
మత్తుపదార్థాల కేసులో అరెస్ట్ అయిన కోలీవుడ్ నటులు శ్రీరామ్, కృష్ణ విడుదలయ్యారు. మాదక ద్రవ్యాల వాడిని కేసులో నటుడు శ్రీరామ్ (తమిళంలో శ్రీకాంత్) ను పోలీసులు గత నెల 23వ తేదీన అరెస్ట్ చేసి పుళల్ జైలుకు తరలించిన విషయం, అదే కేసులో మరో నటుడు కృష్ణ ను గత నెల 26వ తేదీన అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా పోలీసుల విచారణలో తమ తప్పును అంగీకరించిన ఈ నటులు బెయిల్ కోసం చెన్నై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే ఆ కోర్టు వీరి బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేసింది. దీంతో శ్రీరామ్, కృష్ణ తరుపు న్యాయవాదులు చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం శ్రీరామ్, కృష్ణకు రెండు రోజుల క్రితం నిబంధనలతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. దీంతో కోర్టు ఉత్తర్వుల ప్రతులను న్యాయవాదులు జైలు అధికారులకు అందించారు. అనంతరం ప్రొసీజర్స్ పూర్తి చేసిన జైలు అధికారులు నటులు శ్రీరామ్, కృష్ణను విడుదల చేశారు.
తప్పు చేశాను.. నా కుమారుడిని చూసుకోవాలి
డ్రగ్స్ ఉపయోగించి తప్పు చేశానని కోర్టులోనే శ్రీరామ్ ఒప్పుకున్నారు. అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్ తనకు మత్తుపదార్థాలను అలవాటు చేసినట్లు పోలీసుల విచారణలో శ్రీరామ్ తెలిపారు. ఆయన నిర్మాణంలో ‘తీంగిరై’ అనే సినిమాలో నటించానని, ఆ ప్రాజెక్ట్కు సంబంధించి తనకు రూ.10 లక్షలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో డబ్బు అడిగినప్పుడల్లా ఆయన కొకైన్ ఇచ్చేవారని పేర్కొన్నారు. రెండుసార్లు వాడిన తర్వాత మూడోసారి తానే అడిగే పరిస్థితి ఏర్పడిందని పోలీసులకు శ్రీరామ్ వెల్లడించారు. అయితే, తప్పు చేశానని ఆయన ఒప్పుకున్నారు. తన కుమారుడిని చూసుకోవాల్సి ఉందని అందుకు బెయిల్ మంజూరు చేయాలని శ్రీరామ్ కోరారు. దీంతో కొన్ని షరతులతో కూడిన బెయిల్ న్యాయస్థానం మంజూరు చేసింది.