హవేళిఘణాపూర్(మెదక్): రుణాల మంజూరులో బ్యాంకులు మహిళలకు ప్రాధాన్యతనిస్తున్నాయని, అదే నమ్మకంతో రుణాలు తిరిగి చెల్లించి ఉపాధి అవకాశాలు పొందాలని ఆర్బీఐ జీఎం జ్ఞాన సుప్రభాత్ అన్నారు. శనివారం హవేళిఘణాపూర్ రైతు వేదికలో మండలంలోని ఆయా గ్రామాల డ్వాక్రా గ్రూపు మహిళలు, రైతులతో బ్యాంకు సేవలపై అవగాహన కల్పించారు. బ్యాంకులు రుణాల మంజూరును వ్యక్తిగత అవసరాలకు కాకుండా ఉపాధికి ఖర్చు చేస్తే భవిష్యత్ బాగుంటుందన్నారు. ముఖ్యంగా ప్రజలు తమ ఖాతాను ఎప్పటికప్పుడు ఈకేవైసీ చేసుకొని ప్రభుత్వ పథకాలను పొందాలని సూచించారు. కార్యక్రమంలో నాబార్డు డీజీఎం కృష్ణతేజ, ఎల్డీఎం బాపూజీ, డీఆర్డీఏ ఏపీడీ బాలరాజు, సర్పంచ్ సాయిలు, గోపాల్‌నాయక్, వివిధ బ్యాంక్ మేనేజర్లు పాల్గొన్నారు.


