
కన్నడ నటి, రాజకీయ నాయకురాలు దివ్య స్పందన(రమ్య)పై దర్శన్ అభిమానులు ట్రోలింగ్కు దిగారు. సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేస్తూ బూతులతో విరుచుకపడుతున్నారు. ఏకంగా ఆమెను అత్యాచారం చేస్తామంటూ మెసేజులు చేస్తున్నారు. రేణుకస్వామికి బదులుగా నిన్ను (రమ్య) హత్య చేసి ఉంటే బాగుండేదని మరికొందరు దర్శన్ ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. రోజురోజుకు వారి నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె పోలీసులను ఆశ్రయించనున్నారు.
ఈ అంశంపై ఇండియా టుడేతో ప్రత్యేకంగా రమ్య ఇలా మాట్లాడింది. 'బెంగళూరు కమిషనర్ ఈ రోజు నాకు సమయం ఇస్తున్నారు, కాబట్టి నేను వెళ్లి ఆయన్ను కలుస్తాను. నేను నా న్యాయవాదులను కూడా ఇప్పటికే సంప్రదించాను. ఎవరైతే నా కుటుంబంపై ట్రోల్ చేస్తున్నారో వారందరిని గుర్తించాము. నన్ను అసభ్యంగా బూతులు తిట్టేవారి సోషల్ మీడియా ఖాతాలను క్రోడీకరించాం. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వాటిని పూర్తి స్థాయిలో సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నాము' అని ఆమె వివరించారు.

మహిళా ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్‌లో కొందరు ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని నటి రమ్య చెప్పారు. సమాజంలో ఇలాంటి చర్యలు చాలా బాధాకరమన్నారు. మహిళలను టార్గెట్ చేస్తూ బూతులు తిట్టడం ఒక అలవాటుగా మారిపోయిందన్నారు. అలాంటి వారిని శిక్షించేందుకు సరైన చట్టాలు లేకపోవడంతోనే వారు ఇలా రెచ్చిపోతున్నారని చెప్పింది. ఒక బలమైన మహిళను ఎదుర్కొవాలంటే మొదట ఆమె క్యారెక్టర్ను దెబ్బకొట్టేలనే పన్నాగంతో కొందరు సోషల్ మీడియాలో పనిచేస్తున్నారని రమ్య పేర్కొంది.
గతంలో దర్శన్‌పై చేసిన కామెంట్ వల్లనే..
లక్షలాది మంచి అభిమానులను సంపాదించుకున్న దర్శన్.. తన జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాడని నటి రమ్య గతంలో పేర్కొంది. తన ప్రియురాలిని సోషల్మీడియాలో తిట్టాడని రేణుకస్వామిని హత్య చేసి దర్శన్ పెద్ద తప్పు చేశాడని ఆమె చెప్పింది. ఒక మనిషిని కొట్టి చంపే అధికారం ఎవరిచ్చారు..? ఎవరైనా మనల్ని ఎక్కువగా ఇబ్బందిపెడితే వారి అకౌంట్ బ్లాక్ చేయాలి. అయినా అదేపనిగా ట్రోల్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అంతేకానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారా? ఒక మనిషిని కొట్టి చంపే అధికారం ఎవరికీ లేదంటూ పలుమార్లు దర్శన్ను రమ్య తప్పుబట్టింది.