.
⇒ ఎవరైనా కొత్తవారిని పరిచయం చేస్తున్నప్పుడు సినిమాలో డ్యాన్స్, ఫైట్స్ ఉంటే చాలనుకుంటారు. కానీ ఫ్యామిలీ డ్రామా జానర్‌కి వెళ్లరు. అయితే కొత్త హీరోగా కిరీటి ఈ చాలెంజ్ తీసుకోవడం నాకు నచ్చింది. కిరిటీ హార్డ్‌వర్కర్. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్... ఇలా అన్నీ బాగా చేశాడు. నిర్మాత సాయిగారితో ‘ఈగ’ సినిమా తర్వాత మళ్లీ ఈ సినిమా చేయడ హ్యాపీ. రాధాకృష్ణ క్లారిటీ ఉన్న దర్శకుడు.
⇒ రాజమౌళిగారి ‘ఛత్రపతి, యమదొంగ, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్’ వంటి సినిమాలకు నేను సినిమాటోగ్రాఫర్‌గా చేశాను. ఆ మధ్యలో ‘విక్రమార్కుడు, మర్యాద రామన్న’ వంటి సినిమాలకు నేను చేయలేదు. అలాగే ప్రస్తుతం రాజమౌళిగారి సినిమాకు (మహేశ్‌బాబు హీరోగా చేస్తున్న సినిమా) నేను సినిమాటోగ్రాఫర్‌గా చేయకపోవడం పట్ల షాకవ్వాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో మళ్లీ కలిసి పని చేస్తాం.
⇒ రెండు దశాబ్దాల నా కెరీర్ సంతృప్తిగా ఉంది. ‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలకు పని చేయడం నా అదృష్టం. కొత్త టెక్నాలజీ నేర్చుకుంటూ అప్‌డేట్ అవుతుంటా. టెక్నాలజీతో ఫైట్ చేయలేం. సినిమాటోగ్రఫీ పైనే కాదు మొత్తం సినిమా ఇండస్ట్రీపైన ఏఐ (కృత్రిమ మేధ) ప్రభావం ఉంటుంది. మంచి
ఉంది... చెడు ఉంది.
⇒ ప్రస్తుతం నిఖిల్ ‘స్వయంభూ’ సినిమా చేస్తున్నాను. ‘బాహుబలి’ తరహాలో ఇది కూడా రాజుల కథ. అలాగే నిఖిల్ ‘ది ఇండియా హౌస్’ సినిమా చేస్తున్నాను. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు జరిగిన కథ ఇది. వీర్ సవార్కార్ నేపథ్యంలో కథ ఉంటుంది. ఐదారు లక్షల లీటర్ల వాటర్ ఉన్న ఓ ట్యాంకులో సముద్రం నేపథ్యంలో వచ్చే సన్నివేశాల చిత్రీకరణ జరిపే ప్లాన్ చేశాం. కానీ సెట్స్‌లో వాటర్ ట్యాంకు పేలి, ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఏం కాలేదు.
⇒ హాలీవుడ్‌లో ఐమ్యాక్స్ కెమెరాలతో చిత్రీకరణ జరుగుతోంది. క్రిస్టోఫర్ నోలన్ వంటివారు అలా చేస్తున్నారు. ఓ సినిమాను ఐమ్యాక్స్ కెమెరాలతో చిత్రీకరించాలా? లేదా? అనేది ఆ సినిమా దర్శక–నిర్మాతల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఐమ్యాక్స్ కెమెరాతో చిత్రీకరించినప్పుడు హాలీవుడ్‌లో మంచి థియేటర్స్ దొరుకుతాయి. ఇక భవిష్యత్తులో దర్శకత్వం చేసే ఆలోచన ఉంది.