టాలీవుడ్‌లో మాస్‌ జాతర.. పూనకాలు తెప్పిస్తారట! | Chiranjeevi, Balakrishna, Prabhas And Other Heroes Upcoming All Mass Movies Of 2023 | Sakshi
Sakshi News home page

Tollywood Mass Movies: టాలీవుడ్‌లో మాస్‌ జాతర.. పూనకాలు తెప్పిస్తారట!

Nov 26 2022 8:44 AM | Updated on Nov 26 2022 9:23 AM

Chiranjeevi, Balakrishna, Prabhas And Other Heroes Upcoming All Mass Movies Of 2023 - Sakshi

టికెట్లు బాగా తెగాలంటే మాస్‌ ప్రేక్షకులు రావాలి. అందుకే ఏడాదికి రెండొందల సినిమాలు వస్తే.. వాటిలో తొంభై శాతం మాస్‌ సినిమాలే ఉంటాయి. ఆ మాస్‌ బొమ్మ (సినిమా) బాగుంటే ఇక మాస్‌ ప్రేక్షకులకు పండగ... వసూళ్లతో బాక్సాఫీస్‌కి పండగ. ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న ‘మాస్‌ బొమ్మ’లపై ఓ లుక్కేద్దాం...

మాస్‌ పాత్రలకు పెట్టింది పేరు చిరంజీవి. తెరపై ఆయన మాస్‌ డైలాగులు, డ్యాన్స్‌లు చూస్తే థియేటర్లో మెగా అభిమానులు, ప్రేక్షకులు విజిల్స్‌తో రెచ్చిపోతారు. తాజాగా చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం అలాంటి ఫుల్‌ మాస్‌ కిక్‌ ఇవ్వనుంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌ లుక్స్, టీజర్, ‘బాస్‌ పార్టీ..’ పాట ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. కేఎస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.

మరోవైపు ‘వీరసింహారెడ్డి’ అంటూ బాలకృష్ణ పక్కా మాస్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ లుక్, మోషన్‌ పోస్టర్‌ ఫ్యాన్స్‌కి కిక్‌ ఇచ్చేలా ఉన్నాయి. ఈ సినిమాలోని ‘జై బాలయ్య..’ అంటూ అదిరిపోయే మాస్‌ సాంగ్‌ని శుక్రవారం రిలీజ్‌ చేశారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కూడా సంక్రాంతి బరిలో నిలుస్తోంది. కాగా అటు ‘వాల్తేరు వీరయ్య’, ఇటు ‘వీరసింహారెడ్డి’ చిత్రాల్లో శ్రుతీహాసనే కథానాయిక కావడం విశేషం.

ఇకపోతే.. హీరో రవితేజకి మాస్‌ మహారాజా అనే ట్యాగ్‌లైన్‌ ఉంది. ఆయన సినిమాలో కచ్చితంగా మాస్‌ యాంగిల్‌ కనిపిస్తుంది. అలాంటి రవితేజ మరోసారి ‘ధమాకా’ చిత్రంతో మాస్‌ లుక్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌. ఈ చిత్రం నుంచి ‘డు డు..’ అనే పాటని శుక్రవారం రిలీజ్‌ చేశారు. ఈ సినిమా డిసెంబరు 23న విడుదలవుతోంది.

కాగా వరుస పాన్‌ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తున్న ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్‌’. ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో పవర్‌ఫుల్‌ మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు ప్రభాస్‌. ఈ చిత్రం వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 28న విడుదల కానుంది. అలాగే పవన్‌ కల్యాణ్‌ ‘హరి హర వీరమల్లు’ అంటూ మాస్‌గా రానున్నారు. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధీ అగర్వాల్‌ హీరోయిన్‌. పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ మాస్‌ లుక్‌లోనూ కనిపించనున్నారు. 

అదేవిధంగా ‘పుష్ప’ చిత్రంలో ఊర మాస్‌ లుక్‌లో కనిపించి సగటు సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా చేశారు అల్లు అర్జున్‌. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబరు 17న విడుదలై పాన్‌ ఇండియా స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘పుష్ప 2’ రానుంది. తొలి భాగంలో ఊర మాస్‌గా కనిపించిన అల్లు అర్జున్‌ ద్వితీయ భాగంలో అంతకు మించి కనిపిస్తారని ఊహించవచ్చు.

అదేవిధంగా ఎన్టీఆర్‌కి మాస్‌ పాత్రలు కొత్తేమీ కాదు. ఇప్పటికే ఆ పాత్రల్లో ప్రేక్షకులను అలరించిన ఆయన మరోసారి మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఎన్టీర్‌ హీరోగా రూపొందుతున్న 30వ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. అలాగే ఆయన హీరోగా తెరకెక్కనున్న 31వ చిత్రానికి ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ డైరెక్టర్‌. ఈ రెండు సినిమాల్లో ఎనీ్టఆర్‌ మాస్‌ లుక్‌లో సందడి చేయనున్నారు.

ఇకపోతే తన సహజమైన నటనతో నేచురల్‌ స్టార్‌ అనే టాగ్‌ని సొంతం చేసుకున్న నాని కెరీర్‌లో తొలిసారి పూర్తి స్థాయి మాస్‌ పాత్రలో నటిస్తున్న సినిమా ‘దసరా’. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం ఊరమాస్‌ బ్లాక్‌ లుక్‌లోకి మారిపోయారు నాని. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 30న విడుదల కానుంది.

 ఇక తన కెరీర్‌లో అక్కినేని నాగచైతన్య ఇప్పటికే మాస్‌ పాత్రలు చేసినా ప్రేక్షకులు లవర్‌బాయ్‌గా, పక్కింటి కుర్రాడిలా చూస్తారు. తాజాగా ఆయన నటిస్తున్న తెలుగు–తమిళ చిత్రం ‘కస్టడీ’. వెంకట్‌ ప్రభు డైరెక్టర్‌. కాగా ఈ నెల 23న నాగచైతన్య బర్త్‌ డే సందర్భంగా ‘కస్టడీ’ టైటిల్‌ ఖరారు చేసి, ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ఈ లుక్‌ చూస్తే ఇప్పటి వరకు చేయని ఫుల్‌ మాస్‌ క్యారెక్టర్‌ని నాగచైతన్య చేస్తున్నారని స్పష్టం అవుతోంది. 

మరోవైపు అక్కినేని అఖిల్‌ కూడా మాస్‌ లుక్‌తో రానున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్‌’. ఈ సినిమా కోసం పక్కా మాస్‌లుక్‌కి  మారిపోయారు అఖిల్‌. తన పాత్ర కోసం ఫిజిక్‌ని సిక్స్‌ప్యాక్‌కి మార్చుకున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల   కానుంది.  ఈ హీరోలే కాదు.. ఇంకా పలువురు హీరోలు మాస్‌ లుక్‌లో మమమ్మాస్‌ అంటూ తెరపై సందడి చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement