అరుంధ‌తికి 13 ఏళ్లు: ఈ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Arundhati 13 years Completed: Untold facts About Anushka Shetty Arundhati Movie Getting Chance - Sakshi

అనుష్కను స్టార్ హీరోయిన్‌గా నిల‌బెట్టిన చిత్రాల్లో అరుంధ‌తి సినిమాది అగ్ర‌స్థానం. అప్ప‌టివ‌ర‌కు అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కే ప్రాధాన్య‌మిచ్చిన ఈ హీరోయిన్ అరుంధ‌తిలో న‌ట‌విశ్వ‌రూపం చూపించింది. సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్న ఈ సినిమా ఆమె జీవితాన్నే మార్చేసింది. అరుంధ‌తి అంటే అనుష్క‌.. అనుష్క అంటే అరుంధ‌తి అని ప్రేక్ష‌కుల మ‌నసులో బ‌లంగా ముద్ర‌ప‌డిపోయింది. టాప్ డైరెక్ట‌ర్ కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ 2009లో సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 16న విడుద‌లై సెన్సేష‌న‌ల్ హిట్ అందుకుంది.

మ‌ల్లెమాల ఎంంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై శ్యామ్‌ప్ర‌సాద్ రెడ్డి నిర్మించిన‌ ఈ సినిమా రిలీజై నేటికి ప‌ద‌మూడేళ్లు పూర్తైంది. నిజానికి ఈ సినిమా ఛాన్స్ మొద‌ట అనుష్క‌కు రాలేద‌ట‌! మ‌ల‌యాళ కుట్టి మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌ను అరుంధ‌తి సినిమా కోసం సంప్ర‌దించార‌ట‌. కానీ అప్పుడే ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన ఆమెకు ఎలాంటి క‌థ‌లు ఎంచుకోవాలో పెద్ద‌గా తెలిసేది కాద‌ని, దానివ‌ల్లే అరుంధ‌తిని వ‌దులుకున్నాన‌ని గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా అప్ప‌టికే ఇత‌ర ప్రాజెక్టుల‌తో ఆమె బిజీగా ఉండ‌టంతో విముఖ‌త వ్య‌క్తం చేసింద‌ట‌. ఈ ఆఫ‌ర్ వ‌చ్చిన రెండు నెల‌ల‌కే క్యాన్స‌ర్ ఉన్న‌ట్లు తేల‌డంతో అరుంధ‌తి కంటే బ‌తికి ఉంటే చాల‌న్న భావ‌న‌తో ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకున్నాన‌ని పేర్కొంది. అలా ఈ సినిమా అనుష్క ద‌గ్గ‌ర‌కు రావ‌డం, ఆమె ఓకే చెప్పేయడంతో చ‌క‌చ‌కా షూటింగ్ జ‌రిపేశారు. సినిమా రిలీజ‌య్యాక జేజ‌మ్మ‌గా అనుష్క‌కు జ‌నాలు నీరాజ‌నాలు ప‌ట్టారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top