అలా అనుకున్నాను కాబట్టే ఇంత దూరం వచ్చా! | Allu Arjun Pushpa Movie Teaser Launch | Sakshi
Sakshi News home page

అలా అనుకున్నాను కాబట్టే ఇంత దూరం వచ్చా!

Apr 8 2021 12:26 AM | Updated on Apr 8 2021 8:38 AM

Allu Arjun Pushpa Movie Teaser Launch - Sakshi

‘‘పుష్ప’ సినిమాలోని ‘తగ్గేదే లే’ డైలాగ్‌ని నేను వ్యక్తిగతంగానూ ఆచరిస్తా. మీ అందరిలాగే నాకూ భయాలుంటాయి. నేనూ భయపడే క్షణాలుంటాయి. అప్పుడు నేను ‘ధైర్యం చేసి ముందడుగు వేసెయ్‌. పడిపోయినా ఫరవాలేదు. తగ్గేదే లే’ అనుకుంటా. అలా అనుకున్నాను కాబట్టే ఇంత దూరం వచ్చాననుకుంటున్నా’’ అని అల్లు అర్జున్‌ అన్నారు. ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. రష్మికా మందన్న కథానాయిక. నవీన్‌ ఎర్నేని, వై. రవి శంకర్‌ నిర్మిస్తున్నారు. నేడు (ఏప్రిల్‌ 8) అల్లు అర్జున్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్‌లో ‘పుష్ప’ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ– ‘‘ఇంతమంది ప్రేమకంటే గొప్ప బహుమతి ఏముంటుంది? నిజంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి. నా లైఫ్‌ టేకాఫ్‌ అయిందే సుకుమార్‌  ‘ఆర్య’ వల్ల. ఆ సినిమాతోనే నాకు ‘స్టైలిష్‌ స్టార్‌’ అని పేరొచ్చింది. ఈ రోజు ‘ఐకాన్‌ స్టార్‌’ అని ఓ కొత్త పేరొచ్చింది. నాకు ‘ఆర్య’, ‘ఐకాన్‌ స్టార్‌’ ఇచ్చినందుకు సుకుమార్‌కి థ్యాంక్స్‌. నేను చేసేది ఏదైనా ఫ్యాన్స్‌కు నచ్చాలి. నా జీవితాన్నే వారికి అంకితమిస్తున్నా’’ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘హిందీ సహా పరభాషా ప్రేక్షకుల వల్లే తెలుగు సినిమా రేంజ్‌ పెరిగింది.. ఇంత పెద్ద మార్కెట్‌ వచ్చింది. వినోదరంగంలో రానున్న 25 ఏళ్లలో తెలుగు సినిమా ప్రపంచంలోనే పెద్ద స్థాయికి చేరుకుంటుంది’’ అన్నారు.

చదవండి: అల్లు అర్జున్‌ కెరీర్‌లో దుమ్ము లేపిన టాప్‌ 5 చిత్రాలు..

నిర్మాత వై. రవిశంకర్‌ మాట్లాడుతూ– ‘‘మంచి కథతో పాటు నటన, డైలాగ్స్, కెమెరా, సంగీతం, ఎమోషన్స్, ఫైట్స్‌... ఎంత ముఖ్యమో అవన్నీ కలగలిసినదే మా‘పుష్ప’ సినిమా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సానా బుచ్చిబాబు, హీరో అల్లు శిరీష్, ముత్తంశెట్టి మీడియా రవి పాల్గొన్నారు.

ఇక నుంచి బన్నీ ‘ఐకాన్‌ స్టార్‌’!
– సుకుమార్‌
‘‘బన్నీకి స్టైలిష్‌ స్టార్‌ అనే పేరు ఎప్పుడొచ్చిందో నాకు తెలియదు. కానీ ‘పుష్ప’లో తన అద్భుతమైన నటనను మీకు అందించబోతున్నాం. ప్రామిస్‌. తన నటనకీ, ‘స్టైలిష్‌ స్టార్‌’కీ  సంబంధం లేదనిపించింది. తన ప్రతి పాత్ర, ప్రతి సినిమా, తన ప్రతి డ్రెస్‌ యూనిక్‌.. ప్రతి విషయంలో యూనిక్‌ అయినందుకే తను స్టైలిష్‌ స్టార్‌ కాదని నేను భావించి ‘ఐకాన్‌ స్టార్‌’ అని పెట్టా. బన్నీని ఇదివరకు ‘ఆర్య’ అని పిలిచేవారు. ‘పుష్ప’ తర్వాత రెండే విషయాలు మిగలాలి... ఒకటి ‘ఐకాన్‌ స్టార్‌’, రెండోది ‘పుష్ప’ అని పిలవాలి’’ అని దర్శకుడు సుకుమార్‌ అన్నారు.

చదవండి: పుష్ప టీజర్‌‌: ఊరనాటుగా అల్లు అర్జున్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement