అదనపు కలెక్టర్ నగేశ్
పాపన్నపేట(మెదక్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని కుర్తివాడలో ఇళ్లను పరిశీలించి మాట్లాడారు. గ్రామాల్లో గుడిసెలు ఉండొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందన్నారు. నిర్మాణాలు త్వరగా పూర్తి చేస్తే, బిల్లులు కూడా సకాలంలో వస్తాయన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కరాటేలో ప్రతిభ కనబర్చిన కుర్తివాడ విద్యార్థినులను అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్‌లోనూ నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. అలాగే క్రీడలను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. కరాటేలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బెల్టులు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ సతీశ్, హెచ్‌ఎం లోక్యా నాయక్, టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కరువు ప్రాంతంగా ప్రకటించాలి
పెద్దశంకరంపేట(మెదక్): పెద్దశంకరంపేట మ ండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని సంగారెడ్డి జిల్లా ఓబీసీ అధ్యక్షుడు కోణం విఠల్ అన్నారు. శనివారం స్థానిక బీజేపీ కార్యాలయంలో మండల స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో పంటలు సక్రమంగా పండక రైతులు నష్టపోయారని తెలిపారు. రైతు భరోసా విడుదల చేయడంతో పాటు రుణాలు రీషెడ్యూల్ చేయాలన్నారు. కరువు సాయాన్ని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్, నాయకులు కృష్ణ, అనిల్, సుభాశ్, భూషణం, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
హవేళిఘణాపూర్(మెదక్): క్రీడల్లో పాల్గొనే విద్యార్థులకు ఏకాగ్రత, చురుకుదనం, వేగం అవసరమని డీఈఓ రాజు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పీఎన్‌ఆర్ ఇండోర్ స్టేడియంలో పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–14, 17 బాలుర విభాగాల్లో ఉమ్మడి జిల్లాస్థాయి షటీల్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈ పోటీల్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన సుమారు 200 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో ప్రతిభకనబర్చిన అండర్–17 బాలుర విభాగంలో ఐదుగురు, అండర్–14 విభాగంలో ఐదుగురు చొప్పున ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.
‘కాంగ్రెస్ బలోపేతానికి
కృషి చేయండి’
నారాయణఖేడ్: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ను శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి కలిశారు. జిల్లాలో కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేయడంతో పాటు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు.


