'అనగనగా ఓ అతిథి' సినిమా రివ్యూ

Anaganaga O Athidhi Telugu Movie Review - Sakshi

రివ్యూ టైమ్‌

చిత్రం: ‘అనగనగా ఓ అతిథి’
తారాగణం: పాయల్, చైతన్యకృష్ణ;
కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: దయాళ్‌ పద్మనాభన్‌;
రిలీజ్‌: నవంబర్‌ 20; ఓ.టి.టి: ఆహా.

దురాశ దుఃఖానికి హేతువు! ఈ పెద్దబాలశిక్ష సూక్తికి వెండితెర రూపం ‘అనగనగా ఓ అతిథి’. అయితే చిన్న పాయింట్‌ చుట్టూ కథను అటూ ఇటూ తిప్పి, గంటాముప్పావు చిత్రం తీశారు.

కథేమిటంటే..: బీద రైతు కుటుంబం అన్నపూర్ణ, సుబ్బయ్యలది (వీణా సుందర్, ఆనంద్‌ చక్రపాణి). ఈడొచ్చినా... వయసు, మనసు తొందరపెట్టే కోరికలేవీ తీరక వేగిపోతున్న పెళ్ళీడు కూతురు మల్లిక (పాయల్‌ రాజ్‌పుత్‌). జంగమ దేవర భిక్షాటనకు వచ్చి, వాళ్ళింటికి మహాలక్ష్మి వస్తుందని జోస్యం చెబుతాడు. అనుకోకుండా పెట్టె నిండా నగలు, డబ్బుతో ఓ దేశసంచారి శ్రీనివాస్‌ (చైతన్య కృష్ణ) ఆ ఇంటికి అతిథిగా వస్తాడు. ఆ రాత్రికి అక్కడే ఉంటానంటాడు. మనుషుల్లో ఉండే కామం, దురాశ, కోరిక, పైశాచికత్వం అనుకోకుండా ఆ రాత్రి మేల్కొంటాయి. అప్పుడు జరిగిన రకరకాల సంఘటనలే మిగతా కథ.

ఎలా చేశారంటే..: ఈ సినిమాకు ప్రధాన బలం కీలక పాత్రధారిణి పాయల్‌ రాజ్‌పుత్‌. ‘ఆర్‌.ఎక్స్‌ 100’ లాంటి చిత్రాల్లో బొద్దుగా, పూర్తి గ్లామర్‌గా కనిపించిన పాయల్‌ ఈసారి నాజూకు దేహంతో, డీ గ్లామరైజ్డ్‌ పల్లెటూరి అమ్మాయి పాత్రలో ప్రత్యక్షమయ్యారు. కానీ, తన హావభావాలతో, అభినయించే కళ్ళతో కథలోని తన పాత్ర ప్రవర్తనకు తగ్గట్టు ఎన్నో భావాలు పలికించారు. తల్లి పాత్రలో కన్నడ నటి వీణా సుందర్‌ జీవించారు (తెలుగుకు తొలి పరిచయం. కన్నడ మాతృకలోనూ ఆమె ఇదే పాత్ర చేశారు). పత్తి ఏకుతున్నప్పుడూ, సారాయి దుకాణంలో షాకింగ్‌ తెలిసినప్పుడూ తండ్రి పాత్రలో ఆనంద్‌ చక్రపాణిని మర్చిపోయి, ఆ పాత్రనే చూస్తాం.  

ఎలా తీశారంటే..: చిన్న బడ్జెట్‌ చిత్రాలను వరుసగా ఓ.టి.టిలో వదులుతున్న వేదిక ‘ఆహా’. ట్రెండ్‌ లౌడ్‌ సంస్థతో కలసి, ఈ ‘అనగనగా ఓ అతిథి’ని నిర్మించింది. కన్నడంలో సక్సెసై, అక్కడి కర్ణాటక సర్కారు నుంచి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటి (వీణా సుందర్‌) అవార్డులు అందుకున్న ‘ఆ కరాళ రాత్రి’ (2018) చిత్రానికి ఇది రీమేక్‌. ఓ ప్రసిద్ధ పాశ్చాత్య రచన ఆధారంగా వచ్చిన కన్నడ నాటకం ఆ కన్నడ చిత్రానికి ఆధారం. కన్నడంలో డైరెక్ట్‌ చేసిన తెలుగు – తమిళుడు దయాళ్‌ పద్మనాభన్‌ ఇప్పుడీ రీమేక్‌తో తెలుగు తెరకు పరిచయమయ్యారు.

నాలుగే పాత్రల చుట్టూ, ఒకే ఇంట్లో తిరిగేలా ఓ పూర్తి నిడివి సినిమా తీయడం కొంత సాహసమే. కథలో ఊహించని ట్విస్టు పెట్టడమూ బాగుంది. కానీ, కన్నడంలో 18 చిత్రాల అనుభవంతో 17 డేస్‌లోనే, రూ. 2.30 కోట్ల తక్కువ బడ్జెట్‌లో సినిమా తీసిన దర్శకుడు ఈ కథను నడిపించడంలో ఇబ్బంది పడ్డాడు. సినిమాలోని పాత్రల ప్రవర్తన కొన్నిసార్లు లాజిక్‌కు అందదు. ముఖ్యంగా, ఓ కీలక నిర్ణయం సమయంలో ప్రధాన పాత్రలు తీసుకొనే నిర్ణయానికి హేతువు కనిపించదు. పోస్టర్లలో ఫోటోలకూ, కథకూ సంబంధం లేకపోవడమూ కన్‌ఫ్యూజింగ్‌ పబ్లిసిటీ ట్యాక్టిక్స్‌. అలాంటి తప్పులనూ, కన్నడ ఛాయలనూ, తగ్గిన వేగాన్నీ పట్టించుకోకపోతే, టికెట్‌ కొనకుండా ఇంట్లోనే చూస్తున్నాం గనక ఈ మాత్రం చాలు లెమ్మని సరిపెట్టుకుంటాం.

కొసమెరుపు:
సినిమా చూస్తున్నా... సీరియల్‌ ఫీలింగ్‌!   

బలాలు:
ఊహించని ట్విస్టున్న కథ
పాత్రధారుల నటన, రీరికార్డింగ్‌
చివరి ముప్పావుగంట సినిమా

బలహీనతలు
సీరియల్‌లా సాగే కథనం
ఆర్టిఫిషియల్‌ డైలాగ్స్‌
లాజిక్‌కు అందని పాత్రల ప్రవర్తన

 – రెంటాల జయదేవ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top