Bigg Boss 5 Telugu: నాగ్ పారితోషికం ఎంతో తెలుసా?

Nagarjuna Remuneration For Bigg Boss Telugu 5: బిగ్‌బాస్ రియాలిటీ షోను రసవత్తరంగా నడిపించడంలో హోస్ట్‌ది కీలకపాత్ర. అవసరమైన చోట కంటెస్టెంట్లను ఎంకరేజ్ చేస్తూ, అతి చేసిన చోట చురకలంటిస్తాడీ హోస్ట్. ఆడియన్స్ నాడికి తగ్గట్లుగా కంటెస్టెంట్లతో గేమ్స్ కూడా ఆడిస్తాడు. ఈ క్రమంలో ప్రేక్షకులకు నచ్చే, మెచ్చే రీతిలో మాట్లాడుతూ వారిని అలరిస్తుంటాడు. అందుకే బిగ్‌బాస్ మొదలవుతుందనగానే కంటెస్టెంట్ల కన్నా ముందు హోస్ట్ ఎవరన్నదానిపై ఎక్కువగా చర్చ నడుస్తుంది. కాగా బిగ్‌బాస్ మూడు, నాలుగు సీజన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా ఐదో సీజన్‌కు కూడా హోస్టింగ్ చేస్తున్న విషయం తెలిసిందే!
అయితే ఈసారి నాగార్జున తన పారితోషికాన్ని భారీగా పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. 106 రోజులపాటు కొనసాగనున్న ఈ సీజన్‌కు రూ.12 కోట్ల మేర పారితోషికం తీసుకోనున్నట్లు భోగట్టా! గతంలో వీకెండ్‌లో ప్రసారమయ్యే ఒక్క ఎపిసోడ్‌కు సుమారు రూ.12 లక్షలు తీసుకున్న నాగ్ ఈసారి మాత్రం ఓ రేంజ్‌లో డబ్బులు డిమాండ్ చేస్తుండటం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే అతడి హోస్టింగ్‌కు బుల్లితెర ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారని, గత సీజన్ల మాదిరి ఐదో సీజన్‌ను కూడా విజయవంతం చేయాలంటే నాగ్ అడిగినంత ముట్టజెప్పాల్సిందే అనుకున్నారట బిగ్‌బాస్ నిర్వాహకులు. అందుకే పన్నెండు కోట్లు ఇవ్వడానికి కూడా వెనుకాడలేదని ప్రచారం జరుగుతోంది.