వద్దంటున్నా.. వరి వైపే | - | Sakshi
Sakshi News home page

వద్దంటున్నా.. వరి వైపే

Nov 8 2026 10:12 AM | Updated on Nov 8 2026 10:12 AM

నారుమళ్లకు కసరత్తు చేస్తున్న రైతులు

ఇప్పటికే యాసంగి ప్రణాళికను

ప్రకటించిన అధికారులు

ఈ నెల 11 నుంచి అవగాహన

ఎల్‌నినో హెచ్చరికలు బేఖాతర్‌

మెతుకుసీమలో చెప్పుకోదగ్గ సాగునీటి ప్రాజెక్టులు లేవు. ఏకై క మధ్య తరహా సాగు నీటి ప్రాజెక్టు ఘనపూర్‌ ఉన్నప్పటికీ అది పూర్తిగా సింగూరుపై ఆధారపడి ఉంది. ఈసారి మరమ్మతుల నేపథ్యంలో ఖరీఫ్‌ సీజన్‌కు ఘనపురం ప్రాజెక్టుకు నీరు విడుదల చేయలేదు. అలాగే ఎల్‌నినో ప్రభావంతో సరైన వర్షాలు కరువకపోవడంతో నీటి వనరులన్నీ నిండుకున్నాయి. మంజీరా, హల్దీ ప్రాజెక్టుల పరిస్థితి అంతే. భూగర్భజలాలు సైతం వేగంగా పడిపోతున్నాయి. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. రైతులు వరిసాగు చేయొద్దని సూచించింది. అయినా రైతులు హెచ్చరికలను పట్టించుకోవడం లేదు. నాలుగెకరాలకు సాగునీరందించే బోరు వద్ద రెండెకరాల వరి పండిస్తామంటున్నారు. ఎల్‌నినోతో కరెంట్‌ సక్రమంగా రాదని, ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు ప్రచారం చేస్తున్నారు. అయినా రైతులు వినకుండా వరిసాగుకే మొగ్గు చూపుతుండటంతో క్షేత్రస్థాయిలో గందరగోళం నెలకొంది.

55 వేల ఎకరాల్లో ఆరుతడి

ఈ ఏడాది యాసంగిలో ఎన్ని ఎకరాలు సాగు చేయాలి, ఏ రకమైన పంటలు వేయాలని ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. అందులో ఆరుతడి పంటలు 55,820 ఎకరాల్లో మాత్రమే సాగు చేయాలని నిర్ణయించారు. వరిసాగు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వద్దని, దాని స్థానంలో జొన్నలు 22,294 ఎకరాలు, మొక్కజొన్న 12,853, ఉద్యానశాఖ పరిధిలోని ఆయిల్‌పాంతో పాటు పండ్ల తోటలు, కూరగాయలు 12,625 ఎకరాలు, మినుములు, పెసర్లు, కందులు, పొద్దు తిరుగుడు తదితర పంటలు 8,048 ఎకరాల్లో సాగు చేయాలని అధికారులు లెక్కలు కట్టారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఇప్పటికే 40 వేల ఎకరాలకు సరిపడా రైతులు తుకాలు పోసినట్లు సమాచారం.

ఊరూరా గ్రామ సభలు

ఎల్‌నినో నేపథ్యంలో ఎలాంటి పంటలు సాగు చేయాలి, విద్యుత్‌ సరఫరా ఏ మేరకు ఉంటుంది, వరి సాగు చేస్తే జరిగే నష్టం, ఆరుతడి పంటలు సాగు చేస్తే ఏ మేరకు లాభాలు వస్తాయనే అంశాలపై అధికారులు ఈ నెల 11 నుంచి ఊరూరా గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించనున్నట్లు సంబంధిత ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అయితే ఇప్పటికే ఆలస్యం అయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గతేడాదితో పోలిస్తే 17.25 శాతమే

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కేవలం 17.25 శాతం మాత్రమే పంటలు సాగవుతున్నాయి. గతేడాది రబీ సీజన్‌లో 3,23,621 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు. అందులో వరి 3,05,723 ఎకరాలు, మిగతా 17,898 ఎకరాల్లో ఆరుతడి పంటలు వేశారు. ఈఏడాది యాసంగిలో వరి సాగు లేకుండా ఆరుతడి పంటలు మాత్రమే 55,820 ఎకరాల్లో సాగు చేయాలంటూ వ్యవసాయశాఖ అధికారులు సాగు ప్రణాళికను సిద్ధం చేశారు. కాగా గతేడాదితో పోలిస్తే కేవలం 17.25 శాతం మాత్రమే రబీ సాగు కానుంది.

ఎల్‌నినో నేపథ్యంలో యాసంగిలో వరిసాగు వద్దని ఇప్పటికే ప్రభుత్వం సూచించింది. సాగునీరు అందుబాటులో ఉన్న రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు వేయాలని చెప్పింది. అయినా రైతులు అవేమి పట్టించుకోవడం లేదు. ఎంత చెప్పినా.. వరిసాగుకే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో చాలా మంది నారుమళ్లు పోసుకొని సాగుకు సన్నద్ధం అవుతున్నారు.

– మెదక్‌జోన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement