శివాజీతో చేతులు కలిపిన షకీలా, అర్ధరాత్రి డ్రామాలు.. ఆగమైన కంటెస్టెంట్లు | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: అర్ధరాత్రి శివాజీ, షకీలా డ్రామా.. పిచ్చోళ్లను చేస్తున్నారా?

Published Sat, Sep 9 2023 11:49 AM

Bigg Boss 7 Telugu: Sivaji, Shakeela Prank In Midnight - Sakshi

బిగ్‌బాస్‌ ఎప్పుడు ఏం చెప్పినా చేసేందుకు రెడీ అన్నట్లుగా ఉన్నారు కంటెస్టెంట్లు. అయితే వీరు అలర్ట్‌గా ఉన్నప్పుడు కాదు, తనకు నచ్చినప్పుడు మాత్రమే టాస్కులు పెడతా అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు బిగ్‌బాస్‌. మరి అప్పటివరకు చేసేదేంటి చెప్మా? అని హౌస్‌మేట్స్‌ బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నారు. కొందరు ఇంటి పనులు చేస్తుంటే మరికొందరు అప్పుడప్పుడు ఏదో ఒక పని చేసినట్లుగా బిల్డప్‌ ఇస్తున్నారు. పాటలు పాడటం, డ్యాన్సులు చేయడం.. ఇలా ఎవరికి నచ్చింది వారు చేసుకుంటూ పోతున్నారు.

శివాజీ ప్లాన్‌ అమల్లో పెట్టిన షకీలా
అయితే స్వతాహాగా నటుడైన శివాజీ ఏదైనా కొత్తగా ట్రై చేద్దామనుకుని షకీలాకు చెత్త ఐడియా ఇచ్చాడు. రాత్రిపూట దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తించి అందరికీ కంటి మీద కునుకు లేకుండా చేయాలన్నాడు. రాత్రిపూట అందరి నిద్ర పాడు చేయడం కరెక్ట్‌ కాదేమో అని క్షణమైనా ఆలోచించలేదు షకీలా. శివాజీ చెప్పినదానికి తలూపుతూ అర్ధరాత్రి ప్లాన్‌ అమల్లో పెట్టింది. నిద్రలో నుంచి సడన్‌గా లేచి కళ్లు పెద్దవి చేస్తూ, ఎవరో వస్తున్నారని మాట్లాడుతూ అందరినీ హడలెత్తించింది.

షకీలాను చూసి వణికిపోయిన తేజ
ఈ ప్రాంక్‌కు సృష్టికర్త అయిన శివాజీ.. ఏం కాలేదమ్మా, ఎవరూ రాలేరని బుజ్జగిస్తూ ఆమెను నిద్రపుచ్చాడు. అదంతా డ్రామా అని తెలియని మిగతా కంటెస్టెంట్లు మాత్రం దడుసుకుని చచ్చారు. టేస్టీ తేజ అయితే షకీలా సడన్‌గా లేచి ఏదేదో మాట్లాడటం చూసి వణికిపోయాడు. ఆమె ప్రవర్తన చూసిన హౌస్‌మేట్స్‌ భయంతో రాత్రంతా జాగారం చేశారు. ఏదైనా ప్రాంక్‌ చేస్తే అందరూ నవ్వుకునేలా ఉండాలే కానీ తిట్టుకునేలా ఉండకూడదు. కానీ వీళ్లు చేసిన పని వల్ల ఇంటిసభ్యులంతా నిద్రకు దూరమయ్యారు.

నామినేట్‌ చేస్తే ఊరుకోనంటూ వార్నింగ్‌
తీరా చావు కబురు చల్లగా చెప్పినట్లు తెల్లవారుజామున షకీలా అదంతా ప్రాంక్‌ అని దామినితో చెప్పుకొచ్చింది. షాకైన దామిని రాత్రిపూట అలా చేయడం చాలా తప్పు అని ముఖం మీదే చెప్పేసింది.  దీంతో ఓ క్షణంపాటు తాను చేసింది తప్పేమోనని ఆలోచనలో పడ్డ షకీలా.. ఈ కారణంతో నామినేట్‌ చేస్తే ఊరుకునేది లేదంది. నామినేషన్స్‌ కోసం కారణాలు వెతుక్కునే కంటెస్టెంట్లకు ఈ ప్రాంక్‌ ఇప్పుడు బ్రహ్మాస్త్రంగా దొరకనుంది. శివాజీ మాట విని షకీలా తన కొమ్మను తానే నరుక్కున్నట్లయింది. నిజంగా తనకు ఏదైనా జరిగినా ఇకపై ఎవరూ నమ్మే పరిస్థితి లేకుండా పోయింది.

చదవండి: 'రెమ్యునరేషన్‌ సగం వెనక్కిచ్చేశాడు, ఇంకేం చేయాలి.. అలాంటి వ్యక్తితో ఇకపై విజయ్‌ సినిమాలు చేయడు!'

Advertisement
 
Advertisement