
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త.. జాకీ భగ్నానీ (Jackky Bhagnani) నిర్మాత మాత్రమే కాదు నటుడు కూడా! సినిమాల్లో నటుడిగా కనిపించడానికి ముందు ఏకంగా 60 కిలోలు తగ్గి అందర్నీ సర్‌ప్రైజ్ చేశాడు. ఆ తర్వాత 2009లో కల్ కిస్నే దేఖా చిత్రంతో వెండితెరకు నటుడిగా పరిచయమయ్యాడు. 2017లో ఓ సినిమా కోసం 15 కిలోలు తగ్గాడు. కేవలం 21 రోజుల వ్యవధిలోనే అంత బరువు ఎలా తగ్గాడని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆ సీక్రెట్ మాత్రం ఎవరికీ చెప్పనంటున్నాడు జాకీ భగ్నానీ.
అది ఆరోగ్యకరం కాదు
తాజాగా జాకీ భగ్నానీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు తగ్గాను. కానీ అదంత ఆరోగ్యకరం కాదు. ఈ విషయంలో నేనెవరికీ సలహాలు, సూచనలు ఇవ్వను. ఒక షూట్ కోసం సడన్‌గా బరువు తగ్గాల్సి వచ్చింది. నా చేతిలో ఆప్షన్స్ లేవు. పైగా సమయం తక్కువే ఉంది. అప్పుడు నేను ఏం చేశానన్నది ఎవరికీ చెప్పదలుచుకోవడం లేదు. కానీ, దానివల్ల చాలా దుష్ప్రభావాలు ఎదురయ్యాయి.
సైడ్ ఎఫెక్ట్స్
ఒకేసారి ఎక్కువ బరువు కోల్పోయినప్పుడు యాసిడిటీ, జుట్టు కోల్పోవడం, జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. శరీరం కూడా నీరసించిపోతుంది. ఎందుకంటే సడన్‌గా సన్నబడటం అనేది సహజమైన ప్రక్రియ కాదు కదా.. అయితే రోజంతా కడుపు మాడ్చుకోవాలి.. లేదంటే ఒంట్లో కొవ్వు తగ్గించేందుకు వేరే విధానాలు ఎంచుకోవాలి. ఈ రెండూ మంచివి కావు.
శరీరాన్ని కంట్రోల్‌లో ఉంచుకుంటా..
సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నేను నా బరువును కంట్రోల్‌లో ఉండేలా చూసుకుంటున్నాను. ఇందుకోసం ప్రతిరోజూ కష్టపడాల్సిందే! ఏదైనా వెకేషన్‌కు వెళ్లానంటే నోరు కట్టేసుకోకపోతే సహజంగానే లావెక్కుతాను. అప్పుడు మళ్లీ కష్టపడాల్సి ఉంటుంది. అందుకే ఫిట్‌నెస్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాను అని జాకీ భగ్నానీ చెప్పుకొచ్చాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో జాకీ బరువు తగ్గడం గురించి మాట్లాడుతూ.. రోజుకు 10-15 కి.మీ. పరిగెత్తేవాడినని చెప్పాడు. కేవలం ఐదు గ్రాముల కార్బోహైడ్రేట్లను కూరగాయల రూపంలో ఆరగించేవాడినని తెలిపాడు.