దమ్ముంటే గేమ్‌ ఆడమన్న పింకీ, సన్నీ ఓడిపోయాడన్న షణ్ను | Bigg Boss Telugu 5 Promo: Bangaru Kodi Petta Task for Captaincy Contestants | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: వాళ్లాడితే గేమ్‌, నేనాడితే క్రైమా?.. సన్నీ కౌంటర్‌

Oct 19 2021 4:41 PM | Updated on Oct 19 2021 9:31 PM

Bigg Boss Telugu 5 Promo: Bangaru Kodi Petta Task for Captaincy Contestants - Sakshi

RDR నీ నామినేషన్‌లా ఉంది కానీ వాళ్ల నామినేషన్‌లా లేదని పెదవి విరిచాడు మానస్‌. వీడు తప్పు చేసి ఒప్పుకోడేంటి? అని రవి అనగా.. సన్నీ తప్పు చేశాడంటే ఒప్పుకోనంటూ వాదనకు దిగింది కాజల్‌..

బిగ్‌బాస్‌ షోలో నిన్నటి నామినేషన్స్‌ చూస్తే వార్‌ వన్‌సైడ్‌ అయినట్లు కనిపించింది. బజర్‌ మోగినప్పుడు ముందుగా అరటిపండు సంపాదించిన కంటెస్టెంట్లు నామినేట్‌ చేసే అవకాశాన్ని పొందారు. కాకపోతే వారు చెప్పే కారణాలు విన్నాక ఆ నామినేషన్‌ను అంగీకరించాలా? వద్దా? అన్న నిర్ణయాన్ని వేటగాళ్ల చేతిలో పెట్టాడు బిగ్‌బాస్‌. ఇక్కడ విచిత్రమేంటంటే శ్రీరామ్‌, జెస్సీ, సన్నీ.. ముగ్గురు వేటగాళ్లైనప్పటికీ బజర్‌ మోగిన ప్రతిసారి డేరా నుంచి బయటకు వచ్చి నామినేషన్స్‌ను సింగిల్‌ హ్యాండ్‌తో నడిపించాడు సన్నీ. అయితే కొందరు కంటెస్టెంట్స్‌ సిల్లీ రీజన్స్‌ చెప్తూ నామినేట్‌ చేసినా కూడా సన్నీ వాటిని అంగీకరించడాన్ని చాలామంది విమర్శించారు. అదే సమయంలో నామినేషన్స్‌ను తనకు అనుకూలంగా మార్చుకున్న విధానాన్ని పలువురూ మెచ్చుకున్నారు.

ఏదేమైనా నిన్న బిగ్‌బాస్‌ పెట్టిన చిచ్చు ఇంకా చల్లారనట్లు కనిపిస్తోంది. ఇది నీ నామినేషన్‌లా ఉంది కానీ వాళ్ల నామినేషన్‌లా లేదని పెదవి విరిచాడు మానస్‌. వీడు తప్పు చేసి ఒప్పుకోడేంటి? అని రవి కామెంట్‌ చేయగా కాజల్‌ దాన్ని వ్యతిరేకించింది. సన్నీ తప్పు చేశాడంటే ఒప్పుకోనంటూ వాదనకు దిగింది. అయినా టాస్కుల్లో ఫ్రెండ్‌షిప్‌ చూపిస్తే ఓడిపోయినట్లేనని తేల్చేశాడు షణ్ముఖ్‌. దమ్ముంటే గేమ్‌ ఆడాలి, కానీ సేఫ్‌ గేమ్‌ ఆడొద్దంటూ చురకలంటించింది పింకీ. మొత్తంగా అందరూ తన మీద మాటల తూటాలు కురిపించడంతో విసిగి వేసారిపోయిన సన్నీ.. వాళ్లాడితే గేమ్‌.. నేనాడితే క్రైమా? అని చిర్రుబుర్రులాడాడు. 

ఇదిలా వుంటే హౌస్‌లో కొత్త కెప్టెన్సీ కోసం రంగం సిద్ధం చేశాడు బిగ్‌బాస్‌. కెప్టెన్సీ పోటీదారులను ఎన్నుకునేందుకు బంగారు కోడిపెట్ట టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో గుడ్డు పట్టుకునేందుకు గుద్దులాడుకుంటున్నారు కంటెస్టెంట్లు. ఈ క్రమంలో మరోసారి సన్నీ, ప్రియ మధ్య వార్‌ మొదలవనున్నట్లు తెలుస్తోంది. తన గుడ్లు పోయాయని, అవి ఎవరు తీసుకున్నారో తెలిసిందని సన్నీ కామెంట్‌ చేశాడు. అది విన్న ప్రియ.. నేనే తీసుకున్నా, బరాబర్‌ తీసుకుంటానని తేల్చి చెప్పింది. మరి ఈ బంగారు కోడిపెట్ట టాస్కులో ఎవరు గెలుస్తారో తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement