అప్పుడు టీమిండియా క్రికెటర్.. ఇ‍ప్పుడు జాతీయ ‍అవార్డ్ గ్రహీత.. యానిమల్‌పై తీవ్ర విమర్శలు..!

Animal team take a dig at Swanand Kirkire for criticising the film - Sakshi

టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన  యానిమల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే దాదాపు రూ.500 కోట్ల చేరువలో కలెక్షన్స్ సాధించింది. రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్‌ 1న విడుదలైంది. అయితే మొదటి రోజే పాజిటివ్ రావడంతో విమర్శకులు ప్రశంసలు అందుకుంది. అయితే ఈ చిత్రంపై అభిమానులతో సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. అయితే ఈ చిత్రానికి ప్రశంసల కంటే విమర్శించే వారు ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై టీమిండియా క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్ విమర్శలు చేశారు. ఇలాంటి సినిమాలను ‍ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారని మండిపడ్డారు. తాజాగా ఈ లిస్ట్‌లో ప్రముఖ లిరిసిస్ట్ స్వానంద్ కిర్కిరే కూడా చేరిపోయారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్‌లో వరుస పోస్టులు చేశారు.

స్వానంద్ కిర్కిరే తన ట్వీట్‌లో రాస్తూ.. 'యానిమల్ సినిమా చూశాక.. నేటి తరం మహిళలపై నాకు నిజంగా జాలి కలిగింది. మీకోసం కొత్త వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు. అంతే కాదు.. అతను మరింత భయంకరంగా ఉన్నాడు. ఇక నుంచి మిమ్మల్ని ఎవరూ గౌరవించరు. మిమ్మల్ని అణచివేసే వ్యక్తి గురించి నువ్వు గర్వపడుతున్నావు. నేటి తరం అమ్మాయిలు థియేటర్లో కూర్చోని రష్మికను చూసి చప్పట్లు కొడుతుంటే.. మనసులో సమానత్వం అనే ఆలోచనకు నివాళులు అర్పించి నిరాశ, నిస్పృహలతో బయటకు వచ్చేశా. ఈ సినిమా విపరీతంగా వసూళ్లు రాబట్టినప్పటికీ.. నా భారతీయ సినిమా ఉజ్వల చరిత్ర మాత్రం దారి తప్పుతోంది.  యానిమల్ భారతీయ సినిమా భవిష్యత్తును నిర్దేశిస్తుంది. భయంకరమైన, ప్రమాదకరమైన దిశలో  తీసుకెళ్తోంది.' అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

అయితే ఈ పోస్ట్ చూసిన యానిమల్ చిత్రబృందం స్పందించింది. అతని ట్వీట్లను ఉద్దేశించి తగిన రీతిలో కౌంటర్ ఇచ్చింది. ట్వీట్‌లో రాస్తూ.. "మీ మోకాళ్లను మీ కాలి ముందు పడనివ్వకండి. మీ భుజం, పాదాలు బ్యాలెన్స్ కోసం వేరు వేరుగా ఉంచండి. మీ పాదాలను సురక్షితంగా ల్యాండ్ చేయండి. అప్పుడు అది కచ్చితంగా ల్యాండ్ అవుతుంది' అంటూ గట్టిగానే కౌంటరిచ్చింది. కాగా.. యానిమల్ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, ట్రిప్తీ డిమ్రీ, సురేష్ ఒబెరాయ్, శక్తి కపూర్ కీలక పాత్రల్లో నటించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top