Boman Irani About His Mother Jerbanoo Irani - Sakshi
Sakshi News home page

వెయిటర్‌గా, ఫొటోగ్రాఫర్‌గా, ఆఖరికి బేకరీని రన్‌ చేసిన నటుడు

Jun 16 2021 8:42 AM | Updated on Jun 16 2021 11:05 AM

Boman Irani About His Mother Jerbanoo Irani - Sakshi

తల్లి జెర్బానీ ఇరానీతో బొమన్‌ ఇరానీ

ముంబై తాజ్‌మహల్‌ హోటల్‌లో వెయిటర్‌గా పని చేశాడు. కాపీ 20 రూపాయల లెక్కన అమ్మే ఫొటోగ్రాఫర్‌గా పని చేశాడు. ఆ తర్వాత బేకరి రన్‌ చేశాడు...

నటుడు బొమన్‌ ఇరానీ తల్లి జెర్బానీ ఇరానీ ఇటీవల కన్ను మూసింది. ఆమె వయసు 94 సంవత్సరాలు. ‘ఆమె తన 32 ఏళ్లకే నాకు తల్లిగా తండ్రిగా మారింది’ అని గుర్తు చేసుకున్నాడు బొమన్‌. ‘ఆమె నన్ను సినిమాలు చూడమని ప్రోత్సహించి తప్పక పాప్‌కార్న్‌కు కూడా డబ్బులిచ్చి పంపేది. ఆ ప్రోత్సాహమే నన్ను నటుణ్ణి చేసింది’ అంటాడాయన. భర్త మరణించాక ఆమె చిన్న బేకరీ నడిపింది.. బొమన్‌ 40 ఏళ్లు దాటాక గాని సినిమాల్లో ఎదగలేదు. అప్పటి వరకూ ఆమె అతని అండా దండా. ఒక సింగిల్‌ మదర్‌గా ఆమె జ్ఞాపకాలు అతడు చెప్పినవి...

బొమన్‌ ఇరానీ సినిమాల్లో వచ్చేటప్పటికి అతనికి 42 ఏళ్లు. ‘మున్నాభాయ్‌ ఎం.బి.బి.ఎస్‌’ రిలీజ్‌ అయ్యేటప్పటికి అతని వయసు అదే. అప్పటి వరకూ అతడు చేయని పని లేదు. ముంబై తాజ్‌మహల్‌ హోటల్‌లో వెయిటర్‌గా పని చేశాడు. కాపీ 20 రూపాయల లెక్కన అమ్మే ఫొటోగ్రాఫర్‌గా పని చేశాడు. ఆ తర్వాత బేకరి రన్‌ చేశాడు. అవును. తన బేకరీనే. తన తల్లి నడిపే బేకరీ. ఏం చేసినా ఆ బేకరీ ఉందన్న ధైర్యం. తల్లి ఉందన్న ధైర్యం.

బొమన్‌ కడుపులో పడగానే తండ్రి మరణించాడు. కడుపులో బిడ్డను ఉంచుకుని తల్లి జెర్బానీ ఇరానీ ఆ బాధంతా భరించింది. బొమన్‌ పుట్టాక అతనికి హైపర్‌ యాక్టివిటీ డిజార్డర్‌ ఉండేది. దాంతో పాటు నంగిగా మాట్లాడేవాడు. తండ్రి నడుపుతూ మరణించిన చిన్న బేకరీనే జెర్బానీ నడుపుతూ బొమన్‌ను పెంచింది. ఆ బేకరీలో చిప్స్, శాండ్‌విచ్‌లు తప్ప పెద్దగా ఏమీ ఉండేవి కాదు. ఆ ఆదాయంతోనే వారు జీవించారు. 

‘రోజూ స్కూల్‌ నుంచి వచ్చాక నన్ను మా అమ్మ సినిమాకు పంపేది. పాప్‌కార్న్‌కు డబ్బులు తప్పక ఇచ్చేది’ అని తల్లిని గుర్తు చేసుకున్నాడు ఇరానీ. ‘ఎన్ని కష్టాలు వచ్చినా రోజూ నాతో సాయంత్రం ఆ రోజు జరిగిన విషయాలు, ఇరుగుపొరుగువారి కబుర్లు చెప్పేది. ఆమె నన్ను తల్లి. తండ్రి అయి పెంచింది’ అంటాడు బొమన్‌.
వెయిటర్‌ అయినా, పెళ్లి చేసుకుని తండ్రి అయినా, నాటకాలంటూ తిరిగినా తల్లి ఉందన్న ధైర్యంతో బొమన్‌ అవన్నీ చేశాడు. ‘కష్టం మీద మా జీవితంలో మొదటిసారిగా విహారానికి వెళితే అది కాస్తా పిచ్చి హోటల్‌లో విడిది దొరికి అభాసు అయ్యింది’ అని నవ్వుతాడు బొమన్‌.

కాని ఆ తల్లీ కొడుకులు పడ్డ కష్టం వృథా పోలేదు. ‘మున్నాభాయ్‌ ఎం.బి.బి.ఎస్‌’ సినిమాతో బొమన్‌ సూపర్‌స్టార్‌ అయ్యాడు. గొప్ప డబ్బు, సంపద వచ్చి పడ్డాయి. తల్లిని చూసుకున్నాడు. ‘నువ్వు మెచ్చుకునే జనం కోసం నటుడుగా ఉండకు. ఉల్లాసపడే జనం కోసం నటుడుగా ఉండు. నటుడుగా నువ్వు జనాన్ని ఉల్లాసపరుచు అని మా అమ్మ నాతో అనేది’ అంటాడు బొమన్‌. ఫిబ్రవరి తొమ్మిదిన ఆమె మరణించింది. ‘చనిపోయే రోజు ఆమె కుల్ఫీ, కొంచెం మామిడి పండు అడిగింది. ఆమె చందమామనో నక్షత్రాలనో అడిగి ఉండవచ్చు. ఇప్పుడామె నక్షత్రంగా మారింది’ అని రాసుకున్నాడు బొమన్‌.

ఒక పిల్లవాడు పెరిగి వృద్ధిలోకి వచ్చాడంటే అది ఊరికే జరిగిపోదు. దానివెనుక తల్లిదండ్రుల కఠోర శ్రమ, త్యాగం ఉంటాయి. తండ్రి లేకపోతే తల్లి పడే శ్రమ మరింత అధికం. ఇవాళ తల్లిదండ్రులను ప్రేమించే పిల్లలతో పాటు వారిని దూరం పెట్టే పిల్లలూ తయారయ్యారు. ఈ రెండో కోవకు చెందిన వారంతా తమ తల్లిదండ్రుల త్యాగాలను గుర్తు చేసుకుంటే ఎంత బాగుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement