
టాలీవుడ్ మాత్రమే కాదు..బాలీవుడ్లోనూ అందాల తార ఎవరంటే ఠక్కున ఆమె పేరే చెప్పేస్తారు. తెలుగు సినిమాల్లో అప్పట్లో ఓ వెలుగు వెలిగిన అతిలోక సుందరి ఆమె. కానీ ఊహించని విధంగా 2018లో ఈ లోకాన్ని విడిచి వెళ్లింది. ఇవాళ ఆమె జయంతి కావడంతో అభిమానులు వెండితెర అందాల రాణిని గుర్తు చేసుకుంటున్నారు. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా? ఆమె మన అతిలోక సుందరి శ్రీదేవి. ఆగస్టు 13న 1963లో మీనంపట్టి అనే ప్రాంతంలో జన్మించింది.
ఇవాళ శ్రీదేవి జయంతి కావడంతో ఆమె భర్త బోనీ కపూర్ అరుదైన క్షణాలను గుర్తు చేసుకున్నారు. 1990లో చెన్నైలో జరిగిన శ్రీదేవి 27వ బర్త్ డే వేడుకలో పాల్గొన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె 27వ పుట్టినరోజు కావడంతో నేను మాత్రం హ్యాపీ 26th బర్త్ డే అని విష్ చేశానని ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఆమె మరింత యంగ్ అని చెప్పేందుకు అలా చేశానని అన్నారు. కానీ శ్రీదేవి మాత్రం తనను ఆటపట్టిస్తున్నారని చెప్పిందని గుర్తు చేసుకున్నారు.
కాగా.. శ్రీదేవి.. బోనీ కపూర్ను 1996లో పెళ్లాడారు. వీరికి ఇద్దరు కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ఉన్నారు. జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. తన తల్లిలాగే స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. శ్రీదేవి ఫిబ్రవరి 24, 2018న దుబాయ్‌లోని ఓహోటల్లో మరణించిన సంగతి తెలిసిందే.