
హీరోల విషయంలో లావా?సన్నమా? పొట్టా? బట్టా? జుట్టా? విగ్గా? ఇవేవీ సమస్యలుగా కనిపించవు. కానీ అదే హీరోయిన్ విషయానికి వచ్చేసరికి అన్ని విధాలుగా పర్ఫెక్ట్‌గా ఉండాలని ఆశిస్తారు. శరీరపు కొలతల దగ్గర నుంచి ప్రతీ ఒక్కటీ బాగుంటేనే ఆమె కధానాయిక అని లేకపోతే పనికిరాదు అంటూ ఈసడిస్తారు. ఆడైనా, మగ అయినా అభినయమే ప్రధాన అర్హతగా కొనసాగాల్సి ఉన్నా దానిని మహిళల విషయానికి వచ్చేసరికి పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు.
ఒకప్పుడు అవకాశాలు ఇచ్చే నిర్మాతలు, దర్శకుల నుంచి మాత్రమే బాడీ షేమింగ్ ఎదుర్కున్న సినీ పరిశ్రమకు చెందిన యువతులు... ఇప్పుడు ఏ సంబంధం లేనివారు సైతం తమను, తమ శరీరాన్ని కామెంట్ చేస్తుంటే భరించాల్సిన పరిస్థితిని సోషల్ మీడియా సృష్టించింది. మొన్నటి విద్యాబాలన్ దగ్గర నుంచి నిన్నటి నిత్యా మీనన్ దాకా ప్రతీ ఒక్కరూ ఎదుర్కున్న సమస్య ఇది. ఇప్పుడు ఈ జాబితాలో మరో అందమైన నటి కూడా చేరారు. ఆమె మంజిమా మొహన్(Manjima Mohan ).
తెలుగులో సాహసమే శ్వాసగా సాగిపో, కధానాయకుడు వంటి సినిమాల్లో నటించిన మంజిమా మోహన్ పలు మళయాళ డబ్బింగ్ సినిమాల ద్వారా కూడా దక్షిణాది ప్రేక్షకులకు చిరపరిచితులు. మళయాళ సినీతార మన్జిమా మొహన్,ఐదేళ్ల చిన్న వయసులోనే నటన ప్రారంభించి 2001 దాకా వరుసగా నటించారు. ఆ తరువాత ఒరు వేదక్కన్ సెల్ఫీ అనే చిత్రంతో 2015లో లీడ్ పాత్రలో తిరిగి కనిపించారు. ఆమె నటనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. అయితే తర్వాత చిత్రాల్లో కూడా నటనకు ప్రశంసలతో పాటే దురదృష్టవశాత్తూ ఆమె శరీరపు బరువు కూడా ఎగతాళికి నోచుకుంది.
మరీ ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై తన బరువును ఉద్ధేశ్యించి పలువురు చేసిన క్రూర వ్యాఖ్యలు ఆమె మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపించాయి. ముఖ్యంగా కొన్ని వ్యాఖ్యలు ఆమెను భావోద్వేగాలను సంక్షోభం లోకి నెట్టాయని ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలిపారు.
‘బరువు తగ్గించడం వల్ల మరి కొన్ని సినిమాల్లో అవకాశాలు వస్తాయేమో; కానీ అది ముఖ్యం కాదు. నిజానికి సినిమా రంగం దాటితే నా బరువు ఎవరికీ ఒక విషయమే కాదు. అవును...సినిమా నా జీవితంలో ఒక భాగమే. అయితే నా లక్ష్యాలు స్క్రీన్ కు మించినవి ఎన్నో ఉన్నాయ్‘ అని ఆమె చెప్పారు. అయినప్పటికీ ఈ వ్యాఖ్యల్ని తట్టుకోవడం తన వల్ల కావడం లేదని ఆమె అంగీకరించారు.
అధిక బరువు అనే సమస్య వల్ల శారీరకంగా భావోద్వేగపరంగా సంక్లిష్టమైన దశను తాను అనుభవించానని, చివరకి బరువు తగ్గేందుకు డాక్టర్లను సంప్రదించానని కూడా ఆమె వెల్లడించారు. ఏదో రకంగా బరువు తగ్గాలని అనుకున్నా. అవసరమైతే సర్జరీ కూడా చేయించుకోవాలని అనుకున్నా ‘‘ అని ఆమె అన్నారు
తనకు పిసిఓడి సమస్య ఉందని దీనిని దృష్టిలో ఉంచుకుని తాను తన ఆరోగ్య పరమైన మార్పు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుందని ఆమె వెల్లడించారు. తాను బరువు కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ ఆరోగ్య సమస్యలేవీ లేనప్పుడు దాని గురించి చింతించాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు. నటుల అభినయమే ప్రధానం కావాలని వారి రూపు రేఖలు కాదని అంటున్న ఈ 32ఏళ్ల మహిళ ఆవేదన ఈ సోషల్ జమానా అర్ధం చేసుకుంటుందా?