
వి. సముద్ర, శివిక, కుసుమ, సుప్రియ, నవీన్ మట్టా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘అన్నపూర్ణ తల్లి బువ్వమ్మ’. గోరి బ్రదర్స్ మీడియా, బ్లాక్ అండ్ వైట్ మూవీ మార్క్ పతాకాలపై సురేష్ లంకలపల్లి దర్శకత్వంలో సిరాజ్, ఖాదర్ గోరి నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డొక్కా సీతమ్మ పాత్రధారి శివిక మాట్లాడుతూ– ‘‘నా తొలి చిత్రం ఇది.
నటిగా లాంచ్ కావడానికి ఇంతకన్నా మంచి చిత్రం, టీమ్ దొరకదు. సీతమ్మగారి పాత్రకు నేను న్యాయం చేశాననే అనుకుంటున్నాను’’ అని తెలిపారు. వి. సముద్ర మాట్లాడుతూ– ‘‘డొక్కా సీతమ్మగారి జీవిత కథ ఈ సినిమా. ఈ చిత్రంలో సీతమ్మగారి భర్తగా నటించడం నా అదృష్టం. నేను ఎంతోమంది స్టార్స్‌లను డైరెక్ట్ చేశాను.
కానీ, ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది’’ అని చెప్పారు. ‘‘మంచి సినిమా తీశాం. ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంగా చెప్పగలను’’ అని తెలిపారు సురేశ్ లంకలపల్లి. ‘‘అన్నపూర్ణ తల్లి బువ్వమ్మ’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు.