
కేంద్ర మాజీమంత్రి, మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశిస్తూ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శాసనసభ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో విదేశాల్లో ఉన్న చిరంజీవి ఆ కామెంట్లపై స్పందిస్తూ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. అయితే, తాజాగా చిరు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలో మీడియా వారు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని కోరారు.
చిరంజీవి తన వెకేషన్ పూర్తి చేసుకుని హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగారు. ఈ సందర్భంగా బాలకృష్ణ వ్యాఖ్యలపై మాట్లాడాలని మీడియా వారు కోరారు. అయితే, విలేకరులు అడిగే ప్రశ్నలను ఆయన దాటవేశారు. ఇప్పటికే తాను చెప్పాల్సింది చెప్పేశానని క్లారిటీ ఇచ్చారు. ఇక మాట్లాడాల్సింది ఏం లేదని అక్కడి నుంచి వెళ్లిపోయారు. చిరు హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకి వస్తున్నారనే విషయం తెలిసి అభిమానులు భారీగానే వచ్చారు. వారితో సెల్ఫీలు ఇస్తూ దిగి ఆయన వెళ్లిపోయారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై ఇప్పటికే మీడియాకు లేఖ రాసిన చిరంజీవి.
బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి అభిమానులతో పాటు కాపు సామాజికవర్గీయుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే చిరుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో జనసేన అభిమానులు మండిపడుతున్నారు. మరోవైపు బాలకృష్ణ వ్యాఖ్యల వల్ల చిరంజీవి అభిమానులు, కాపు సామాజికవర్గాల్లో టీడీపీపై వ్యతిరేకత పెరగకుండా ఉండేందుకే పవన్‌కళ్యాణ్‌ను చంద్రబాబు పరామర్శించారన్న చర్చ కూడా జరుగుతోంది.