కౌడిపల్లి(నర్సాపూర్): కౌడిపల్లి మండలం దేవులపల్లి అడవిలో నరసింహస్వామి గుట్టపై పుట్టలోవెలిసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి మహాపుణ్యక్షేత్రంగా వెలుగొందాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆకాక్షించారు. మంగళవారం గుట్టపై పుట్టలో స్వయంభూగా వెలిసిన స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్లాడుతూ...గత నలభై ఏళ్లుగా గ్రామస్తులు లక్ష్మీనరసింహస్వామి గుట్టపై విగ్రహం లేనప్పటికీ రాతి గుండుకు, జువ్విచెట్టుకింద ఉన్న కోమటమ్మదేవికి గ్రామస్తులు పూజలు చేస్తున్నారన్నారు. గ్రామానికి చెందిన జింక శ్రీశైలం అనే భక్తుడికి ‘‘ఇటీవల నేను ఉన్నది ఒకచోట పూజలు చేస్తుంది మరోచోట’’అని కలలో చెప్పడంతో పుట్టను తవ్వగా స్వామి విగ్రహం బయట పడిందన్నారు. శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆశీర్వాదంతో ఇక్కడ మహాపుణ్యక్షేత్రంగా వెలుగొందాలని చెప్పారు. రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతీస్వామి గుట్టపై విగ్రహాన్ని పరిశీలించిన అనంతరం ఆలయ నిర్మాణం ఇతర కార్యక్రమాల గురించి వివరిస్తారని అప్పటివరకు నిత్యపూజలు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు తిరుపతిరెడ్డి, శివలీల, ఉపసర్పంచ్ శ్రీకాంత్, మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు సార రామాగౌడ్, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సునీతారెడ్డి


