Ashoka Vanamlo Arjuna Kalyanam Review: అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ రివ్యూ

Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: అశోకవనంలో అర్జున కళ్యాణం
నటీనటులు: విశ్వక్ సేన్, రుక్సార్‌ దిల్లాన్, రితికా నాయక్, గోపరాజు రమణ తదితరులు
కథ: రవికిరణ్ కోలా
దర్శకత్వం: విద్యా సాగర్ చింతా
నిర్మాత: బాపీనీడు. బి
సంగీతం: జై క్రిష్‌
సినిమాటోగ్రఫీ: కార్తీక్‌ పలనీ
ఎడిటింగ్‌: విప్లవ్‌ నైషధం
విడుదల తేది: మే 6, 2022

Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Review In Telugu

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ 'అల్లం అర్జున్‌'గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం 'అశోకవనంలో అర్జున కల్యాణం'. విశ్వక్ సేన్‌ సరసన రుక్సార్‌ దిల్లాన్ హీరోయిన్‌గా అలరించిన ఈ మూవీకి  విద్యాసాగర్‌ చింతా దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్‌లు, టీజర్‌, ట్రైలర్‌ విభిన్నంగా ఆకట్టుకున్నాయి. అలాగే సినిమా ప్రమోషన్‌లో భాగంగా చేసిన చర్యలు పలు విమర్శలను కూడా మూటగట్టుకున్నాయి. విశ్వక్ సేన్‌కు ఓ టీవీ యాంకర్‌కు మధ్య జరిగిన కాంట్రవర్సీ తెలిసిందే. ఇవన్ని దాటుకోని ఎట్టకేలకు నేడు (మే 6) అశోకవనంలో అర్జున కల్యాణం థియేటర్లలో విడుదలైంది. మరీ అల్లం అర్జున్‌గా విశ్వక్ సేన్‌ ఏమేరకు అలరించాడు ? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే
సూర్యపేటలో వడ్డీ వ్యాపారం చేసుకునే అల్లం అర్జున్‌ (విశ్వక్‌ సేన్‌)కు 33 ఏళ్ల వయసు వచ్చినా  ఇంకా పెళ్లి కాలేదు. ఇరుగుపొరుగు వారి మాటలు భరించలేక చివరకు ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాకు చెందిన మాధవి(రుక్సార్‌ దిల్లాన్)తో నిశ్చితార్థం జరుగుతుంది. సరిగ్గా అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటిస్తుంది. దీంతో అర్జున్‌ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా పెళ్లి కూతురి ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. రెండు వేర్వేరు యాసలు, వేర్వేరు కులాలకు చెందిన ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి వివాదాలు చోటు చేసుకున్నాయి? మాధవి చెల్లెలు వసుధ(రితికా నాయక్) చేసిన చిలిపి పని ఎక్కడికి దారి తీసింది? వీరి మధ్యలో కులాల ప్రస్థావన ఎలా వచ్చింది? అసలు అర్జున్‌కి పెళ్లి అయిందా లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉదంటంటే...
30 ఏళ్లు దాటిన పెళ్లి చేసుకోకపోవడం ఇప్పుడు కామన్‌. ఇదే పాయింట్‌ని తీసుకొని ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు విద్యా సాగర్ చింతా. వయసు మీదపడినా ఇంకా పెళ్లికాలేదు అనే ఆత్మన్యూనతా భావంతో బాధపడేవారందరికి ఈ మూవీ కనెక్ట్‌ అవుతుంది. పెళ్లి అనేది మనకు నచ్చినప్పుడు మాత్రమే చేసుకోవాలని కానీ.. సమాజం కోసమే.. లేదా కుటుంబ గౌరవం కోసమో చేసుకోవద్దనే విషయాన్ని కామెడీగా చూపించాడు.

ట్రైలర్‌లో చూపించినట్లుగా.. సినిమా అంతా కామెడీగా సాగుతుంది. కొన్ని సీరియస్‌ అంశాలను కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌ జోడించి తెరపై చక్కగా చూపించాడు దర్శకుడు. ఫస్టాఫ్‌లో హీరోయిన్‌​తో మాట్లాడేందుకు హీరో పడే కష్టాలు నవ్వులు పూయిస్తాయి. అలాగే హీరోయిన్‌ చెల్లెలు చేసే అల్లరి ఆకట్టుకుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ బాగుంది. ఇక సెకండాఫ్‌లో చాలా సీరియస్‌ అంశాలను సున్నితంగా చూపించాడు దర్శకుడు. అయితే కథలో కావాల్సినంత కామెడీ ఉన్నా.. నెమ్మదిగా సాగడం సినిమాకు మైనస్‌. ఫస్టాఫ్‌లో చాలా సాగదీత సీన్లు ఎక్కువగా ఉండడంతో ప్రేక్షకుడి  కొన్ని చోట్ల బోర్‌ కొడుతుంది. స్క్రీన్‌ప్లే అంతగా ఆకట్టుకునేలా లేదు. సెకండాఫ్‌లో కూడా ఎంగేజింగ్‌ సీన్స్‌ ఎక్కువగా ఉన్నాయి. క్లైమాక్స్‌ కూడా రోటీన్‌ ఉంటుంది. 

ఎవరెలా చేశారు?
కొత్త తరహా చిత్రాలు, పాత్రలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతాడు విశ్వక్‌ సేన్‌. ఈ చిత్రంలో కూడా సరికొత్త గెటప్‌లో కనిపించాడు. మధ్యవయస్కుడు అల్లం అర్జున్‌గా విశ్వక్‌ సేన్‌ మెప్పించాడు. తన వయసుకు మించిన పాత్రను పోషించిన విశ్వక్‌ని అభినందించాల్సిందే. అమాయకుడిగా ఉంటునే..తనదైన కామెడీతో నవ్వించాడు. ఇక మాధవిగా రుక్సార్‌ దిల్లార్‌ ఆకట్టుకుంది. చీరకట్టులో తెరపై అందంగా కనిపించింది. ఇక హీరోయిన్‌ చెల్లెలు వసుధ పాత్రలో రితికా నాయక్ పరకాయ ప్రవేశం చేసింది. ఆమె చేసే అల్లరి ఆకట్టుకుంటుంది. గోపరాజు రమణ తనదైన పంచ్‌ డైలాగ్స్‌తో నవ్వించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఇక సాంకెతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం  జై క్రిష్‌ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా బాగుంది.  ముఖ్యంగా ‘ఓ ఆడపిల్ల ..’అనే పాట అందరికి నచ్చుతుంది. కార్తీక్‌ పలనీ సినిమాటోగ్రఫీ బాగుంది. గోదావరి అందాలను తెరపై చక్కగా చూపించాడు. ఎటిటర్‌ విప్లవ్‌ నైషధం తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. నిర్మాణవ విలువసు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 

Rating:  
(2.25/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top