Dasvi Movie Review And Rating: దస్వీ చిత్రం రివ్యూ.. ఎలా ఉందంటే ?

Abhishek Bachchan Dasvi Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: దస్వీ
నటీనటులు: అభిషేక్‌ బచ్చన్, నిమ్రత్ కౌర్, యామీ గౌతమ్
కథ: రామ్‌ బాజ్‌పాయ్‌
నిర‍్మాత: దినేష్‌ విజన్
దర్శకత్వం: తుషర్ జలోటా
సంగీతం: సచిన్‌-జిగర్‌
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్‌, జియో సినిమా
విడుదల తేది: ఏప్రిల్‌ 7, 2022

చదువు ప్రాముఖ్యత గురించి చెప్పిన చిత్రాలు రావడం చాలా అరుదు.  'ఈ ప్రంపంచాన్ని మార్చేందుకు ఉపయోగపడే అత్యంత శక్తివంతమైన ఆయుధం చదువు' అని నెల్సన్‌ మండెలా చెప్పిన కొటేషన్‌తో చదువు గొప్పతనం గురించి వివరించిన హిందీ చిత్రం 'దస్వీ'. నిరాక్షరాస్యుడైన రాజకీయ నాయకుడు జైలు శిక్ష సమయంలో చదువుకున్న విలువ గురించి  ఎలా తెలుసుకున్నాడేది పూర్తి వినోదభరితంగా చూపించిన మూవీ ఇది. ఈ చిత్రంలో అభిషేక్‌ బచ్చన్‌, నిమ్రత్‌ కౌర్‌, యామీ గౌతమ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. అధికారమనే రుచి మరిగితే భార్యాభర్తల నడుమ కూడా ఎలాంటి శత్రుత్వం, పోటీ వస్తుందో కామెడీ తరహాలో చూపించారు దర్శకుడు తుషర్‌ జలోటా. సొంత ఇంట్లోనే పాలిటిక్స్‌ ఎలా ఉంటాయో ఇదివరకూ చాలానే సినిమాలు వచ్చాయి. కానీ దస్వీ మాత్రం అటు పాలిటిక్స్, ఇటు చదువు విలువను రెండింటిని బ్యాలెన్స్‌ చేస్తూ కామెడీ, సెటైరికల్‌ జనర్‌లో రూపొందించారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌. జియో సినిమా వేదికగా ఏప్రిల్‌ 7న విడుదలైన ఈ 'దస్వీ' చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

కథ: 
'దస్వీ' అంటే పదో తరగతి. జాట్ తెగకు చెందిన గంగారామ్‌ చౌదరి (అభిషేక్‌ బచ్చన్‌) హరిత ప్రదేశ్‌ (కల్పిత రాష్ట్రం)కు ముఖ్యమంత్రి. గంగారామ్ చౌదరి నిరాక్షరాస్యుడు, అవినీతి పరుడైన రాజకీయవేత్త. అనేక కుంభకోణాలు చేసిన ముఖ్యమంత్రిగా పేరుంది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ స్కామ్‌లో గంగారామ్‌ చౌదరిని దోషిగా తేల్చి జైలు శిక్ష విధిస్తారు. దీంతో తన భార్య భీమ్లా దేవి (నిమ్రత్‌ కౌర్)ని సీఎంగా ప్రకటిస్తాడు గంగారామ్ చౌదరి. జైలుకు వెళ్లిన గంగారామ్‌ చౌదరి మొదటగా వీఐపీ సౌకర్యాలు పొందుతాడు. కానీ తర్వాత ఆ జైలుకు స్ట్రిక్ట్‌ సూపరింటెండెంట్‌గా జ్యోతి దేశ్వాల్‌ (యామీ గౌతమ్‌) ఎంటర్‌ అవుతుంది. దీంతో గంగారామ్ చౌదరి ఆటలు సాగవు. మిగతా ఖైదీల్లానే గంగారామ్ కూడా ఉండాలని హెచ్చరిస్తుంది జ్యోతి దేశ్వాల్. 

ఇది తట్టుకోలేక జైలులో పని తప్పించుకునేందుకు పదో తరగతి చదవాలని నిశ్చయించుకుంటాడు గంగారామ్‌ చౌదరి. అదే విషయం సూపరింటెండెంట్‌గా జ్యోతి దేశ్వాల్‌కు చెబుతాడు. తను 10వ తరగతి తప్పించుకునేందుకే అని గ్రహించిన జ్యోతి దేశ్వాల్‌ అందులో ఫెయిల్‌ అయితే మళ్లీ సీఎం పదవికి పోటీ చేయొద్దని షరతు విధిస్తుంది. కండిషన్‌కు ఒప్పుకున్న గంగారామ్‌ పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతాడు. మరీ గంగారామ్ పదో తరగతి పూర్తి చేశాడా ? అతనికి ఎవరు సహాయపడ్డారు ? అతను పదో తరగతి పూర్తి చేయకుండా ఎవరూ అడ్డుకున్నారు ? చివరికి గంగారామ్‌ చౌదరి తెలుసుకున్నదేంటీ ? పదో తరగతి తర్వాత గంగారామ్ ఏ మార్గాన్ని ఎంచుకున్నాడు ? అనేదే 'దస్వీ' కథ. 

విశ్లేషణ: 

చదువు నేపథ్యంలో వచ్చిన చిత్రాలు తక్కువే​ అయినా రాజకీయాలకు, చదువుకు ముడిపెట్టి సెటైరికల్‌ డ్రామాగా 'దస్వీ'ని తెరకెక్కించారు డైరెక్టర్‌ తుషర్‌ జలోటా. 2007లో వచ్చిన 'షోబిజ్' సినిమాలో నటించిన తర్వాత తుషర్ జలోటా డైరెక్ట్‌ చేసిన తొలి చిత్రమిది. ఈ మధ్య సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతున్న వివిధ ఛాలెంజ్‌ (గ్రీన్‌ ఛాలెంజ్, ఫిట్‌ ఛాలెంజ్‌)లను రాజకీయనాయకులు ఎలా తీసుకుంటారో వ్యంగంగా చూపిస్తూ సినిమా ప్రారంభమవుతుంది. అసలుకే చదువురాని, మోస్ట్ కరప్ట్‌డ్‌ సీఎంగా పేరొందిన హరిత ప్రదేశ్ ముఖ్యమంత్రి గంగారామ్‌ చౌదరికి టీచర్‌ పోస్టుల భర్తీ స్కామ్‌లో ఊహించని విధంగా కోర్టు తీర్పు వెలువడుతుంది. అయితే కథ దృష్ట్యా స్కామ్‌ ఎలా జరిగిందో అదేమి వివరించకుండా నేరుగా జైలు శిక్ష విధిస్తున్నట్లు సినిమాలో చూపించారు. ఇక జైలుకు వెళ్లిన గంగారామ్ చౌదరికి అక్కడ ఎదురయ్యే కష్టాలు ​అంతా ప్రభావంగా చూపించకపోయిన కామెడీ యాంగిల్‌లో చూపించారు. రాజకీయనాయకులు జైలులో ఉండి తమ పనులు తమ బంధువులతో ఎలా చేయగలరో ఈ సినిమాలో చూపించారు. అయితే జైలుకు కొత్త సూపరింటెండెంట్‌గా జ్యోతి దేశ్వాల్‌ రావడం, ఆమె రూల్స్‌ తట్టుకోలేక పదో తరగతి చదవాలని గంగారామ్ నిశ్చయించుకోవడంతో అసలు కథ ప్రారంభమవుతుంది. 

ఈ సినిమాలో గంగారామ్ చౌదరి పదో తరగతి చదువుకునే తీరు చాలా నవ్విస్తూ ఆకట్టుకుంటుంది. పదో తరగతిలోని ఒక్కో సబ్టెక్ట్‌ను జైలులో ఉన్న ఒక్కో ఖైదీ గంగారామ్‌కు నేర్పించడం చాలా సరదాగా ఆకట్టుకుంటుంది. ఈ సన్నివేశాలు సినిమాకు చాలా ప్లస్‌గా కూడా నిలిచాయి. ఇక చరిత్ర చదివేటప్పుడు ఫ్రీడమ్‌ ఫైటర్స్‌ లాలా లజపతిరాయ్‌, మహాత్మ గాంధీజీ, చంద్రశేఖర్ ఆజాద్‌, సుభాష్‌ చంద్రబోస్‌ వంటి మహనీయులతో కలిసి గంగారామ్‌ చౌదరి ట్రావెల్‌ చేసినట్లు చూపించడం, వారి మధ్య సంభాషణలు నవ్వు తెప్పిస్తాయి. వారు తమ ప్రాణాలను ఎందుకు త్యాగం చేయాల్సివచ్చిందో చెప్పడం బాగా ఆకట్టుకున్నాయి. గంగారామ్‌ చౌదరి.. మ్యాథ్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లీష్‌, హిందీ నేర్చుకునే విధానం ఎంతో అలరిస్తుంది. అలాగే మరోవైపు గంగారామ్‌ చౌదరి భార్య భీమ్లా దేవి ముఖ్యమంత్రిగా రాణిస్తూ తన భర్తనే తొక్కేయ్యాలని చూసే సీన్లను కామెడీగా బాగా చూపించారు. గంగారామ్ చౌదరికి మళ్లీ సీఎం పదవి దక్కకుండా చేసే భీమ్లా దేవి ప్రయత్నాలు సైతం బాగున్నాయి. పొలిటిషియన్స్‌ తమను తాము ఎలా ప్రమోట్‌ చేసుకుంటారో సెటైరికల్‌గా చాలా బాగా చూపించారు డైరెక్టర్‌ తుషర్ జలోటా. 

ఎవరెలా చేశారంటే ?

హరిత ప్రదేశ్‌ అవినీతి, నిరాక్షరాస్యుడైన ముఖ్యమంత్రి గంగారామ్‌ చౌదరిగా అభిషేక్‌ బచ్చన్‌ అద్భుతంగా నటించాడు. తన యాస, డైలాగ్ డెలీవరీ, నిరాక్షరాస్యుడిగా పలికే కొన్ని మాటలు ఎంతో ఆకట్టుకున్నాయి. రాజకీయ నాయకుడి వ్యవహార శైలీ, అహంకారం, కామెడీ టైమింగ్, హావాభావాలు ఎంతో మెచ్చుకునేలా ఉన్నాయి. గంగారామ్ చౌదరి భార్య భీమ్లా దేవిగా నిమ్రత్‌ కౌర్‌ తన నటనతో మెస్మరైజ్‌ చేసిందనే చెప్పవచ్చు. తన సెటైరికల్ ​ఎక్స్‌ప్రెషన్స్‌, హౌజ్‌ వైఫ్‌ నుంచి సీఎంగా మారిన తన ట్రాన్స్‌ఫార్మెషన్‌ తీరు చాలా బాగా ఆకట్టుకుంది. తన హ్యూమరస్‌ డైలాగ్‌లతో మంచి ఫన్‌ జెనరేట్‌ చేసింది. ముఖ్యమంత్రిగా, భర్తను తొక్కేసే భార్యగా, సెల్ఫీల పిచ్చి ఉన్నసెలబ్రిటీగా తన నటనతో చాలా వరకు అలరించిందనే చెప్పవచ్చు. 

ఇక జైలు సూపరింటెండెంట్‌ జ్యోతి దేశ్వాల్‌గా యామీ గౌతమ్‌ తనదైన నటనతో మెప్పించింది. పైఅధికారి హుందాతనం, అహంకారం నిండి ఉన్న పొలిటిషియన్‌ ఖైదీకి గుణపాఠం చెప్పే పోలీసు అధికారిగా ఆకట్టుకుంది. అప్పటిదాకా పూర్తి వినోదభరితంగా సాగి.. సినిమా క్లైమాక్స్‌లో మాత్రం అభిషేక్‌ బచ్చన్, యామీ గౌతమ్‌ మధ్య వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ కట్టిపడేశాయి. ఈ మూవీకి సచిన్‌, జిగర్‌లు అందించిన నేపథ్యం సంగీతం చాలా ఆకట్టుకుంది. సన్నివేశాలకు తగిన బీజీఎంతో వావ్‌ అనిపించారు. ఓవరాల్‌గా 'దస్వీ' చిత్రం చదువు ప్రాముఖ్యతను తెలియజేసే పూర్తి వినోదభరితపు పొలిటికల్‌ సెటైరికల్‌ డ్రామా. 

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top