12th Fail Movie Review: 12th ఫెయిల్‌ మూవీ రివ్యూ | 12th Fail 2023 Movie Review And Rating In Telugu | Vikrant Massey | Medha Shankar - Sakshi
Sakshi News home page

12th Fail Telugu Movie Review: 12th ఫెయిల్‌ మూవీ రివ్యూ

Published Fri, Nov 3 2023 4:26 PM

12th Fail Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: 12th ఫెయిల్‌
నటీనటులు:  విక్రాంత్ మాస్సే , మేధా శంకర్ , అన్షుమాన్ పుష్కర్ , అనంత్ జోషి , హరీష్ ఖన్నా , ప్రియాంషు ఛటర్జీ తదితరులు
నిర్మాత: విధు వినోద్ చోప్రా
దర్శకత్వం: విధు వినోద్ చోప్రా
సంగీతం: శంతను మొయిత్రా
సినిమాటోగ్రఫీ: రంగరాజన్‌ రామబద్రం 
విడుదల తేది: నవంబర్‌ 3, 2023

ఒక భాషలో సినిమా హిట్‌ అయిందంటే చాలు దాన్ని పలు భాషల్లో డబ్‌ చేసి రిలీజ్‌ చేస్తుంటారు. అలా బాలీవుడ్‌ నుంచి తెలుగులోకి డబ్‌ అయిన చిత్రమే 12th ఫెయిల్‌. అక్టోబర్‌ 27న హిందీలో రిలీజైన ఈ చిత్రం.. అక్కడ భారీ విజయం సాధించింది. దీంతో అదే టైటిల్‌తో నవంబర్‌ 3 తెలుగులో విడుదల చేశారు. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.  మరి మూవీ కథేంటి? ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే..
ఈ సినిమా కథ 1997లో ప్రారంభం అవుతుంది. బందిపోట్లకు నిలయమైన చంబల్‌ ప్రాంతానికి చెందిన మనోజ్‌ కుమార్‌ శర్మ(విక్రాంత్‌ మెస్సీ) ఇంటర్‌ చదవుతుంటాడు. 12వ తరగతి పాస్‌ అయితే చిన్న ఉద్యోగం వస్తుందని అతని ఆశ. అందరిలాగే తాను కూడా చిట్టిలు కొట్టి పరీక్షలు పాస్‌ అవ్వాలనుకుంటాడు. అయితే అక్కడకు కొత్తగా వచ్చిన డీఎస్పీ దుష్యంత్‌ సింగ్‌(ప్రియాన్షు ఛటర్జీ).. విద్యార్థులు కాపీ కొట్టడాన్ని అరికడతాడు. దీంతో ఆ ఏడాది మనోజ్‌ 12వ తరగతిలో ఫెయిల్‌ అవుతాడు.మరోవైపు ఇంట్లో పూట గడవడానికి కూడా కష్టంగానే ఉంటుంది. అన్నయ్యతో కలిసి ఆటో తోలుతూ ఉంటాడు. ఓసారి ఎమ్మెల్యే మనుషుతో గొడవపడిన కారణంగా తన అన్నయ్యను జైలులో పెడతారు పోలీసులు. ఆయన్ని బయటకు రావడానికి డీఎస్పీ దుష్యంత్‌ సహాయం చేస్తాడు.

దుష్యంత్‌ సిన్సియారిటీ చూసి..తాను కూడా అలాంటి పోలీసాఫీసర్‌ అవ్వాలనుకుంటాడు మనోజ్‌. దుష్యంత్‌ను ఇన్‌స్పైరింగ్‌గా తీసుకొని  కాపీ కొట్టకుండా 12th పాస్‌ అవుతాడు. డిగ్రీ పూర్తి చేసి.. డీఎస్పీ కావాలని, కోచింగ్‌ కోసం నానమ్మ ఇచ్చిన పెన్షన్‌ డబ్బులతో పట్నం వెళ్తాడు. బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో అతని డబ్బులను కొట్టేసారు. మరోవైపు సిటీకి చేరుకున్నాక.. మూడేళ్లదాక నోటీఫికేషన్‌ లేదని ప్రభుత్వం ప్రకటిస్తుంది.

దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న మనోజ్‌కు.. ప్రీతమ్‌ పాండే(ఆనంత్‌ విజోషి) పరిచయం అవుతాడు. ఆయన సపోర్ట్‌తో ఢిల్లీకి వెళ్లి సివిల్స్‌కి ప్రిపేర్‌ అవుతాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితుల్లో మనోజ్‌ సివిల్స్‌ పరీక్షలను ఎలా ఎదుర్కొన్నాడు?  ఢిల్లీలో పరిచయం అయిన గౌరీ అన్న(ఆయుష్మాన్‌ పుస్కర్‌), శ్రద్ధా(మేధా శంకర్‌)  ఎలాంటి సపోర్ట్‌ని అందించారు?  చివరకు ఐపీఎస్‌ లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా? అనేదే ఈ సినిమా కథ. 

ఎలా ఉందంటే..
ముంబై క్యాడర్‌(2005)కు చెందిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ శర్మ రియల్ లైఫ్ నుంచి ఇన్‌స్పైర్ రాసిన కథ ఇది. ఓ చిన్న పల్లెటూరికి చెందిన మనోజ్‌.. ఎలాంటి సపోర్ట్‌ లేకుండా సీవిల్స్‌కి ఎంపికై అందరికి ఆదర్శంగా నిలిచాడు. అయితే ఆయన సీవిల్స్‌కి ప్రిపేర్‌ అయిన సమయంలో పడిన కష్టాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. భారతీయ విద్యావ్యవస్థలోని తీరుతెన్నులను స్పృశిస్తూనే..  ఐపీఎస్, ఐఏఎస్ లాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అయ్యే పేద విద్యార్థుల బాధలు, కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అయ్యేవాళ్లకు స్ఫూర్తినిచ్చే చిత్రమిది. జీవితంలో ఫెయిల్యూర్స్‌, కష్టాలు రావడం సహజమని.. వాటిని ఎదుర్కొని నిలబడితే విజయం మన సొంతం అవుతుందని చాటి చెప్పే ఇన్‌స్పైరింగ్‌ మూవీ.

చంబల్‌ ప్రాంతంలోని అప్పటి పరిస్థితులు, అక్కడి విద్యా వ్యవస్థను చూపిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. నిజాయితీ కారణంగా తండ్రి ఉద్యోగం నుంచి సస్పెండ్‌ అవ్వడం.. ఆ తర్వాత హీరో ఫ్యామిలీ పడే కష్టాలకు సంబంధించిన సన్నీవేశాలు ఎమోషనల్‌కు గురి చేస్తాయి. సినిమా అంతా సీరియస్‌ మూడ్‌లో సాగిస్తూనే.. చిన్న చిన్న ఫన్‌ ఎలిమెంట్స్‌ని ఎలివేట్‌ చేసిన తీరు ఆకట్టుకుంటుంది.

మనోజ్‌ కోచింగ్‌ కోసం పట్నం వెళ్లిన తర్వాత కథ ఎమోషనల్‌వైపు టర్న్‌ తీసుకుంటుంది. డబ్బులు లేక ఆయన పడే కష్టాలు.. హోటల్‌కి వెళ్లి అన్నం అడిగిన తీరు.. మనసుని కదిలిస్తాయి. ఢిల్లీలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ పరీక్షల కోచింగ్‌ కోసం పేద విద్యార్థులు పడే కష్టాలను తెరపై వాస్తవికంగా చూపించారు. 

సెకండాఫ్‌లో కథ మరింత ఎమోషనల్‌గా సాగుతుంది. కోచింగ్‌కి డబ్బుల్లేక మనోజ్‌ బాత్‌రూమ్స్‌ కడగడం.. పిండిమర ఇంట్లో ఉంటూ.. రోజుకు 15 గంటలు పని చేస్తూ చదవుకోవడం... పరీక్షలో ఫెయిల్‌ అయిన ప్రతిసారి మనోధైర్యంతో ‘రిపీట్‌’ అంటూ మళ్లీ చదవడం ప్రారంభించడం..ఈ సన్నివేశాలన్నీ హృదయాలను హత్తుకుంటాయి. విధూ వినోద్ తనదైన స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్‌  చేస్తూ.. ప్రేక్షకుడిని కథలో లీనమయ్యేలా చేశాడు.

ఎవరెలా చేశారంటే..

మనోజ్‌ కుమార్‌ శర్మ పాత్రలో విక్రాంత్‌ మెస్సీ  ఒదిగిపోయాడు. తెరపై మనకు మనోజ్‌ కుమార్‌ పాత్రే కనిపిస్తుంది తప్ప..ఎక్కగా విక్రాంత్‌ కనిపించడు. అంతలా తనదైన నటనతో ఆ పాత్రకు ప్రాణం పోశాడు. కొన్నిచోట్ల నవ్విస్తూనే.. మనల్ని ఏడిపించేస్తాడు.  మనోజ్‌ స్నేహితుడు పాండేగా  ఆనంత్‌ వీ జోషి నటన చాలా బాగుంది. కథంతా అతని పాత్రనే నెరేట్‌ చేస్తుంది. గౌరీ పాత్రలో ఆయుష్మాన్‌ పుస్కర్ నటన ఆకట్టుకుంటుంది. మనోజ్‌ ప్రియురాలు  శ్రద్దాగా మేధా శంకర్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. ఇక సుందర్‌గా విజయ్ కుమార్, డీఎస్పీగా ప్రియాంశు చటర్జీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. శాంతను మోయిత్రా సంగీతం సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చింది. కెమెరామెన్‌ పనితనం బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ నీట్‌గా వాస్తవాన్ని ఆవిష్కరించేలా సహజసిద్ధంగా ఉన్నాయి. ఎడిటింగ్‌ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 

చరిత్రలో ఎన్నో సినిమాలు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను స్పృశిస్తూ గొప్ప చిత్రాలుగా నిలుస్తాయి. అలాంటి చిత్రాల్లో 12th ఫెయిల్‌  ఒకటని చెప్పొచ్చు.  విద్యార్థులకు ఇదొక ఇన్‌స్పైరింగ్‌ మూవీ. 
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:
Advertisement
 
Advertisement
 
Advertisement