
Aamir Khan Daughter Ira Khan About Her Acting Interest In Movies: ప్రముఖ హీరోలు, హీరోయిన్ల కుమారులు, కుమార్తెలు సినీ రంగంలోకి అడుగుపెట్టడం సాధారణ విషయమే. తమ వారసులను వెండితెరపై చూసుకోవాలనే ఆశ సూపర్ స్టార్స్కు ఉండటం సహజమే. జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ వంటి యంగ్ జనరేషన్ సెలబ్రిటీలు తమ తల్లిదండ్రుల మార్గాన్నే అనుసరించి సినీ ఫీల్డ్నే ఎంచుకున్న స్టార్స్ ఎందరో ఉన్నారు. అయితే ఇలాంటి వాళ్ల జాబితాలో ఉండనంటుంది బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండే ఐరా ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ప్రశ్నలు, సమాధానాల సెషన్ నిర్వహించింది.
ఈ సెషన్లో ఇన్స్టా యూజర్స్తో సంభాషించింది. మానసిక ఆరోగ్య సమస్యలు, ఆమె భవిష్యత్తు ప్రణాళికలు వంటి తదితర అంశాలపై స్పందించింది. ఈ క్రమంలోనే ఒక యూజర్ బాలీవుడ్లో నటిగా మారాలనే ఆలోచన ఉందా అని అడిగారు. దానికి ఐరా 'నేను సినిమాల్లోకి రావడం లేదు' అని సమాధానం ఇచ్చింది. దీంతో ఐరాకు యాక్టింగ్ పట్ల ఆసక్తి లేదని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఆమె గతంలో మీడియా అనే నాటకానికి దర్శకత్వం వహించింది. దీన్ని బట్టి చూస్తే ఐరా యాక్టింగ్ పరంగా కాకుండా డైరెక్టర్గా మారే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ పెద్ద కుమారుడు జునైద్ ఖాన్ మాత్రం ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 'మహారాజా' చిత్రంతో సినిమాల్లోకి తెరంగ్రేటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని సమాచారం. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ రూపొందిస్తోంది.