కొల్చారం(నర్సాపూర్): బంజారా గిరిజనుల సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం పట్టే జాతీయస్థాయి గోర్ మేళా మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని కుడిచెరువు తండాలో మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ గోర్మేళాలో తొలిరోజు ప్రత్యేక పూజలు, సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహిస్తారు. బంజారా సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు, పురుషులు సంప్రదాయ వస్తువులతో మండల కేంద్రంలో ఊరేగింపుగా పాల్గొని సందడి చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో బంజారా మహిళలు సంప్రదాయ నృత్యాలతో అలరించారు. బంజారా సంస్కృతి,జీవన విధానం, పూర్వీకుల సంప్రదాయాలను ప్రతిబింబించే వస్తువులతో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బంజారా సమాజానికి ప్రత్యేక గుర్తింపునిచ్చే భాష,సంస్కృతి,ఆచారాలు, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి హాజరయ్యారు. గోర్మేళా ద్వారా బంజారా సమాజ ఐక్యత, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పారు. మొదటిరోజు జరిగిన ఈ మేళాకు వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 9 వేల మంది బంజారాలు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మండల బంజారా నాయకులు సీతారాం తండా, సర్పంచులు రమావత్ కమిలి,బంజారా నాయకులు మంగ్లీ నాయక్,సంగాయిపేట రాజు నాయక్,మోహన్ నాయక్,శ్రీనివాస్ నాయక్,లాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
బంజారా సంస్కృతీ, సంప్రదాయాలకు నిలువుటద్దం
వరిగుంతం కుడి చెరువు తండాలో బంజారాల సందడి
సంప్రదాయ నృత్యాలు,వస్తువుల స్టాళ్లు


