ఆ సినిమా విలువ నాకు తర్వాత తెలిసొచ్చింది: హీరోయిన్‌ | Sakshi
Sakshi News home page

తనతో మళ్లీ సినిమా చేయాలనుకున్నా, ఆ అదృష్టం దక్కింది: హీరోయిన్‌

Published Sun, Apr 30 2023 4:05 AM

Anni Manchi Sakunamule Movie presss meet - Sakshi

‘‘ఓ నటిగా నేను ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటుంటాను. రొటీన్‌ రోల్స్‌ అయితే కొత్తగా నేను నిరూపించుకోవడానికి ఏమీ ఉండదు. అందుకే క్యారెక్టర్స్‌ ఎంపిక విషయంలో జాగ్రత్తపడుతుంటాను’’ అని అన్నారు హీరోయిన్‌ మాళవికా నాయర్‌. సంతోష్‌ శోభన్, మాళవికా నాయర్‌ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంక దత్‌ నిర్మించిన ఈ చిత్రం మే 18న రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో మాళవికా నాయర్‌ మాట్లాడుతూ– ‘‘నా గత సినిమాలతో పోల్చితే ‘అన్నీ మంచి..’ చిత్రంలో నా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇప్పటివరకు నేను సున్నితమైన పాత్రలు చేశాను. కానీ ఈ చిత్రంలో కాస్త కోపంగా, ధైర్యంగా ఉండే అమ్మాయి పాత్ర చేశాను. అన్నీ తన కంట్రోల్‌లోనే ఉండాలనుకునే వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి పాత్ర చేశాను.

కాస్త హ్యూమర్‌ కూడా ఉంటుంది. నందినీ రెడ్డిగారు నాకు చాలా ఇన్‌పుట్స్‌ ఇచ్చారు. నటీనటుల నుంచి ఆమెకు కావాల్సింది రాబట్టుకుంటారు. ‘కల్యాణ వైభోగమే’ తర్వాత నందినీ గారితో మళ్ళీ సినిమా చేయాలని వుండేది. అది వైజయంతీ ఫిల్మ్స్‌తో నిజం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం రాజేంద్ర ప్రసాద్, గౌతమి, వీకే నరేశ్, వాసుకీగార్ల వంటి అనుభవజ్ఞులైన వారితో నటించడం కొత్త ఎక్స్‌పీరియన్స్‌.

‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా  చేస్తున్నప్పుడు నాకు అన్నీ మంచి శకునములే అనిపించాయి. ఈ పాత్‌ బ్రేకింగ్‌ సినిమా విలువ ఏంటో నాకు తర్వాత తెలిసొచ్చింది. ప్రియాంక, స్వప్నగార్లు నాకు పరిచయం అయ్యింది కూడా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ నుంచే. ఇండస్ట్రీలో వారు నాకు మెంటర్స్‌లా ఉంటున్నారు. ఓ నటిగా నాకు యాక్షన్‌ రోల్‌ చేయాలని ఉంది. ప్రస్తుతం డెవిల్‌ సినిమాలో ఓ కీ రోల్‌ చేస్తున్నాను’’ అన్నారు.  

Advertisement
 

తప్పక చదవండి

Advertisement