ఆ రోజు ఏం జరిగిందంటే...

Actor Nikhil stopped by Hyderabad cops during medicine run - Sakshi

‘‘బ్లాక్‌ ఫంగస్‌ మెడిసిన్‌ కోసం రిక్వెస్ట్‌ వస్తే మణికొండ నుంచి నా భార్యతో రాజేంద్రనగర్‌లోని ఫార్మా ఫ్యాక్టరీ గోడౌన్‌ వరకూ వెళ్లి, అక్కడ్నుంచి సోమాజిగూడ ఆసుపత్రి దాకావెళ్లి ఆ మెడిసిన్‌ అందజేశాను. రాత్రి 2 గంటల టైమ్‌లో నేనొస్తానని ఊహించలేదేమో.. ఆ కుటుంబ సభ్యుల కన్నీళ్లు చూస్తే నాకు కన్నీళ్లొచ్చాయి’’ అన్నారు హీరో నిఖిల్‌. నాలుగు రోజుల క్రితం నిఖిల్‌ అవసరార్ధుల కోసం సికింద్రాబాద్‌లోని ఓ ఆసుపత్రికి మెడిసిన్స్‌ తీసుకెళుతున్న సమయంలో పోలీసులు ‘ఈ పాస్‌’ లేదని అడ్డుకున్నారు.

‘‘ఆ రోజు ఏం జరిగిందంటే... మందులు తీసుకెళుతున్నప్పుడు పోలీసులు ఆపారు. మాస్క్‌ తీసి ముఖం చూపలేదు కానీ, ప్రిస్క్రిప్షన్‌ చూపించి, ఎమర్జెన్సీ అని చెప్పినా ‘ఈ పాస్‌’ ఉండాల్సిందే అన్నారు. రోడ్డు మీదే 20నిమిషాలు ట్రై చేసినా పాస్‌ దొరకలేదు. ఆ విషయాన్నే ట్వీట్‌ చేశా’’ అన్నారు నిఖిల్‌. ఈ ఉదంతం బయటకు వచ్చేవరకూ నిఖిల్‌ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’తో నిఖిల్‌ పంచుకున్న అనుభవాలివి..

తుపాన్లు, వరదలు వస్తే నష్టాన్ని అంచనా వేసి తలా ఇంత అని సాయం చేయడం వేరు. కానీ ఆసుపత్రుల్లో బెడ్స్‌ దొరక్క, మందులు దొరక్క ప్రాణాలు పోయే పరిస్థితులు.. అంచనాలకు అందని వ్యాధులు.. వీటి మధ్య అవసరార్ధులకే కాదు సాయం చేయాలనుకున్నవారికీ కష్టమే. గత ఏప్రిల్‌లో నా భార్య, మా అంకుల్‌ కోవిడ్‌ బారిన పడినప్పుడు ఆసుపత్రుల్లో బెడ్స్‌ కోసం ఎదుర్కొన్న ఇబ్బందులు నన్ను ఆలోచింపజేశాయి. అప్పటికే ట్విట్టర్‌లో చూస్తే... పెద్ద సంఖ్యలో సాయం కోరుతూ రిక్వెస్టులు.  కొంతమందికైనా సహాయం చేయాలనుకున్నాను.

ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్‌లలో వచ్చిన ప్రతీ రిక్వెస్ట్‌నీ పరిశీలించి, వీలైనంతవరకూ అటెండయ్యాం. ఇంజక్షన్‌ కావాలన్నవారికి ఇంజక్షన్, మెడిసిన్స్‌ అంటే మెడిసిన్స్, ఆసుపత్రి బిల్‌ కట్టలేకపోయిన వారికి బిల్లు... ఇలా వందలాది పేషెంట్స్‌కి కావాల్సినవి సమకూర్చగలిగాం. కాకినాడ కేజీహెచ్‌లో ఒకరికి బ్లాక్‌ ఫంగస్, విజయవాడ కామినేని ఆసుపత్రిలో ఇలా కొందరి గురించి ఆరోగ్యాంధ్రకు వారిని ట్యాగ్‌ చేసి రిక్వెస్ట్‌ చేస్తే.. వారు కూడా ఆయా పేషెంట్స్‌కి ఉచితంగా చికిత్స చేయించారు. నాకు విజయవాడ, హైదరాబాద్, వైజాగ్‌ ఆసుపత్రుల్లో మంచి పరిచయాలు ఉండడం హెల్ప్‌ అయింది.

రిక్వెస్టులు తగ్గాయి
ఈ నెల 15 వరకూ  రోజుకు దాదాపు 1000 దాకా రిక్వెస్టులు వచ్చాయి. అయితే ప్రభుత్వం కూడా తగిన చర్యలు చేపట్టడం వల్ల, బెడ్స్‌ బాగా పెరిగి అందుబాటులోకి రావడం వల్లనేమో ఆ తర్వాత తగ్గాయి. గతంలో తిత్లీ తుపాన్‌ టైమ్‌లో కూడా బాధితులకు సేవ చేసిన అనుభవం ఉంది. అయితే ఇన్ని రోజులు ఇంత కంటిన్యూగా చేయడం చాలా కొత్త అనుభవాలను, పాఠాలను నేర్పింది. ఒక అబ్బాయికి ఆక్సిజన్‌ సిలిండర్‌ పంపిస్తే అది ఇంటికి చేరేలోపు చనిపోయాడు. ఇలా చివరి నిమిషాల్లో రిక్వెస్ట్‌లు పెట్టడం వల్ల ప్రాణాలు కాపాడలేకపోవడమనే బాధ కలచివేసింది. ఏదేమైనా కొన్ని ప్రాణాలైనా కాపాడగలిగాం, కొంతమందికైనా ఉపశమనం ఇచ్చామనే సంతృప్తి అయితే ఉంది.

పుట్టినరోజుకి ఫస్ట్‌ లుక్‌
నిఖిల్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘18 పేజెస్‌’. అనుపమా పరమేశ్వరన్‌ కథానాయికగా నటిస్తున్నారు. ‘కుమారి 21 ఎఫ్‌’ ఫేమ్‌ పల్నాటి సూర్యప్రతాప్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి ‘బన్ని’ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. జూన్‌ 1న నిఖిల్‌ పుట్టినరోజు సందర్భంగా ‘18 పేజెస్‌’ ఫస్ట్‌ లుక్‌ విడుదల కానుంది. అయితే బుధవారం అప్‌డేట్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘18 పేజెస్‌’ టైటిల్‌ ఫిక్స్‌ చేసినప్పటినుంచి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. గోపీసుందర్‌ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్‌ ప్రొడ్యూసర్‌: బాబు, కెమెరా: వసంత్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: శరణ్‌ రాపర్తి, అశోక్‌ బి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top