ఆ సినిమాను ఇంత లేట్‌గా చూడడం నా తప్పే! | Lagaan, The Epic Tale Of Ordinary People Who Challenged An Empire And Won Hearts Worldwide | Sakshi
Sakshi News home page

ఆ సినిమాను ఇంత లేట్‌గా చూడడం నా తప్పే!

Jun 13 2026 12:49 PM | Updated on Jun 13 2026 1:39 PM

25 Years For Lagaan: A timeless tale of unity and triumph

మూడున్నర గంటల నిడివి.. బ్రిటిష్‌ పాలన నేపథ్యంలో సాగే ఓ ఊరి కథ. యాక్షన్‌ మాస్‌ మసాలా ఐటెం సాంగుల్లాంటి హంగులేమీ లేవు. పైగా సస్పెన్స్‌ థ్రిల్లరో, హారర్‌ జానరో కూడా కాదు. ఇవన్నీ తెలిసిన తర్వాత చాలామంది “అబ్బో” అంటూ ఆ సినిమాను పక్కన పెట్టేయడం సహజమే. కానీ ఒక్కసారి చూడడం మొదలుపెట్టాక ప్రతి సన్నివేశం మనల్ని లోపలికి లాగేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కుతూహలం పెరిగిపోతుంది. మధ్యలో ఆపేయాలన్న ఆలోచనే రానీయకుండా చివరి వరకు కూర్చోబెడుతుంది. 

1893లోని చంపానేర్‌ గ్రామం, వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులు, బ్రిటిష్‌ అధికారుల అహంకారం.. ఇవన్నీ మొదటి నుంచే కథలోకి లాగేస్తాయి. ఘనన్‌ ఘనన్‌ పాట వినిపించిన క్షణం నుంచి ప్రేక్షకుడు కూడా ఆ గ్రామస్థులతో కలిసి ఆకాశం వైపు చూస్తూ వర్షం కోసం ఎదురుచూస్తాడు. రాధా కైసే నా జలే, ఓ పాలన్‌ హారే వంటి పాటలు కథను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా పాత్రల భావోద్వేగాలను మనసుకు హత్తుకునేలా చేస్తాయి.

క్రికెట్‌ చుట్టూ తిరిగే స్క్రీన్‌ప్లే.. లగాన్‌  సినిమా గొప్పతనం కేవలం క్రికెట్‌లో లేదు. కులవివక్ష, మత సామరస్యం, ఐక్యత, ఆత్మగౌరవం వంటి అంశాలను ఎంతో సహజంగా కథలో కలిపేసింది. ముఖ్యంగా దళితుడైన కచ్రాను జట్టులో చేర్చే సన్నివేశం ఇప్పటికీ గుండెను తాకుతుంది. కాలం మారినా.. సమాజంలోని కొన్ని వాస్తవాలు మాత్రం మారలేదనే ఆలోచన కలిగిస్తుంది.

క్రికెట్‌ మ్యాచ్‌కు ముందు గ్రామస్తులు ప్రాక్టీస్‌ చేసే సన్నివేశాలు నవ్విస్తాయి.. ఆలోచింపజేస్తాయి. మొదట ఒకరిపై ఒకరికి అనుమానాలు ఉన్న వాళ్లు.. చివరకు ఒక లక్ష్యం కోసం ఒక్కటిగా నిలబడటం ప్రేక్షకుడిలోనూ ఓ అనుబంధాన్ని కలిగిస్తుంది. మ్యాచ్‌ మొదలయ్యాక ప్రతి బంతి ఉత్కంఠను పెంచుతుంది. ప్రతి వికెట్‌తో గుండె వేగం పెరుగుతుంది. చివరి ఓవర్లలో ప్రేక్షకుడు కూడా చంపానేర్‌ జట్టులో భాగమైనట్టే ఫీలవుతాడు.

వర్షం కురిసే క్లైమాక్స్‌ కేవలం ఒక విజయానికి గుర్తు కాదు. అవమానాన్ని, ఆకలిని, అన్యాయాన్ని ఎదుర్కొన్న ప్రజల ఆశలకు దక్కిన ప్రతిఫలం. అందుకే లగాన్‌ దేశభక్తి సినిమా కంటే చాలా పెద్దది. అది మనుషుల గురించి, వారి కలల గురించి, కలిసి పోరాడితే అసాధ్యం కూడా సాధ్యమేనని చెప్పే కథ.

ఓ కల నుంచి ఆస్కార్‌ దాకా!
దర్శకుడు అశుతోష్‌ గోవారికర్‌ Ashutosh Gowariker మనసులో పుట్టిన ఓ విభిన్న ఆలోచనే ఈ చిత్రానికి బీజం. బ్రిటిష్‌ పాలనలో ఉన్న ఓ గ్రామం.. కరువు, పన్నుల భారం, ఆ దౌర్జన్యానికి వ్యతిరేకంగా క్రికెట్‌ మ్యాచ్‌ ద్వారా పోరాడే రైతులు.. ఈ కథను మొదట వినగానే చాలామంది నిర్మాతలు రిస్క్‌గా భావించారు. పీరియడ్‌ డ్రామా, గ్రామీణ నేపథ్యం, క్రికెట్‌, మూడున్నర గంటల నిడివి.. ఇవన్నీ కలిసి కమర్షియల్‌గా పనిచేయవని అనుకున్నారు.

అలాంటి సమయంలో హీరో అమీర్‌ ఖాన్‌ Aamir Khan కథపై నమ్మకం ఉంచారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ముందుకొచ్చి అమీర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సినిమాను నిర్మించారు. భువన్‌ పాత్రను అమీర్‌ పోషించగా, గౌరి పాత్రకు గ్రేసీ సింగ్‌ను తీసుకున్నారు. చంపానేర్‌కు సాయం చేసే బ్రిటిష్‌ యువతి ఎలిజబెత్‌ పాత్రలో రాచెల్‌ షెల్లీ నటించారు. గ్రామస్థుల పాత్రల కోసం దేశవ్యాప్తంగా ఆడిషన్లు నిర్వహించి నటులను ఎంపిక చేశారు.

రఘుబీర్ యాదవ్ (భూరా), ఆదిత్య లఖియా (కచ్రా), యశ్‌పాల్ శర్మ (లఖా), అఖిలేంద్ర మిశ్రా (అర్జున్), దయాశంకర్ పాండే (గోలి), రాజ్ జుత్షి (ఇస్మాయిల్), ప్రదీప్ రావత్ (దేవా సింగ్ సోధి), అమీన్ హాజీ (బఘా), రాజేష్ వివేక్ (గురన్) గా వీరు అందరూ కలిసి చంపానేర్ గ్రామ జట్టుకు ప్రాణం పోశారు. లగాన్‌ సమయంలో మాత్రం వీరిలో చాలామంది మధ్యస్థాయి లేదా కొత్త నటులే. అందుకే ఆ ఊరు నిజంగా మన కళ్ల ముందున్నట్టుగా అనిపించింది. ఇదే సినిమా సహజత్వానికి పెద్ద కారణంగా చెప్పొచ్చు.

చిత్రీకరణ ప్రధానంగా గుజరాత్‌లోని భుజ్‌ పరిసర ప్రాంతాల్లో జరిగింది. మండే ఎండల్లో నెలల తరబడి షూటింగ్‌ సాగింది. గ్రామం మొత్తం ప్రత్యేకంగా నిర్మించారు. సినిమాలో కనిపించే క్రికెట్‌ మ్యాచ్‌ కోసం నటులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ అందించిన పాటలు సినిమాకు ప్రాణంగా నిలిచాయి.. ఇప్పటికీ అవి చిరస్మరణీయంగా నిలిచాయి.

2001 జూన్‌ 15న విడుదలైంది లగాన్‌. మొదట్లో ఒక ప్రయోగాత్మక చిత్రంలా కనిపించినా.. కొద్ది రోజుల్లోనే ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ వసూళ్లు సాధించింది. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాల్లోనూ మంచి ఆదరణ పొందింది. బ్రిటిష్‌ పాలన, కుల వివక్ష, మత సామరస్యం, గ్రామీణ ఐక్యత వంటి అంశాలను వినోదాత్మకంగా చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ విజయంతో లగాన్‌ అంతర్జాతీయ వేదికల దృష్టిని ఆకర్షించింది. 2002లో జరిగిన 74వ అకాడమీ అవార్డ్స్‌లో (ఆస్కార్‌) ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో నామినేషన్‌ పొందింది. ఆస్కార్‌కు నామినేట్‌ అయిన మూడో భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. చివరకు అవార్డు దక్కకపోయినా.. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాకు కొత్త గుర్తింపు తీసుకొచ్చింది. ఆస్కార్‌ వేదికపై లగాన్‌ పేరు వినిపించడం అప్పట్లో దేశవ్యాప్తంగా గర్వకారణంగా మారింది.

లగాన్‌..  కేవలం క్రికెట్‌ కథ కాదు.. ఆత్మగౌరవం కోసం మట్టిమనుషులు చేసిన పోరాటం. సినిమా వచ్చి పాతికేళ్లు అవుతున్నా.. ఆ సినిమాలోని మేజిక్‌ తగ్గలేదు. మూడు గంటలకుపైగా నిడివి ఉన్నా.. నేటి రీల్‌ జనరేషన్‌ను కూడా స్క్రీన్‌కు అతుక్కుపోయేలా చేస్తోందా కథాకథనం. భారతీయ సినీ చరిత్రలో అత్యుత్తమ చిత్రాల జాబితాలో  ఈ చిత్రం ఇప్పటికీ ప్రత్యేక స్థానం ఉండటానికి అదే కారణం కూడా. అందుకే లగాన్‌ ఒక సినిమా కాదు.. తరాలు మారినా నిలిచే క్లాసిక్‌. (భాషతో అక్కర్లేదు అనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది)

:::ఓ సినీ ప్రేమికుడు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement