ఆ అవకాశాం వస్తే ఎందుకు చేయను?: నందితా శ్వేత

Actress Nandita Swetha Talks About Beauty Of Godavari - Sakshi

సాక్షి, మలికిపురం: గోదావరి తీరం చాలా ఆహ్లాదకరంగా ఉందని సినీ నటి నందితా శ్వేత అన్నారు. విజయానంద్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై జి.వెంకట సత్యప్రసాద్‌ దర్శకత్వంలో నటిస్తున్న ‘రారా.. నా పెనిమిటి’ చిత్రం షూటింగ్‌ నిమిత్తం ఆమె ప్రస్తుతం రాజోలు దీవిలో ఉన్నారు. గోదావరి లంకల్లో ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆదివారం ఆమె మలికిపురంలో ‘సాక్షి’తో ముచ్చటించారు. 

‘రారా.. నా పెనిమిటి’ సినిమా మీకు ఎన్నో చిత్రం? 
నందితా శ్వేత: గతంలో నితిన్‌తో శ్రీనివాస కళ్యాణం, ‘అక్షర’తో పాటు నిఖిల్‌తో ఒక సినిమా చేశారు. ఇది నాలుగో సినిమా. 

తెలుగు సినీ పరిశ్రమలో మీకు లభిస్తున్న ఆదరణ ఏవిధంగా ఉంది? 
నందితా శ్వేత: నా చిత్రాలతో పాటు గత సినిమాలను కూడా పరిశీలిస్తే తెలుగు ప్రేక్షకుల అభిరుచి చాలా బాగుంటుంది. కథ, కథనంతో పాటు చక్కని సందేశాత్మక, వినోదాత్మక చిత్రాలను ఆదరిస్తారు. 

పెద్ద హీరోలతో అవకాశాలు రావట్లేదా? 
నందితా శ్వేత: ఇప్పడిపుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నా. అవకాశాలు వస్తే ఎందుకు చేయను?

ఇంతకు ముందు ఎప్పుడైనా కోస్తా తీరానికి వచ్చారా? 
నందితా శ్వేత: లేదు. ఈ చిత్రం కోసమే వచ్చాను. 

ఇక్కడి వాతావరణం ఎలా ఉంది? 
నందితా శ్వేత: చాలా బాగుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో షూటింగ్‌ చేశాం. చక్కటి వాతావరణం. గోదావరి నదీ పాయలు, కొబ్బరి తోటలు, పంట పొలాలూ చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడి ప్రజల మర్యాద, వద్దన్నా వినకుండా మరీమరీ అడిగి వడ్డించి, తినిపించే ఆత్మీయత, వారి పలకరింపులు చాలా బాగున్నాయి. కోనసీమ వంటకాలు కూడా చాలా బాగున్నాయ్‌. ఉల్లిపాయలు, కోడిగుడ్డుతో చేసే ఆమ్లెట్‌ మరీ రుచిగా ఉంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top