2018 Review: మలయాళంలో రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌.. ‘2018’ ఎలా ఉందంటే..

2018 Telugu Movie Review - Sakshi

టైటిల్‌: 2018
నటీనటులు: టొవినో థామస్‌, అసిఫ్‌ అలీ, లాల్‌, వినీత్‌ శ్రీనివాసన్‌, అపర్ణ బాల మురళి, కున్‌చకో బోబన్, అజు వర్గీస్, నరైన్, కలైయారసన్ తదితరులు
నిర్మాతలు : వేణు కున్నప్పిళ్లై, సీకే పద్మ కుమార్, ఆంటో జోసెఫ్
తెలుగులో విడుదల : 'బన్నీ' వాస్
దర్శకత్వం: జూడ్‌ ఆంథనీ జోసెఫ్‌
సంగీతం: నోబిన్‌ పాల్‌
సినిమాటోగ్రఫీ: అఖిల్ జార్జ్
విడుదల తేది: మే 26, 2023

ఆ మధ్య తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పంటలన్నీ నాశనం అయ్యాయి. రైతుల గోసలు.. ఉద్యోగస్తుల తిప్పలు.. ఇవన్నీ టీవీల్లో చూసి చలించిపోయాం. రెండు, మూడు రోజుల పాటు కురిసి వానకే ఇంత నష్టం వాటిల్లితే.. మరి ఎడతెరపి లేకుండా కొన్ని వారాల పాటు వర్షం పడితే? వరదలు వస్తే? ఆ వరదల్లో కట్టుకున్న ఇళ్లతో పాటు అన్ని కొట్టుకొనిపోతే?.. ఇలాంటి ప్రకృతి విపత్తులు నిత్యం ఎక్కడో ఒక్కచోట జరుగుతూనే ఉంటాయి. టీవీల్లో వాటికి సంబంధించి వార్తలు చూసి కాసేపటికే చానెల్‌ మార్చేస్తాం.

కానీ అలాంటి ప్రకృతి విపత్తే మన దగ్గర సంభవిస్తే? నిండు గర్భిణీ అయిన మీ భార్య వరదల్లో చిక్కుకొని పోతే? అంగవైకల్యంతో బాధపడుతున్న నీ కొడుకు ఉన్న ఇంట్లోకి వరద నీరు వచ్చి చేరితే? కష్టపడి డిగ్రీ చదివిన నీ కూతురు సర్టిఫికేట్స్‌ వరద నీటీలో తడిసిపోతే? ఇష్టపడి కట్టుకున్న ఇల్లు నీ కళ్లముందే కూలిపోతే? తాగడానికి గుప్పెడు మంచి నీళ్లు కూడా లభించపోతే?.. ఇవన్నీ కేరళ ప్రజలు చూశారు. చరిత్రలో ఇంతవరకు చూడని వరదలను 2018లో అక్కడి ప్రజలు చూశారు. ఒకరిఒకరు సహాయం చేసుకొని ప్రకృతి ప్రళయాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆ సంఘటలనే కథగా మలిచి ‘2018’ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు జూడ్‌ ఆంథనీ జోసెఫ్‌. మే 5 కేరళలో విడుదలైన ఈ చిత్రం అక్కడ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టింది. ఇప్పటికే రూ. 130 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు క్రియేట్‌ చేసింది. అదే చిత్రాన్ని తెలుగులో 'బన్నీ' వాసు ఈ శుక్రవారం (మే 26) రిలీజ్‌ చేస్తున్నారు. మరి ఈ చిత్రం కథేంటి? ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. 

‘2018’ కథేంటంటే.. 
కేరళలోని అరువిక్కుళం అనే గ్రామానికి చెందిన అనూప్ (టోవినో థామస్) ఎంతో ఇష్టపడి ఇండియన్‌ ఆర్మీలో జాయిన్‌ అవుతాడు. అయితే అక్కడి కష్టాలు చూసి భయపడి ఉద్యోగం మానేసి ఊరిగి తిరిగొస్తాడు. అతన్ని చూసి జనాలంతా నవ్వుకుంటారు. ఇక మనోడు మాత్రం అవేవి పట్టించుకోకుండా దుబాయ్‌ వెళ్లేందుకు వీసా కోసం ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి వచ్చిన స్కూల్‌ టీచర్‌ మంజు(తన్విరామ్‌)తో ప్రేమలో పడతాడు. 

మరోవైపు నిక్సన్‌(అసిఫ్‌ అలీ) మోడల్‌ కావాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. అతని తండ్రి(లాల్‌), అన్నయ్య(నరైన్‌) సముద్రంలో చేపలు పడుతూ జీవిస్తుంటారు. వారిది సముద్ర తర ప్రాంతం కావడంతో వర్షం పడినప్పుడల్లా ఇంటిని వదిలి క్యాంపుల్లోకి వెళ్తుంటారు. 

ఇక కోషీ(అజు వర్గీస్‌) ఓ టాక్సీ డ్రైవర్‌. కేరళ పర్యటనకు వచ్చిన విదేశీయులను తన క్యాబ్‌లో అన్ని ప్రాంతాలు తిప్పి చూపిస్తుంటాడు. సేతుపతి(కలైయారసన్‌) లారీ డ్రైవర్‌. డబ్బు కోసం బాంబులను అక్రమంగా సరఫరా చేయడానికి వెళ్తుంటాడు. ఇలా  ఒక్కొక్కరిది అక్కడ ఒక్కో జీవితం. వీరందరి జీవితాలను 2018 వరదలు ఎలా తారుమారు చేసింది? ప్రకృతి కన్నెర్ర చేస్తే.. అక్కడి ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకొని ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డారు? వరదల సమయంలో కేరళ ప్రజలు పడిన కష్టాలు ఏంటి? వేలాది మంది ప్రజలు అనుభవించిన బాధలు ఏంటి? అనేది కళ్లకు కట్టినట్లు చూపించిన సినిమానే  ‘2018’.

ఎలా ఉందంటే.. 
2018 ఆగస్టులో కేరళలో అధిక వరదలు సంభవించిన విషయం తెలిసిందే. కేరళ చరిత్రలో ఇవే అతి పెద్ద వరదలు అని చెప్పొచ్చు.  దీనిని బేస్ చేసుకుని ‘జూడ్ ఆంథనీ జోసెఫ్’ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. అందుకే ఈ చిత్రానికి అక్కడి ప్రజలు బాగా కనెక్ట్‌ అయ్యారు. ఇది అక్కడ జరిగిన సంఘటన కాబట్టి అందరికి కనెక్ట్‌ అయింది. మరి తెలుగు ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుంది? తెలుగు ప్రజలే కాదు మనుషులంతా ఈ కథను కనెక్ట్‌ అవుతారు.  అయ్యో పాపం.. ఎవరైనా సహాయం చేస్తే బాగుండేదే? అక్కడ నేనున్నా వెళ్లి వారిని కాపాడేవాడిని అనిపించేలా కొన్ని వరద సన్నివేషాలను తీర్చిదిద్దారు. సినిమా చూస్తున్నంత సేపు వరదల్లో మనవాళ్లు చిక్కుకున్నట్లుగా.. వారికి సహాయం చేసినప్పుడు హమ్మయ్యా.. వాళ్లు సేవ్‌ అయ్యారు’ అనే పీలింగ్‌ కలుగుతుంది.

కథ మన ఊహకు అందినట్లుగా సాగితే బోరు కొడుతుంది. కానీ మనం కోరుకునేది తెరపై జరిగితే సంతోషం కలుగుతుంది. ఈ సినిమాలో మనం కోరుకునేవి చాలా జరుగుతాయి. కొన్ని సన్నివేశాలు హృదయాలను హత్తుకుంటాయి. ముఖ్యంగా వికలాంగుడైన కొడుకుని కాపాడుకోవడం కోసం ఓ జంట పడే కష్టం.. గర్భవతిని హెలిక్యాప్టర్‌లో ఎక్కించే సీన్‌... సర్టిఫికెట్స్ కోసం ఇంట్లోకి నిక్సన్ వెళ్లే సీన్.. అక్కడ పాము కనిపిస్తే.. నిక్సన్‌ చేసిన పని.. ఇలా చాలా సన్నివేశాలు మన మనసుల్ని హత్తుకుంటాయి. కొన్ని సన్నివేశాలు భయపెడతాయి. మరికొన్ని సనివేశాలు కన్నీళ్లను తెప్పిస్తాయి. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడడకోసం మేమున్నామంటూ మత్స్యకారులు ముందుకొస్తే.. ‘ఇది కదా మానవత్వం’ అనిపిస్తుంది. మొత్తంగా 2018 సినిమా ఆడియన్స్‌ని టెన్షన్‌ పెడుతుంది. భయపెడుతుంది. బాధపెడుతుంది. చివరకు కులమతాల కంటే మానవత్వం గొప్పదని తెలియజేస్తుంది. 

ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాలో ఎవరూ నటించలేదు. తమ పాత్రల్లో జీవించేశారు.ప్రతి ఒక్కరు తమ పాత్రకు నూటికి నూరుశాతం న్యాయం చేశారు. ఇక సాంకేతిక విషయాకొస్తే.. నోబిన్‌ పాల్‌ నేపథ్య సంగీతం సినిమా స్థాయి పెంచేసింది. అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతి సీన్‌ని చాలా సహజంగా, అద్భుతంగా చిత్రీకరించాడు.  చమన్ చాకో ఎడిటింగ్, వీఎఫ్‌ఎక్స్‌, నిర్మాణ విలువలు అన్ని అద్భుతంగా ఉన్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(3.5/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top