పాపం.. సౌదీ అరేబియా.. వరల్డ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ..! | Anthony Mackie New Action Movie Desert Warrior Biggest Flop In The World, Read Story For More Details Inside | Sakshi
Sakshi News home page

Biggest Flop Movie: ఆస్కార్ లెవెల్ స్టార్స్.. కట్ చేస్తే.. వరల్డ్ బిగ్గెస్ట్ డిజాస్టర్..!

May 7 2026 5:11 PM | Updated on May 7 2026 6:32 PM

Anthony Mackie new action movie Desert Warrior Biggest Flop In The world

భారీ బడ్జెట్ సినిమాలు తీయాలంటేమన తెలుగులో రాజమౌళికి మాత్రమే సాధ్యం. వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్‌ ప్రస్తుతం వారణాసి మూవీని తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రాలపై అంతకుమించిన వసూళ్లు వస్తాయనే ఆశ మేకర్స్‌కు ఉంటుంది. దర్శకుడు, నటీనటులు, కథపై వసూళ్లు అనేది ఆధారపడి ఉంటుంది. కేవలం బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే సరిపోదు. మేకింగ్‌ కూడా ఆ రేంజ్‌లో ఉంటేనే వర్కవుట్ అవుతుంది. కానీ ఈ విషయంలో మన రాజమౌళికి వచ్చిన ఇబ్బందేం లేదు. ఆయన తీసిన భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యాయి.

అయితే పులికి చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అనే సామెత మన వినే ఉంటాం. అలా ఇతర దేశాల్లాగే సినీరంగంలో తాము కూడా ప్రపంచస్థాయికి ఎదగాలని సౌదీ అరేబియా ఆశలు పెట్టుకుంది. అనుకోవడమే కాదు.. భారీ బడ్జెట్‌తో డెజర్ట్ వారియర్ ‍అనే మూవీని నిర్మించింది. ప్రపంచంలోనే ఫేమస్ అయిన స్టార్స్‌ను పెట్టి ఈ సినిమా కోసం ఏకంగా రూ.1400 కోట్ల ఖర్చు చేసింది. కట్ చేస్తే.. సీన్ అంతా రివర్స్ అయింది. అనుకున్నది ఒక్కటీ.. అయిందొక్కటి అన్న తీరుగా మారిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా కేవలం రూ.6 కోట్లు మాత్రమే సాధించింది. ఈ వసూళ్లతో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా రికార్డ్ సృష్టించింది. మొత్తం బడ్జెట్‌లో కేవలం 0.4 శాతం వాటా మాత్రమే వసూలు చేయగలిగింది. అంటే ఏకంగా 99.6 శాతం నష్టాలు తెచ్చిపెట్టింది. అయితే కొవిడ్ కారణంగా ఆలస్యం కావడం, భారీ సెట్లు, అంతర్జాతీయ సాంకేతిక నిపుణులతో మూవీని తెరకెక్కించడంతో బడ్జెట్ పెరిగినట్లు తెలుస్తోంది.

ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీలో సౌదీ అరేబియా పేరును తీసుకు రావాలని అనుకోవడం మంచిదే. అయితే భారీ బడ్జెట్‌ మాత్రమే కాకుండా కథపై కూడా దృష్టి పెట్టి ఉంటే మరింత బాగుండేదని సినీ ప్రియులు అంటున్నారు. ఈ డిజాస్టర్‌ మూవీతో తమ దేశంలోనూ సినీ పరిశ్రమ అభివృద్ధి కావాలని సౌదీ అరేబియా చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఇక నుంచైనా సౌదీ అరేబియా మన దర్శకధీరుడు రాజమౌళి సలహాలు తీసుకుంటే మంచిదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

కాగా.. సౌదీ అరేబియా ఏంబీసీ గ్రూప్ ద్వారా 'డెజర్ట్ వారియర్' లాంటి చారిత్రక వార్ మూవీని నిర్మించింది. దాదాపు 7వ శతాబ్దపు అరేబియా నేపథ్యంలో సాగే కథగా ఈ సినిమాను తెరకెక్కించారు. అప్పటి చక్రవర్తి కిస్రాకు వ్యతిరేకంగా యువరాణి హింద్ సాగించిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమాకు రూపొందించారు. ఈ మూవీకి రూపెర్ట్ వ్యాట్ (రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఫేమ్) దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మార్వెల్ నటుడు ఆంథోనీ మాకీ, ఆస్కార్ విజేత బెన్ కింగ్స్లీ, ఐషా హార్ట్, షార్ల్టో కోప్లీ లాంటి సూపర్ స్టార్స్ నటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement