Night Terrors: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఆ సంఘనటతో హనీమూన్‌ క్యాన్సిల్‌

Difference Between Nightmares And Night Terrors Causes And Treatment - Sakshi

చాలామంది నిద్రలో గట్టిగా అరవడం, కేకలు వేయడం చేస్తుంటారు. ఏదో కలలో అలా చేసి ఉండొచ్చు అని అనుకోవద్దు. ఎందుకంటే ఇదంత చిన్న విషయమేమీ కాదు. నిద్రల్లో లేచి బిగ్గరగా ఏడవడం, భయంతో వణికిపోవడం వంటివి తరచూ చేస్తూ అది నిజంగా జబ్బే. ఈ పరిస్థితిని నైట్‌ టెర్రర్‌ లేదా స్లీప్‌ టెర్రర్‌ అని అంటారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? పెద్దవారిలోనూ ఈ సమస్య వస్తుందా? అన్నది ఇప్పుడు చూద్దాం.
 

మాధురి, మాధవ్‌ అందమైన జంట. ఒకే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హనీమూన్‌ కోసం కేరళ వెళ్లినప్పుడు నిద్రలో మాధురి గట్టిగా అరుస్తోంది. మాధవ్‌ లేచి చూసేసరికి భయపడి వణికిపోతోంది. ఆమెను పట్టుకుని కుదిపాడు. అయినా మాధురి నార్మల్‌ స్టేజ్‌కు రాలేదు. ఆమె అరుపులకు హోటల్‌ స్టాఫ్‌ కూడా వచ్చారు. పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. హనీమూన్‌ కేన్సిల్‌ చేసుకుని వచ్చేశారు. 

ఆ రాత్రి ఎందుకలా అరిచావని మాధురిని అడిగితే... ఏదో పీడకల వచ్చిందని చెప్పింది. కానీ ఆ తర్వాత కూడా అప్పుడప్పుడూ అలాగే జరుగుతోంది. కారణమేంటని అడిగితే, చిన్నప్పటినుంచి తాను అప్పుడప్పుడూ అలా అరుస్తానని, కారణం తనకూ తెలియదని చెప్పింది. జీవితాంతం దీన్ని భరించాల్సిందేనా అని ఆందోళన చెందాడు. గూగుల్‌ చేసి అదో స్లీప్‌ డిజార్డర్‌ అని అర్థం చేసుకుని కౌన్సెలింగ్‌ కు తీసుకువచ్చాడు. 

స్లీప్‌ టెర్రర్స్‌...
మాధురి సమస్యను స్లీప్‌ టెర్రర్స్‌ లేదా నైట్‌ టెర్రర్స్‌ అంటారు. నిద్రలో జరిగే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలను పారాసోమ్నియాగా పరిగణిస్తారు. నిద్రలో ఉన్నప్పుడు అరుపులు, తీవ్రమైన భయం దీని ప్రాథమిక లక్షణాలు. ఇది సాధారణంగా సెకన్ల నుంచి కొన్ని నిమిషాల వరకు ఉంటుంది, కొన్నిసార్లు ఎక్కువసేపు ఉండవచ్చు. ఇది 40 శాతం మంది పిల్లల్లో కనిపిస్తుంది, సాధారణంగా యుక్తవయసులో దాన్ని అధిగమిస్తారు. కానీ తక్కువశాతం పెద్దల్లో కూడా స్లీప్‌ టెర్రర్స్‌ కనిపిస్తుంటాయి. అందులో మాధురి కూడా ఒకరు. స్లీప్‌ టెర్రర్స్, పీడకలలు ఒకటి కాదు. 

స్లీప్‌ టెర్రర్‌ లక్షణాలు
యుక్త వయసు తర్వాత కూడా స్లీప్‌ టెర్రర్స్‌ వస్తున్నా, దీనివల్ల పగలు అధికంగా నిద్ర వచ్చి వర్క్‌ ప్లేస్‌లో సమస్యలు ఎదురవుతున్నా వెంటనే సైకాలజిస్ట్‌ను కలవాల్సిన అవసరం ఉంది. శారీరక, మానసిక పరీక్షల అనంతరం మీ సమస్యను నిర్ధారిస్తారు. అవసరమైతే పాలిసోమ్నోగ్రఫీకి (నిద్ర అధ్యయనం) సిఫారసు చేస్తారు.

లక్షణాలు ఇలా ఉంటాయి ... 
· నిద్రలో భయపెట్టే అరుపులు
· కళ్లు పెద్దవి చేసి చూడటం
· మంచం మీద కూర్చొని భయంగా కనిపించడం
· గట్టిగా ఊపిరి పీల్చుకోవడం, మొహం ఎర్రగా మారడం
· మేల్కొలపడానికి ప్రయత్నిస్తే తన్నడం, కొట్టడం
· మర్నాడు ఉదయం దాని గురించి జ్ఞాపకం లేకపోవడం

పిల్లల్లో, మహిళల్లో ఎక్కువ...
స్లీప్‌ టెర్రర్స్‌ అనేవి నిద్రలో సంభవిస్తాయి. కుటుంబ సభ్యులకు స్లీప్‌ టెర్రర్స్‌ లేదా స్లీప్‌ వాకింగ్‌ చరిత్ర ఉంటే స్లీప్‌ టెర్రర్స్‌ సర్వసాధారణం. పిల్లల్లో, ఆడవారిలో ఎక్కువగా ఉంటుంది.
· నిద్ర లేమి, విపరీతమైన అలసట
· మానసిక ఒత్తిడి
· నిద్ర షెడ్యూల్‌కు అంతరాయాలు లేదా నిద్రలో అంతరాయాలు
· తరచూ ప్రయాణాలు
· జ్వరం
· నిద్రలో ఉన్నప్పుడు శ్వాస సంబంధమైన సమస్యలు
· రెస్ట్‌లెస్‌ లెగ్స్‌ సిండ్రోమ్, డిప్రెషన్, యాంగ్జయిటీ లాంటి మానసిక రుగ్మతలు,
· మద్యం వినియోగం

ప్రశాంతత ముఖ్యం...
మీకు లేదా మీ పిల్లలకు స్లీప్‌ టెర్రర్స్‌ ఉంటే దాన్నుంచి తప్పించుకోవడానికి కొన్ని వ్యూహాలు ఉన్నాయి. 
· మీకు నిద్ర లేమి ఉంటే, ముందుగా నిద్రపోయే సమయాన్ని షెడ్యూల్‌ చేసుకోండి. నిద్రకు ఆటంకం కలిగించే మొబైల్‌ ఫోన్, అలారం లాంటి వాటిని దూరంగా పెట్టండి. 
· అలసట, ఆందోళన స్లీప్‌ టెర్రర్స్‌కు దోహదం చేస్తాయి. అందువల్ల నిద్రవేళకు ముందు ప్రశాతంగా ఉండేలా చూసుకోండి.
· స్లీప్‌ టెర్రర్స్‌ వల్ల గాయపడే అవకాశం కూడా ఉంది కాబట్టి మీ బెడ్‌ రూమ్‌ను సురక్షితంగా మార్చండి. తలుపులు మూసివేయండి. పదునుగా ఉండే వస్తువులను అందుబాటులో ఉంచుకోవద్దు. 
· నిద్రపోయే ముందు పుస్తకాలు చదవడం, పజిల్స్‌ చేయడం లేదా వెచ్చని నీళ్లతో స్నానం చేయడం లాంటివి మంచి నిద్రకు సహాయపడతాయి. ధ్యానం లేదా రిలాక్సేషన్‌ ఎక్సర్‌సైజ్‌ కూడా సహాయపడవచ్చు. 
· మీ పిల్లలకు స్లీప్‌ టెర్రర్‌ ఉంటే, వాళ్లు నిద్రపోయాక ఎంత సమయానికి ఆ ఎపిసోడ్‌ వస్తుందో గమనించండి. దానికి పది నిమిషాల ముందు నిద్రలేపితే సరి. 
· మీ పిల్లలకు స్లీప్‌ టెర్రర్‌ ఎపిసోడ్‌ వస్తే, కదిలించడం లేదా అరవడం వల్ల పరిస్థితి మరింత దిగజారవచ్చు. అందుకే బిడ్డను కౌగిలించుకుని శాంతింపచేయండి. ప్రశాతంగా మాట్లాడండి. దానంతట అందే ఆగిపోతుంది. 
· ఈ పనులన్నీ చేసినా ఫలితం లేకపోతే సైకాలజిస్ట్‌లను కలవడం తప్పనిసరి. భద్రతను ప్రోత్సహించడం, ట్రిగ్గర్లను తొలగించడంపై వారు దృష్టి పెడతారు. 
· కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ, హిప్నాసిస్, బయోఫీడ్‌బ్యాక్‌ లేదా రిలాక్సేషన్‌ థెరపీ ద్వారా మీకు సహాయపడతారు. 

-సైకాలజిస్ట్‌ విశేష్‌,
psy.vishesh@gmail.com 

Read latest Mental illness News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top