సినిమాల్లో చేసిన హీరోయిన్లు.. ఇండస్ట్రీకి కొన్నిసార్లు త్వరగానే దూరమైపోతుంటారు. తర్వాత ఫ్యామిలీ లైఫ్ గడుపుతూ బయట పెద్దగా కనిపించరు. ఇప్పుడు కూడా అలానే టాలీవుడ్‌లో పలు సినిమాలు చేసిన ఓ బ్యూటీ కనిపించింది. స్వతహాగా నటి, డ్యాన్సర్ అయిన ఈమె.. ఇప్పుడు ఫేమస్ దేవాలయంలో కీర్తనలు పాడుతూ కనిపించింది. ఆ వీడియోని స్వయంగా ఆమెనే పోస్ట్ చేసింది. మరి ఈ మాజీ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
పైన ఫొటోలో కనిపిస్తున్నది శరణ్య మోహన్. అలెప్పీలో పుట్టిన ఈ కేరళ కుట్టి.. ఎనిమిదేళ్ల వయసులోనే సినిమాల్లోకి వచ్చేసింది. మలయాళంలో మూడు, తమిళంలో రెండు చిత్రాల్లో బాలనటిగా కనిపించింది. టీనేజ్‌లోకి వచ్చాక సహాయ పాత్రలు, తర్వాత హీరోయిన్ అయిపోయింది. తెలుగు సినిమా 'విలేజ్‌లో వినాయకుడు'లో హీరోయిన్‌గా చేసిన శరణ్య.. తర్వాత నాని 'భీమిలి కబడ్డీ జట్టు', 'కల్యాణ్ రామ్ కత్తి', 'హ్యాపీహ్యాపీగా' చిత్రాల్లోనూ కనిపించింది.
1997 నుంచి 2014 వరకు సినిమాల్లో నటించిన శరణ్య మోహన్.. 2015లో తన చిన్నప్పటి ఫ్రెండ్ అరవింద్ కృష్ణన్‌ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. ప్రస్తుతానికైతే ఈమెకి సినిమాలు చేసే ఆలోచన లేదు. భవిష్యత్తులోనూ చేసేలా కనిపించట్లేదు. ఇకపోతే స్వతహాగా భరతనాట్యం డ్యాన్సర్ అయిన శరణ్య.. తన డ్యాన్స్ వీడియోలని సోషల్ మీడియాలో అప్పడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఈమెలో అద్భుతమైన సింగర్ ఉందని తాజాగా బయటపడింది. ప్రస్తుతం జరుగుతున్న గురువాయిర్ చెంబి సంగీతోత్సవంలో కీర్తనలు పాడుతూ అలరించింది. ఈ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఇన్ స్టాలో పోస్ట్ కూడా పెట్టింది.


