నా కుమారులు నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమంటున్నారు: నటి

Actress Urvashi Dholakia Says Her Twin Sons Want Her To Get Married Again - Sakshi

ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఊర్వశి ధోలాకియా

మన వ్యవస్థలో విడాకులు తీసుకున్న మగవారు వెంటనే మరో వివాహం చేసుకుంటారు. సమాజం కూడా ఒంటరి మగవారి పట్ల సానుభూతి చూపుతుంది. అదే ఆడవారి విషయానికి వస్తే.. సమాజంతో పాటు కుటుంబ సభ్యుల ఆలోచన ధోరణి కూడా ఇందుకు భిన్నంగా ఉంటుంది. భర్త చనిపోయిన తర్వాతనో లేక విడాకులు తీసుకున్న మహిళ.. మరో సారి పెళ్లి చేసుకోవడాన్ని పెద్ద నేరంగా పరిగణిస్తారు చాలా మంది. ఇక వారికి ఎదిగిన పిల్లలు ఉంటే.. బిడ్డలకు పెళ్లి చేయాల్సింది పోయి ఈమె వివాహాం చేసుకోవడం ఏంటి అంటూ అడ్డదిడ్డంగా మాట్లాడతారు.

చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి విషయాల్లో కుటుంబ సభ్యులు ఆడవారికి అండగా నిలుస్తారు. ఈ కోవకు చెందిన కుటుంబమే టీవీ నటి ఊర్వశి ధోలాకియాకు దొరికింది. అందుకే భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న ఆమెను రెండో వివాహం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారట. అది కూడా ఆమె కుమారులు. ఈ విషయాలను ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు ఊర్వశి.

ఇక ఇంటర్వ్యూలో భాగంగా ఊర్వశి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘‘బాల నటిగా ఇండస్ట్రీలో ప్రవేశించాను. 16వ ఏట ప్రేమలో పడ్డాను. 17వ ఏట నాకు కవలలు జన్మించారు. సాగర్‌, క్షితిజ్‌. ఆ తర్వాత భర్తతో విడిపోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి నేను ఒంటరిగానే ఉన్నాను. సింగిల్‌ పేరెంట్‌గానే నా బిడ్డలను పెంచి పెద్ద చేశాను. వారికి మంచి చదువు, కెరీర్‌ అందించాలని రాత్రింబవళ్లు పని చేశాను. రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియనంత బిజీగా గడిపాను. చూస్తుండగానే నా కొడుకులిద్దరు పెద్దవారయ్యారు. వారి కాళ్ల మీద వారు నిలబడగలిగారు. ఇందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను’’ అంటూ చెప్పుకొచ్చారు ఊర్వశి

నన్ను మరో పెళ్లి చేసుకోమని కోరుతున్నారు..
‘‘ఇప్పుడు కుటుంబ సభ్యులు, నా కొడుకులిద్దరు నేను జీవితంలో సెటిల్‌ అవ్వాలని కోరుకుంటున్నారు. మరో పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు. నా బిడ్డలు ఓ అడుగు ముందుకు వేసి ‘‘అమ్మ నీకు నచ్చిన వ్యక్తిని వివాహం అయినా చేసుకో.. లేదంటే డేటింగ్‌ చేయ్‌’’ అని అడుగుతుంటారు. వారి మాటలను నేను పెద్దగా పట్టించుకోను. నవ్వేసి ఊరుకుంటాను’’ అని చెప్పుకొచ్చారు.

అలాంటి వ్యక్తి దొరికితే ఆలోచిస్తాను..
‘‘నా భర్తతో విడిపోయిన తర్వాత నాకు మరో సారి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రాలేదు. దీని గురించి ఆలోచించే టైమ్‌ కూడా దొరకలేదు. ఇక మరో విషయం ఏంటంటే నేను చాలా స్వతంత్ర భావాలు కల మహిళను. నా జీవితాన్ని నాకు నచ్చినట్లు జీవిస్తాను. ఎవరి కోసం నన్ను నేను మార్చుకోను. వీటన్నింటిని అర్థం చేసుకునే వ్యక్తి తారసపడితే అప్పుడు ఆలోచిస్తాను. కానీ ఇప్పుడు నా దగ్గర అందుకు టైం కూడా లేదు’’ అన్నారు.

బలవంతంగా మనల్ని మనం మార్చుకోవడం సరికాదు..
‘‘ఇక లవ్‌లో కానీ పెళ్లి బంధంలో కానీ మనం సౌకర్యవంతంగా ఉంటూనే అవతలి వ్యక్తిని ఇష్టపడాలి, ప్రేమించాలి. మన స్పేస్‌ మనం తీసుకున్నట్లే.. ఎదుటి వ్యక్తికి కూడా పర్సనల్‌ స్పేస్‌ ఇవ్వాలి. అంతేతప్ప మనల్ని ప్రేమిస్తున్నారు కదా అని.. వారి కోసం బలవంతంగా మనల్ని మనం మార్చుకుంటే.. ఆ బంధం ఎంతో కాలం నిలవదు. ఎవరికైనా నేను ఇచ్చే సలహా ఇదే. మన కంఫర్ట్‌ని వదులుకుని మరీ ఎదుటి వారి కోసం మారాల్సిన అవసరం లేదు. అలా చేస్తే ఆ బంధం ఎక్కువ కాలం నిలవదు’’ అంటూ చెప్పుకొచ్చారు ఊర్వశి. 

కసౌటి జిందగీ కే మొదటి ఎడిషన్‌లో కొమోలికా పాత్రతో ఊర్వశి ధోలకియా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆమె దేఖ్ భాయ్ దేఖ్, శక్తిమాన్, కబీ సౌతాన్ కబీ సాహెలి, తుమ్ బిన్ జావున్ కహాన్, కహిన్ టు హోగా, బేట్టాబ్ దిల్ కీ తమన్నా హై, చంద్రకాంత - ఏక్ మాయావి ప్రేమ్ గాథా వంటి టీవీ షోలలో నటించారు. బిగ్ బాస్ సీజన్‌ 6 విజేతగా నిలిచారు ఊర్వశి.

చదవండి: 
కలికాలం: భర్తకు విడాకులు.. మామతో వివాహం
రెండోపెళ్లి నాకు ఓకే : నాగబాబు.. పోస్ట్‌ వైరల్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top